వాయు కాలుష్య సూచీ, వాయు నాణ్యతా పరిరక్షణపై నిపుణుల సూచనలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో, రాష్ట్రంలో వివిధ రూపాల్లో కాలుష్యం కోరలు చాస్తుండటంపై వివిధ రంగాల నిపుణుల ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వాయు కాలుష్య సూచీ, వాయునాణ్యతా పరిరక్షణపై పలు సూచనలు చేశారు. ‘వాయు కాలుష్య సూచికలు–వాయు నాణ్యత నిర్వహణ’సదస్సులో పాల్గొన్నవారు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...
ఎలక్ట్రిసిటీని ప్రోత్సహించాలి...
హైదరాబాద్‌లో వాయు నాణ్యతకు సంబంధించి 2022లో అధ్యయనం చేశాం. వేసవి, చలికాలాల్లో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలకంటే కూడా పీఎం 2.5 స్థాయిలు ఒకటి, ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నట్టుగా గుర్తించాం. సాలిడ్/లిక్విడ్ ఫ్యూయల్‌ను నిషేధించి ఎలక్రిసిటీ, గ్యాసియస్ ఫ్యూయల్‌ను ప్రోత్సహించాలి. పరిశ్రమలకు నిరంతరంగా విద్యుత్ సరఫరా, సహజవాయువులను అందించడం ద్వారా అవి ఎక్కువగా బొగ్గు, ఫర్నేస్ అయిల్, వేస్ట్, వంటచెరుకు, ఇతరాలను ఉపయోగించకుండా నియంత్రించాలి. – ప్రొ.ముఖేశ్‌కుమార్‌శర్మ, ఐఐటీ, కాన్పూర్
కన్‌స్ట్రక్షన్ డస్ట్‌తో ముప్పు
ప్రస్తుత పరిస్థితుల్లో ‘కన్‌స్ట్రక్షన్ డస్ట్’అనేది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఇదేదో మామూలు సమస్యగా కాకుండా పట్టణ వాయునాణ్యత క్షీణతలో ప్రధానపాత్ర పోషిస్తోంది. భవననిర్మాణాలు, వాటి నుంచి వచ్చే దుమ్ము, ధూళి, చెత్త తదితరాలు పీఎం 10 పెరుగుదలకు కారణమవుతున్నాయి.
ఈ డస్ట్ కేంద్రీకృతమై పెద్ద నివాస, వాణిజ్య జోన్లలో తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇది శ్వాసకోశాలు, కార్డియో వాస్క్యులర్ జబ్బులకు దారితీస్తోంది. ఈ సమస్య నియంత్రణకు రాజకీయపరంగా ఎప్పటికప్పుడు గట్టిచర్యలు తీసుకోవాలి. – ప్రొ.సురేష్ జైన్, ఐఐటీ, తిరుపతి
గోధుమల దిగుబడి తగ్గింది
భారత్‌లో వాయు కాలుష్యం అతిపెద్ద పర్యావరణ, ఆరోగ్య సమస్యగా మారింది. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 16.7 లక్షల మరణాలు సంభవించాయి. వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో 30 శాతం గోధుమ దిగుబడి తగ్గింది. భవిష్యత్ వాయు నాణ్యతల అంచనాలు, ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ వంటివి అందుబాటులో లేకపోవడం పెద్దలోపం. వాయు కాలుష్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పనకు చర్యలు తీసుకోవాలి. – డా.సుమిత్‌శర్మ, ప్రోగ్రామ్ ఆఫీసర్, ఐరాస ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్
ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ
వాయు కాలుష్యంపై యుద్ధాన్ని ప్రకటించాల్సిన సమయం ఇదే. హైదరాబాద్ మహానగర విస్తీర్ణాన్ని పెంచేకొద్దీ వివిధ రూపాల్లో కాలుష్యం పెరుగుదల, ఇతర సమస్యలు సైతం రెట్టింపు అవుతాయి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ గురించి ఒక్క రాజకీయపార్టీ కూడా మాట్లాడడం లేదు. ప్రతీ నగరంలో ఎని్వరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లేదా అథారిటీని ఏర్పాటు చేయాలి. కనీసం దేశంలోని పది అతిపెద్ద నగరాల్లో దీనిని తీసుకురావాలి. – ప్రొ. కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
చిన్న చిన్న మొత్తాల్లో కాలుష్యం
అతి సూక్ష్మరూపాల్లోని కాలుష్య రూపాలు (పారి్టక్యులేట్ పొల్యూషన్) పీఎం 10, పీఎం 2.5 తదితరాలకు దుమ్మూ,ధూళి, పొగ 30 శాతం కారణమవుతున్నాయి. పేవ్‌మెంట్స్‌లేని రోడ్లు, ఫుట్‌పాత్‌లు సరిగా లేకపోవడం, డివైడర్లు లేకపోవడం, భవన నిర్మాణాల సందర్భంగా వాటి చుట్టూ కవర్లతో కవర్ చేయకపోవడం, రోడ్లపై గుంటలు, రోడ్డుపక్కల ఇసుక, ఇతర చెత్తాచెదారాలు పేరుకుపోవడం, చెత్తను కాల్చడం, పెద్ద మొత్తంలో పోగుపడిన చెత్తనుంచి దుర్వాసన... ఇలా చిన్న చిన్న మొత్తాల్లో కాలుష్యానికి కారణమౌతున్నాయి. – క్రిత్రికా చౌదరి, ఎయిర్ పొల్యూషన్ యాక్షన్ గ్రూప్
రోడ్‌మ్యాప్ ఆవశ్యకత
తెలంగాణలో రవాణా వ్యవస్థను ‘డీకార్బోనైజ్’చేసేందుకు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్ ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. చెత్తాచెదారం, రోడ్ డస్ట్ దహనం అనేవి ప్రధాన వనరులుగా ఉన్నందున కేవలం విద్యుత్ వాహనాలకు (ఈవీ)మొగ్గుచూపడమే కాకుండా మల్టీ–సెక్టోరల్ పొల్యూషన్ కంట్రోల్ అవసరం ఏర్పడింది. రాష్టంలో వాయుకాలుష్యానికి మూడోవంతు టూవీలర్లు, మీడియమ్, హెవీ వెహికల్స్ కారణమవుతున్నాయి. ఫోర్‌వీలర్లు 20 శాతం కారణం. – ప్రొ.రాజ్‌కిరణ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా


