అంబటి ఇంటి వద్ద పోలీసుల అత్యుత్సాహం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఆదివారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇటీవల కాలంలో అంబటి నివాసంపై, కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేసి, తిరిగి ఆయనపై అక్రమ కేసులు బనాయించిన విషయం విదితమే. ఈ క్రమంలో పార్టీ శ్రేణులు ఆయన కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు తరలివచ్చాయి. పలువురు నేతలు కూడా ఇందులో భాగంగా వచ్చి, వెళ్తున్నారు. ఆదివారం ఇదే క్రమంలో అంబటి నివాసానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మరికొంతమంది వచ్చిన నేపథ్యంలో పట్టాభిపురం ఎస్‌ఐ నాగేంద్ర ఓవర్ యాక్షన్ చేశారు. అంబటి ఇంటి వద్ద ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోయినా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని అంటూ హడావుడి చేశారు. అక్కడ పెట్టిన కార్లన్నీ తీయాలని చెప్పడంతో పోలీసుల తీరుపై పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ జోక్యం చేసుకొని అంబటి నివాసం వద్ద నాలుగు నివాసాల వారివే ఉన్నాయని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాము క్రమశిక్షణగానే వాహనాలను పార్కింగ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో ఎస్‌ఐ నాగేంద్ర అక్కడి నుంచి వెనుదిరిగారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించటం సరికాదంటూ అంబటి మురళీకృష్ణ పేర్కొన్నారు.


