యువత.. తన కాళ్లపై తాను నిలవాలి! | Sakshi Guest Column On Youth | Sakshi
Sakshi News home page

యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!

Published Tue, Jun 18 2024 5:03 AM | Last Updated on Tue, Jun 18 2024 9:19 AM

Sakshi Guest Column On Youth

అభిప్రాయం

మనుషులు తప్ప జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తరువాత తల్లితండ్రులపై ఆధారపడటం తగ్గిస్తుంది. తన కాళ్లమీద తాను స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజ్‌ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే  తల్లి తండ్రులపై ఎక్కువకాలం ఆధారపడుతున్నారు.

అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. 

అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ... తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. 

జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న  అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది. 

ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా, ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ల సంఖ్య ఎక్కువగా వుండేది. లండన్, జపాన్‌ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగా వుండేది. వీళ్ళను ‘ఫీటర్‌’ అని పిలిచే వాళ్ళు. ఎప్పుడు అయితే కంప్యూటర్‌ సెన్స్‌ వల్ల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కాని, మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పక పోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. 

చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడాలి. ‘శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కాని, పరాన్న జీవులే వయసు మీద పడుతున్నా తల్లితండ్రుల దగ్గర చెయ్యి చాస్తూవుంటారు. నేటి ఇంటర్నెట్‌ యుగంలో... సామాజిక మాధ్యమాలు, చలన చిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించ లేకపోతున్నారు. 

ఇటువంటి వాళ్లు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనబడుతుంటారు. దేశంలో అంత కంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా వుంది. లేకపోత మనదేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారి పరాన్న జీవుల సమాజంగా తయారవుతుంది అనటంలో ఏ సందేహం లేదు.

ఈదర శ్రీనివాస రెడ్డి  
వ్యాసకర్త ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement