
వాస్తవంగానే తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుందని చంద్రబాబు నమ్ముతుంటే బేలగా అంతా తన వెనుక ఉండాలని ఎందుకు అడుగుతారు? అందరూ కలిసి రావాలి, టీడీపీ నాయకత్వం వహిస్తుందని ఎందుకు చెబుతారు? మళ్లీ త్యాగాలు చేయడానికి సిద్ధమని ఎందుకు సంకేతం పంపుతారు? ఇక జనసేన అధినేతనేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ ఏకం చేస్తామంటారు.
వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని పిల్లిగంతులు వేస్తున్నారో చెప్పడానికి ఇవి చాలు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని వారే చెబుతారు. మళ్లీ ఒంటరిగా పోటీ చేయడా నికి భయపడతారు. కానీ వైఎస్ జగన్ ఎప్పుడూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఒకే మాట చెప్పారు. ఆ ప్రకారమే నడుచుకుంటున్నారు.
అది తెలుగుదేశం కార్యకర్తల సభ. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏదైనా మంచి సందేశం ఇస్తారేమోనని కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు. కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, ఈ అరాచక పాలనను అంతం చేయ డానికి ప్రతి టీడీపీ కార్యకర్తా కొండవీటి సింహంలా పనిచేయాలి.. బొబ్బిలి పులిలా పనిచేయాలి అని సినిమా డైలాగులు పలికారు.
అంతలోనే ఒక వ్యాఖ్య చేశారు. రాష్ట్ర పరిస్థితిని మార్చడానికి వైసీపీ కార్యకర్తలు కూడా భాగస్వాములు కావాలన్నారు. దాంతో టీడీపీ కార్యకర్తలు నిర్ఘాంతపోయారు. చంద్రబాబు వైసీపీ కార్యకర్తలను బతిమిలాడుతున్నారేమిటి? వారిని చంద్రబాబు పిలిస్తే మాత్రం వస్తారా? తమ పరువు తీసేశారే అని వారు ఉసూరుమన్నారు.
ఇంకేమైనా బలమైన సందేశం ఇస్తారేమోలే అని కార్యకర్తలు ఎదురుచూశారు. టీడీపీకి అధికారం కొత్తేమీ కాదు.. నలభై ఏళ్లలో ఇరవై రెండేళ్లు అధికారంలో ఉన్నాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలన్నది తన ఆకాంక్ష అని చెప్పారు చంద్రబాబు. మళ్లీ గెలుస్తామని భరోసా ఇచ్చారులే అని సంతోషించే లోపే చంద్రబాబు వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడానికి అంతా కలిసి రావాలి.. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహి స్తుంది.. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే సరికి– అంటే టీడీపీకి అధికారం రావడం తుస్సే అని చెబుతున్నారా అన్న అనుమానం అక్కడ ఉన్నవారికి కలిగింది.
మళ్లీ అదే చంద్రబాబు మరో సందర్భంలో క్షమించరాని తప్పులు చేస్తున్న జగన్‌కు రాబోయే ఎన్నికలలో ఒక్క ఓటు అయినా పడుతుందా అని ప్రశ్నించారు. జగన్‌కు ఒక్క ఓటు కూడా రాదనుకుంటే అందరూ కలసి రావాలని ఇతర పార్టీలవారిని బతిమిలాడటం ఎందుకు? అని టీడీపీ కార్యకర్తలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు.
వాస్తవంగానే తెలుగుదేశం పార్టీ బలం పుంజుకుందని చంద్రబాబు నమ్ముతుంటే బేలగా అంతా తన వెనుక ఉండాలని ఎందుకు అడుగు తారు? మళ్లీ త్యాగాలు చేయడానికి సిద్ధమని ఎందుకు సంకేతం పంపుతారు? పైగా ఇప్పటికే చంద్రబాబు కుప్పంలో జనసేనపై తమది వన్ సైడ్ లవ్ అని చెప్పి పార్టీ పరువు తీసుకున్నారు. ఆ తర్వాత ఏదో ప్లాన్ ప్రకారం అన్నట్లుగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అందరినీ ఏకం చేస్తామని పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు చెప్పి ఆ పార్టీ వారిని విస్తుపరిచారు.
కానీ బీజేపీ వారికి దిమ్మ దిరిగినంత పనైంది. తామేమో పవన్ కళ్యాణ్ తమ సీఎం అభ్యర్థి అని చెప్పి పరువు తగ్గించుకుంటే, ఆయనేమో చంద్రబాబు వెనుక తిరగడమేంటో అని బీజేపీ వారు నెత్తీ నోరూ కొట్టుకోవలసి వచ్చింది. అందుకే పొత్తుపై మొదటిసారిగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు కాస్త భిన్నంగా మాట్లాడారని పిస్తుంది. తమ పొత్తు జనంతోనేననీ, టీడీపీతో పొత్తులోకి జనసేన వెళుతుందా, లేదా అన్నది పవన్ కళ్యాణే జవాబు ఇవ్వాలని స్పష్టం చేశారు. మొత్తం మీద ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ మాదిరిగా ఏపీ ప్రతిపక్ష రాజకీయం సాగుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని పిల్లిగంతులు వేస్తున్నదీ ఈ ఉదంతాలు తెలియజేస్తాయి. ఒక పక్క ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై చాలా వ్యతి రేకత ఉందని వారే చెబుతారు. మరో వైపు ఒంటరిగా పోటీ చేయ డానికి వణికిపోతున్న సంకేతాలు ఇస్తారు. వైఎస్ జగన్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గానీ, 2014 ఎన్నికల సమయంలో గానీ ఎన్నడైనా ఇలా పిరికితనంతో మాట్లాడారా? తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఒకే మాట చెప్పారు.
ఆ ప్రకారమే నడుచుకుంటున్నారు. నిజానికి 2014లో జగన్‌తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని బీజేపీలో కొందరు అనుకున్నారు. కానీ దానివల్ల చంద్రబాబుకు నష్టం జరుగుతుందని భావించిన బీజేపీలోని టీడీపీ అనుకూల వాదులు హడావుడిగా పొత్తు కుదిర్చారని అంటారు. దానివల్ల బీజేపీ బాగా నష్టపోయిందని ఆ పార్టీ వారే తరచు చెబుతుంటారు.
2014లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా, జగన్ ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. ఆయన మళ్లీ పోరాట పథంలోకి వెళ్లారు. తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలనూ, ముగ్గురు ఎంపీలనూ టీడీపీ కొనుగోలు చేసినా లెక్కచేయలేదు. తన ఎజెండా ఇదీ అని ప్రజలకు చెప్పారు. పాజిటివ్ ఓటు సాధించారు. తాను చెప్పిన విధంగా ఎన్ని కల హామీలను 95 శాతం అమలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
తమకు పాలన వచ్చని చెప్పుకునే చంద్రబాబేమో 400 హామీలను ఇచ్చి వాటిని అమలు చేయకపోగా పార్టీ వెబ్‌సైట్ నుంచి ఆ ఎన్నికల హామీ పత్రాన్ని కూడా తీసివేశారు. మరి ఎవరు సమర్థులు అన్నది ప్రజలు ఆలోచించుకోలేరా? చంద్రబాబు విధానాలైనా, జగన్ విధానాలైనా అందరికీ నచ్చాలని ఏమీ లేదు. కానీ చెప్పినవాటిని చేస్తున్నారా, లేదా అన్నది చూసినప్పుడు జగన్‌కు 95 శాతం మార్కులు వస్తే, చంద్రబాబుకు పాస్ మార్కు 35 శాతం రావడం కూడా కష్టం అవుతుంది.
అందుకే జనం జగన్ వెంట ఉన్నారని భయపడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాగోలా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 వంటివాటిని అడ్డం పెట్టుకుని, ఉన్నవీ లేనివీ ప్రచారం చేసి అధికారం అందుకోవాలని తహతహలాడు తున్నారు. అందుకే చంద్రబాబు అందరినీ కలిసి రావాలనీ, టీడీపీ నాయకత్వం వహిస్తుందనీ చెప్పిన కాసేపటికే జనసేన నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పొత్తులపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
దానికి తగి నట్లుగానే పవన్ కళ్యాణ్ తన నంద్యాల పర్యటనలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీనే మళ్లీ గెలుస్తుందని మనసులో ఉన్న భయం బయటకు చెప్పేశారు. పొత్తుపై చంద్రబాబు నేరుగా ప్రతిపాదిస్తే, అప్పుడు స్పష్టత ఇస్తానని అనడం కేవలం కంటి తుడుపు మాత్రమే. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్లే అనిపి స్తోంది. మరి పొత్తులో ఉన్న బీజేపీ మాటేమిటీ అన్నదానికి సమాధానం రాదు.
చంద్రబాబు త్యాగాలకు సిద్ధం అనడం ద్వారా కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తు న్నారా? ఇప్పటికిప్పుడు ఆ మాట చెబితే మళ్లీ ఏ సమస్య వస్తుందో నని మధ్యలోనే వెనక్కి తగ్గారా? పవన్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రకటిస్తారని ఆశపడ్డ జనసేన కార్యకర్తలకు మాత్రం ఒక అనుమానం వచ్చి ఉండాలి. కూటమి ఏర్పడినా అధికారం వస్తుందన్న గ్యారంటీ లేదు. ఒక వేళ కూటమి గెలిచినా చంద్రబాబు తమకు అధికారం దక్కనిస్తారా అని వారు భావించి ఉండాలి.
చివరిగా ఒక విషయం చెప్పాలి. చంద్రబాబు ఉత్తరాంధ్ర టూర్ మొదటి రోజున ఒక చోట గ్రామస్థులతో మాట్లాడుతూ ఇంగ్లిష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలవడం తప్ప ఉపయోగం ఏముం దని అన్నారన్న వీడియో వైరల్ అయింది. ఆయన అలా అంటున్న ప్పుడు అక్కడ ఉన్న కొందరు టీడీపీ కార్యకర్తలకు కూడా కోపం వచ్చినట్లుంది.
తన కుమారుడు లోకేష్‌ను, మనుమడు దేవాన్ష్ను మొద్దబ్బాయిలను చేయడానికే ఆంగ్ల మీడియంలో చదివిస్తున్నారా అన్న సంశయం వచ్చి ఉండాలి. దాంతో అక్కడ గుమిగూడినవారిలో పలువురు జై జగన్ అన్న నినాదాలు చేశారని వార్తలు వచ్చాయి. చంద్రబాబేమో తనకు వైసీపీ కార్యకర్తలు కూడా మద్దతు ఇవ్వాలని కోరుతుంటే, వారి సపోర్టు సంగతేమో గానీ, ఉన్న తన కార్యకర్తలు కూడా జగన్‌కు జై కొట్టి టీడీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అయ్యారని అందరికి అర్థం అవుతోంది కదా!
-వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు