నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ | Sakshi
Sakshi News home page

నిబద్ధతతోనే కాలుష్య నియంత్రణ

Published Tue, Jan 30 2024 12:12 AM

Sakshi Guest Column On Pollution control

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అరుదుగా మాత్రమే నీలి ఆకాశం కనబడుతోంది. గాలి నాణ్యత తీవ్రతకు ఇదొక సంకేతం. వాయు కాలుష్యం ఇప్పుడు జాతీయ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, గాల్లోని నలుసు పదార్థాల (పీఎం) సాంద్రత 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్‌ మీటరుకు 5 మైక్రో గ్రాములు మించకూడదు. ఇది ఢిల్లీ లాంటి నగరంలో 102. ఈ గాలిని పీల్చడం ప్రాణాంతకం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం’ కొంతమేరకు ఫలితమిస్తున్నా అది సరిపోదు. మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో మనం వ్యవహ రిస్తున్నాం. ప్రజారోగ్య దృక్కోణం నుండి చూస్తే ఎంత ప్రగతి అయినా తక్కువే. నిరంతర రాజకీయ నిబద్ధత మాత్రమే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. 

శీతకాలపు నెలల్లో భారీ పొగమంచుతో కప్పబడి ఉండే ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నీలి ఆకాశం, ప్రకాశవంతమైన సూర్యబింబం అరుదుగా గోచరిస్తుంటాయి. అయితే పేలవమైన గాలి నాణ్యత అనేది ఇప్పుడు జాతీయ సమస్య అయింది. కాకపోతే గత ఐదేళ్లలో, వాయు కాలుష్యం ఒక విధానపరమైన సమస్యగా కూడా గుర్తింపు పొందింది. అయిన ప్పటికీ ‘జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమ’ (ఎన్‌సీఏపీ) అయిదేళ్ల అంచనాను పరిశీలిస్తే, అర్థవంతమైన, శాశ్వతమైన ప్రయోజనాలను అందించడానికి గట్టి ప్రయత్నాలు అవసరమని తెలుస్తుంది.

అపఖ్యాతి పాలైన భారతదేశ గాలి నాణ్యతను పరిష్కరించడానికి తెచ్చిన మొదటి విధానం – 2019లో ప్రారంభించిన ఎన్‌సీఏపీ. కాలుష్య స్థాయులను, గాలిలోని నలుసు పదార్థాల గాఢతలను ప్రధాన నగరాల్లో 30 నుంచి 20 శాతం తగ్గించాలనే స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించింది. దీనికి కేంద్రం నుండి రూ. 443 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుండి రూ. 4,400 కోట్ల ప్రారంభ కేటాయింపులు జరిపారు. 

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి చెందిన నిరంతర పరిసర వాయు నాణ్యతా పర్యవేక్షణ కేంద్రాల విశ్లేషణ (భారత దేశ వాయు నాణ్యతా మానిటర్ల నెట్‌వర్క్‌) పురోగతి స్థిరంగా ఉన్నప్ప టికీ, ఎన్‌సీఏపీని అమలు చేయడంలో వ్యూహాత్మకమైన, సైన్స్‌ ఆధారిత మార్పుల అవసరం ఉంది. ఉదాహరణకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గాల్లోని నలుసు పదార్థాల (పర్టిక్యులేట్‌ మ్యాటర్‌) సాంద్రతకు పరిమితులు నిర్దేశించింది. 2.5 పీఎం అయితే, ఒక క్యూబిక్‌ మీటరుకు 5 మైక్రోగ్రాములు, 10 పీఎం అయితే ఒక క్యూబిక్‌ మీటరుకు 15 మైక్రోగ్రాములు మించకూడదు.

ఎన్‌సీఏపీ అమలయ్యాక, ప్రత్యేకించి 2.5 పీఎం వారణాసిలో 96 నుంచి 26.9 మైక్రోగ్రాములకు తగ్గింది. ఆగ్రాలో 73 నుంచి 33కు, జో«ద్‌పూర్‌లో 81.8 నుంచి 40.6కు మెరుగ్గా తగ్గింది. కానీ ఢిల్లీలో మాత్రం 108 నుంచి 102కు మాత్రమే తగ్గింది. పీఎం 2.5 స్థాయుల డేటా 2019–2023 మధ్య 46 నగరాలకు మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం 27 నగరాల్లో మాత్రమే తగ్గుదల మెరుగ్గా ఉంది. 10 పీఎం విషయంలో ఐదేళ్ల డేటా కేవలం 46 నగరాలకు అందుబాటులో ఉండగా, అందులో కేవలం 24 నగరాల్లో మాత్రమే మెరుగుదల కనబడింది.

50 శాతం నగరాలు గణనీయమైన అభివృద్ధిని చూపుతున్నా యనీ, ఇది ఎన్‌సీఏపీ విజయవంతమైన ప్రగతిని సూచిస్తోందనీ ఎవరైనా వాదించవచ్చు. కానీ మనం మానవ కణజాలంలోకి చొచ్చుకుపోయే కాలుష్య కారకాలతో వ్యవహరిస్తున్నాము. పైగా రక్తపోటు, మధుమేహం వంటివాటిని ఇవి మరింత తీవ్రతరం చేయవచ్చు. 2.5 పీఎం రక్త–మెదడు అవరోధాన్ని కూడా దాటవచ్చు. దీర్ఘకాలం అలాంటి గాలిలో మసలితే ప్రాణాంతకం అవుతుంది. కాబట్టి, ప్రజారోగ్య దృక్పథం నుండి చూస్తే మరింత కఠినమైన ప్రగతి అత్యవశ్యం.

మరో సమస్య ఏమిటంటే, ఎన్‌సీఏపీలో సమన్వయం కొరవడింది. ఢిల్లీ లాంటి నగరంలో సరి–బేసి ట్రాఫిక్‌ను అమలు చేయడం, ‘జాతీయ రాజధాని ప్రాంతం’ నుండి నిబంధనలు పాటించని వాహనాలను తొలగించడం, వ్యర్థాలను బహిరంగంగా కాల్చడాన్ని నిరోధించడం, దుమ్మును తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు అన్నీ అమలవుతున్నాయి. అయినప్పటికీ, కాలుష్యానికి సంబంధించిన ఇవే కారణాలు ఉన్న మిగిలిన ప్రాంతాలకు విస్తరించకుంటే ఈ చర్యలు సరిపోవు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల దట్టమైన పొగమంచుతో చలి కాలం ప్రారంభం కావడం దీనికి స్పష్టమైన ఉదాహరణ.

ఢిల్లీ నగరంలో నమోదైన సుమారు 80 లక్షల వాహనాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ఉష్ణోగ్రతలో తగ్గుదల గాలిలో నిలిచివుండే అణువుల స్థాయులను  ప్రమాదకరంగా పెంచుతుంది. ఈ కాక్‌టెయిల్‌ను ఢిల్లీ నివాసులు ప్రతి సంవత్సరం కొన్ని వారాల పాటు పీల్చుకుంటున్నారు. గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (గ్రాప్‌) ప్రతి శీతాకాలంలో ఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతంలో ఊహించిన ప్రతిస్పందనగా అమలులోకి వస్తుంటుంది. అయితే దాని ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యం కావాలి.

రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సజావుగా సమన్వయం లేకపోతే ఈ సమస్య ఇలాగే కొనసాగుతుంది. జాతీయ రాజధాని వెలుపల, సీపీసీబీ పర్యవేక్షణ నెట్‌వర్క్‌ అసమానంగా ఉందని మా విశ్లేషణ చూపుతోంది. ఇది మూల్యాంకనానికి వ్యత్యాసాల పొరను జోడిస్తుంది. ముజఫర్‌పూర్, బిహార్‌ లాంటి రద్దీ ప్రదేశాలలో కేవలం మూడు మానిటర్లు ఉన్నాయి. అదే ఢిల్లీ అంతటా 37 స్టేషన్‌లు,ముంబై అంతటా 22, హైదరాబాద్‌లో 14 స్టేషన్లు ఉన్నప్పుడు మనం తప్పుడు నిర్ధారణలకు వచ్చే ప్రమాదం ఉంది.

ప్రామాణిక పర్యవేక్షణ విధానంలో, పోల్చదగిన జనాభా ఉన్న నగరాలు ఒకే విధమైన లేదా కనీసం సారూప్య సంఖ్యలో గాలి నాణ్యత మానిటర్లను కలిగి ఉంటాయి. స్థానిక కాలుష్య మూలాల శాస్త్రీయ అవగాహన ఆధారంగా ఆ స్థానాలు ఉంటాయి. నగరాల కాలుష్య సాంద్రతలు ఒకే పారామి తుల సెట్‌లో ట్రాక్‌ చేయబడతాయి. ఇది వాటి గాలి నాణ్యత ధోర ణులపై ‘గ్రాన్యులర్‌’(కణికీయ) అవగాహనను పెంపొందించడంలో సహాయపడుతుంది.

వాయు కాలుష్య ప్రయత్నాలకు సంబంధించిన నిధుల కేటాయింపుల్లో కూడా సమస్యలున్నాయి. తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్న ఢిల్లీకి కేవలం రూ.38 కోట్లు మాత్రమే అందాయి. అందులో అది 10 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. గాలి నాణ్యత చర్యల కోసం వర్తించే నిధులను క్రమబద్ధీకరించడంలో ఇదొక ప్రశ్నగానే ఉండిపోతుంది. గ్రేటర్‌ ముంబైకి రూ.938 కోట్లు అందగా, దానిలో రూ.660 కోట్లు వినియోగించుకుంది.

అయినప్పటికీ, జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్‌సీఏపీ)లో సానుకూల అంశాలున్నాయి. వీటిలో మొదటిది 2026 నాటికి 10 పీఎం గాలి సాంద్రతలను 40 శాతానికి తగ్గించడం. ఇది ప్రతిష్ఠా త్మకమైన లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. అందుకే దీన్ని ఎన్‌సీఏపీ అమలు కాని నగరాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రేటర్‌ నోయిడా (ఉత్తర ప్రదేశ్‌), భివాడీ (రాజస్థాన్‌) వంటివి తీవ్ర కాలుష్య స్థాయులను నివేదించాయి.

ఇంకా, రంగాల వారీగా వివరణాత్మక చర్యలు ఉండాలి. ఇటుక బట్టీలు, నిర్మాణాలు, కూల్చివేత ప్రాజెక్టుల వంటి అత్యంత కాలుష్య కారకాలకూ... సిమెంట్, ఉక్కు కర్మాగారాలకూ భిన్నమైన విధానం అవసరం. అదేవిధంగా, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం మాత్రమే నిర్దిష్ట వయస్సు దాటిన పెట్రోల్, డీజిల్‌ వాహనాలను నిషేధించింది. కానీ దేశవ్యాప్తంగా కఠినమైన, కాలుష్య నియంత్రణ వ్యవస్థ లేక పోతే... ప్రమాణాలను అందుకోని వాహనాలను ఇతర నగరాలకు తరలించే ప్రమాదం ఉంది. అప్పుడు కాలుష్య భారం మారదు. మరీ ముఖ్యంగా, ఎన్‌సీఏపీ ప్రధాన అంశంగా ప్రజారోగ్యం ఉండాలి. ప్రతి కొలమానాన్ని తప్పనిసరిగా ప్రతిపాదించాలి, చర్చించాలి. అంతే గాకుండా వాయు కాలుష్య కారకాలను తగ్గించడం పట్ల నిర్మాణా త్మకంగా ఉండాలి.

మనం ఎన్‌సీఏపీ రెండవ దశలోకి ప్రవేశించినప్పుడు చాలా ఆశించవచ్చు. ప్రభుత్వం అత్యున్నత స్థాయిలలో సమస్యను అంగీకరించడం అనేది మాత్రం ఇప్పటికి సానుకూలాంశం. కానీ నిరంతర రాజ కీయ నిబద్ధత మాత్రమే బలమైన ఫలితాలను ఇస్తుంది. 

ఆరతీ ఖోస్లా 
వ్యాసకర్త న్యూఢిల్లీలోని క్లైమేట్‌ ట్రెండ్స్‌ డైరెక్టర్‌
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో) 

Advertisement
 
Advertisement