మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్‌మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది.
క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.
గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం
కరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది.
1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది.
1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.
సంబంధాలు కొంత మెరుగైనా...
రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు.
వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది.
ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.
మూడు శక్తులు ‘ఒక్కటైతే’?
నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు.
మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.
బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.
-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు
-గురజాల శ్రీనివాసరావు


