
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఎన్నో మతాలు ఉన్నాయి. ఎన్నో ఆరాధనా పద్ధతులు ఉన్నాయి. ఆలయాల తొలి ఆనవాళ్లు క్రీస్తుపూర్వం పన్నెండువేల ఏళ్లనాటివి. దాదాపు అన్ని మతాలూ దైవభక్తిని ప్రబోధించేవే! జ్ఞానమార్గాన్ని బోధించిన మతాలు లేకపోలేదు గాని, జనాలను భక్తిపారవశ్యం ఆకట్టుకున్నంతగా జ్ఞానం ఆకట్టుకున్న దాఖలాలు తక్కువ. భాషలు పుట్టి, లిపులు ఏర్పడి, సమాచారాన్ని శిలల మీద, మట్టి పలకల మీద, లోహపు రేకుల మీద, ఆకుల మీద నిక్షిప్తం చేయడం మొదలుపెట్టిన తర్వాత గాని ప్రపంచంలో జ్ఞానవ్యాప్తి మొదలు కాలేదు. మనుషులకు అక్షరజ్ఞానం అబ్బిన తర్వాత తమకు తెలిసిన సమాచారాన్ని తమకు దొరికిన సాధనాలను ఉపయోగించుకుంటూ లిఖితపూర్వకంగా నిక్షిప్తం చేయడం మొదలుపెట్టారు. చరిత్రలో తొలినాటి రచనల ఆనవాళ్లు క్రీస్తుపూర్వం నాలుగో సహస్రాబ్ది నాటివి.
మానవాళి జ్ఞానయానానికి అవి తొలి మైలురాళ్లు. భక్తిపారవశ్యం ఒకవైపు, జ్ఞానయానం మరోవైపు మానవాళి మనుగడను ఆది నుంచి నిర్దేశిస్తూనే ఉన్నాయి. సామాజిక, తాత్త్విక, శాస్త్ర, సాంకేతిక పురోగతికి ఎందరో జ్ఞానులు బాటలు వేశారు. లోకమంతటా తమ జ్ఞానకాంతులను ప్రసరించారు. వినువీథిలో ఒకవైపు సూర్యుడు సహా అసంఖ్యాక నక్షత్రాలు నిరంతరం వెలుగులను వెదజల్లుతున్నా, మరోవైపు చీకటి నిండిన కృష్ణబిలాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ లోకంలో ఒకవైపు జ్ఞానులు ప్రసరించిన జ్ఞానకాంతులు ఉన్నా, మరోవైపు మౌఢ్యాంధకారం కూడా అంతే గాఢంగా ఉంది. మానవాళిలో మౌఢ్య నిర్మూలనమనేది ఇప్పటికీ నెరవేరని కలగానే మిగిలింది. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అని గురజాడ ఆకాంక్షించారు. ఇప్పటి పరిస్థితులను గమనిస్తే, ఆయన ఆకాంక్ష నెరవేరడానికి ఇంకెన్ని యుగాలు పడుతుందో చెప్పడం కష్టం.
ఆరాధించే వాటికి ఆలయాలను నిర్మించుకోవడం అనాది సంస్కృతి. దేవాలయాలను, ప్రార్థనాలయాలను నిర్మించుకున్న మనుషులు అక్కడితో ఆగిపోలేదు. ఆరాధ్య నటీనటులకు, నాయకులకు సైతం ఆలయాలను నిర్మించే స్థాయికి పరిణామం చెందారు. ప్రపంచంలో మౌఢ్యం శ్రుతిమించి మితిమీరిన కాలాల్లో సమాజాన్ని సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు ప్రయత్నించారు. జ్ఞానకాంతులతోనే మౌఢ్యాంధకారం పటాపంచలవుతుందని గ్రహించి, జ్ఞానవ్యాప్తికి కృషి చేశారు. ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానసంపదను అందించడానికి గ్రంథాలయాలను నెలకొల్పారు.
ప్రపంచంలోని తొలి గ్రంథాలయం క్రీస్తుపూర్వం మూడో సహస్రాబ్దిలో ఏర్పడింది. ఇప్పటి సిరియాలోని టెల్ మార్దిక్ గ్రామంలో ఉందది. ‘ది రాయల్ లైబ్రరీ ఆఫ్ ఎబ్లా’ అనే ఈ గ్రంథాలయం తొలి జ్ఞాననిధి. ఇందులో ఇరవైవేల మట్టిపలకలపై ఉన్న రాతలు చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇది ద్విభాషా గ్రంథాలయం కావడం ఇంకో విశేషం. సుమేరియన్, ఎబ్లాౖయెట్ భాషలలో చిత్రలిపిలో రాసిన రాతలు ఆనాటి సామాజిక, వాణిజ్య, విద్యాపరమైన పరిస్థితులకు సాక్షీభూతంగా నిలిచి ఉన్నాయి. ఈ మట్టిపలకల్లో కొన్ని ఇప్పుడు సిరియాలోని డెమాస్కస్, అలెప్పో తదితర నగరాల్లోని మ్యూజియంలలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో మన ఉపఖండ భూభాగంలోనూ నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో గ్రంథాలయాలు ఉండేవి. ఇప్పుడు వాటి శిథిలావశేషాలు తప్ప ఆనాటి జ్ఞానసంపద ఏదీ మిగిలి లేదు. పురాతన గ్రంథాలయాలు ఏర్పడిన కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా మూఢాచారాలు కూడా విస్తృతంగా ఉండేవి.
ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు జరిగాయి. జాన్ గూటెన్‌బర్గ్ రూపొందించిన ముద్రణ యంత్రం పుస్తకాల రూపురేఖలను మార్చేసింది. ఆధునిక పుస్తకాలకు అంకురారోపణ చేసింది. పారిశ్రామిక విప్లవ కాలంలో పుస్తకాల ముద్రణ పెరగడం మొదలైంది. వలస పాలనలు మొదలవడంతో ప్రజలకు బహుభాషా పరిచయం ఏర్పడి, సమాచార ఆదాన ప్రదానాలు ఊపందుకున్నాయి. బ్రిటిష్ హయాంలో మన దేశంలో నాటి కలకత్తా నగరంలో ‘ఏషియాటిక్ సొసైటీ లైబ్రరీ’ పేరుతో తొలి ఆధునిక గ్రంథాలయం 1781లో ఏర్పడింది. అప్పటికి సతీసహగమన దురాచారంపై ఇంకా నిషేధం విధించలేదు. మన తెలుగునేల మీద 1886లో తొలి ఆధునిక గ్రంథా లయాన్ని విశాఖపట్నంలో మంతిన సూర్యనారాయణమూర్తి నెలకొల్పారు. అప్పటికి కన్యాశుల్కం దురాచారం తీవ్రంగా ఉండేది. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే అయ్యంకి వెంకటరమణయ్య నేతృత్వంలో గ్రంథాలయోద్యమం కూడా మొదలైంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అనేక మార్పులు జరిగాయి. ఎంతో అభివృద్ధి జరిగింది. ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది. పత్రికలు, అధునాతన ప్రసార మాధ్యమాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. అయినా, జనాల్లో మౌఢ్యం పూర్తిగా అంతరించలేదు. ఇప్పటికీ మన దేశంలో గ్రంథాలయాల కంటే దేవాలయాలు, ప్రార్థనాలయాలే ఎక్కువ. వైజ్ఞానికాభివృద్ధి ఫలితంగా అందివచ్చిన సాంకేతికత సాధనాలను కూడా వ్యర్థవినోదానికి వినియోగించుకోవడంలో మన జనాలు అపార ప్రజ్ఞాధురీణులు. మౌఢ్య ప్రాబల్యం ఎంతగా పెరుగుతున్నా, జ్ఞానారాధకులు అంతరించిపోలేదు. అందుకు నిదర్శనమే కేరళలోని కాసర్‌గోడ్ జిల్లా కంబళూరులో వెలసిన పుస్తకాలయం. పుస్తకమే ఇందులోని దేవత. పుస్తకాలే ప్రసాదం. ‘జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అనే ఆకాంక్షను వెలిగించడానికి ఇదొక ఆశాదీపం.