అన్నదాతలకు అభయహస్తం | Telangana Congress Government's Abhayahastham Scheme For The Agricultural Sector | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు అభయహస్తం

Jun 30 2026 8:40 AM | Updated on Jun 30 2026 8:41 AM

Telangana Congress Government's Abhayahastham Scheme For The Agricultural Sector

అభిప్రాయం

సమాజానికి వెన్నెముక అయిన రైతులకు అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. ‘రైతు భరోసా’తో రైతుల్లో పూర్తి విశ్వాసం కలిగిస్తోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అన్నదాతలకు అభయం హస్తం అందిస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ‘రైతు భరోసా’ అందించిన ప్రభుత్వం మరోసారి 2026 జూన్‌ 30న ఖరీఫ్‌ సీజన్‌కుగానూ ఇచ్చేందుకు సిద్ధమైంది.

రైతు సంక్షేమమే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు వరంగల్‌ వేదికగా ‘రైతు డిక్లరేషన్‌’లో ప్రకటించిన విధంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నా లకు బోనస్, రైతు బీమా, రైతు కూలీలకు ‘ఇందిరమ్మ భరోసా’ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తమది రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపించుకుంది.

ప్రభుత్వం ఏటా ఎకరాకు రూ. 12 వేలు రైతు భరోసాగా అందిస్తోంది. 2025 జూ¯Œ లోనూ, 2026 మార్చిలోనూ 70 లక్షల మందికి అందించింది. మూడోసారి జూన్‌లో ఒకే విడతలో ఈ సాయం అందించనున్నది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసింది. దీంతో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ. 21 వేల కోట్ల మేలు చేకూరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా సన్న వరికి బోనస్‌ అందించడంతో రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతం పెరిగింది. దేశంలోనే తొలిసారిగా రైతు కూలీలను గుర్తించి వారిలో విశ్వాసం కలిగించేలా ‘ఇందిరమ్మ రైతు భరోసా’ అందిస్తోంది. రైతు కుటుంబాలందరికీ ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తూ వేల కోట్ల రూపాయలతో రైతు బీమా కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకా రాలు లభించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం భారీగా పంటలను కొనుగోలు చేస్తోంది.

నిధులు దుర్వినియోగం కాకుండా...
అన్నదాతలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా ఉంటే భరించలేని బీఆర్‌ఎస్‌ పార్టీ అక్కసుతో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. గతంలో వారి ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఎకరాకు రూ. 10 వేలు మాత్రమే ఇస్తే... కాంగ్రెస్‌ సర్కార్‌ మరో రెండువేలు అధికంగా ఇస్తోంది. గత ప్రభుత్వ అవకతవకలు పునరావృతం కాకుండా ఉండాలనే లక్ష్యంతో ప్రస్తుత సర్కారు వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని నిర్ణయించింది. అందుకే ప్రజా నిధులు దుర్వినియోగం కావడం లేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయానికి ఏమాత్రం ఉపయోగపడని భూములకు రైతుబంధు పథకం కింద రూ. 22 వేల కోట్లకుపైగా చెల్లించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసింది.

రైతులకే కాకుండా రైతు కూలీలకు కూడా సమన్యాయం జరి గేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమిలేని రైతు కూలీలకు ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారకూడదని, వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో ‘వరంగల్‌ డిక్లరేషన్‌’లో ప్రకటించినట్టు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం కింద ఏటా రూ. 12 వేలు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంతో వ్యవసాయ యజ్ఞంలో పాల్గొనేవారందరికీ న్యాయం చేసినట్టయ్యింది.

శుభప్రదమైన ఏరువాక పౌర్ణమి మరుసటి రోజు జూన్‌ 30న ప్రభుత్వం నిర్వహించనున్న రైతు భరోసా పంపిణీ మరోసారి అన్న దాతల పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిబద్ధతకు నిదర్శనంగా నిలవనుంది. రైతు సంతోషమే రాష్ట్ర సుభిక్షతకు పునాది అనే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.


- బి. మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement