రెండో దానికే మా ప్రభుత్వం మొగ్గు
పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి
డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
సాక్షి, హైదరాబాద్/సనత్‌నగర్: కాలుష్య ప్రభావిత ఊపిరితిత్తులతో తల్లడిల్లుతున్న పౌరుల సంపన్న రాష్ట్రం కావాలా? లేక ఆరోగ్య పౌరుల ఆధునిక రాష్ట్రం కావాలా..? అంటే తమ ప్రభుత్వం నిస్సందేహంగా రెండో అంశాన్నే ఎంచుకుంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. రెండో అంశాన్నే దృఢచిత్తంతో ఎంచుకోవడమే కాకుండా సాధన దిశగా ముందుకెళ్తున్నామన్నారు. పరిశుభ్రమైన గాలితోనే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు.
హైదరాబాద్ సహా యావత్ రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో రాష్ట్ర ప్రణాళికశాఖ నిర్వహించిన ‘వాయు కాలుష్య సూచికలు–వాయు నాణ్యత నిర్వహణ’సదస్సులో భట్టి కీలకోపన్యాసం చేశారు. ‘శుభ్రమైన గాలి లేకుండా జరిగే అభివృద్ధి నిజమైన ప్రగతి కాదు. గాలి నాణ్యత అనేది పర్యావరణ సూచీ మాత్రమే కాదు. అది ప్రజారోగ్య సూచీ, అది ఉత్పాదకత సూచీ, ఆర్థిక సూచీ కూడా...’అని అన్నారు.
‘ప్రస్తుతం గాలి కాలుష్యం.. అధిక రక్తపోటు తర్వాత ప్రపంచంలో మరణాలకు రెండో ప్రధాన కారణంగా మారింది. ఏటా 80 లక్షలకుపైగా అకాల మరణాలకు ఇది కారణమవుతోంది. ఇది మన పిల్లలను, వృద్ధులను, పని చేసే వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే గాలి నాణ్యత డ్యాష్‌బోర్డును త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
కాలుష్య ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు రెండు జీహెచ్‌ఎంసీ జోన్లలో ప్రత్యేక బృందాలను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని, చెప్పారు. జలాశయాల పునరుద్ధరణ, సహజ వనరుల సంరక్షణ, గాలి నాణ్యత మెరుగుదలపై ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని భట్టి తెలిపారు. గాలి నాణ్యత పర్యవేక్షణకు ప్రధాన పట్టణాల్లో 40 కొత్త స్టేషన్లను ఏర్పాటు చేశామని, తద్వారా రియల్‌టైమ్, విశ్వసనీయ డేటా అందుతుందన్నారు.
కార్యక్రమంలో ప్రణాళికశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్, అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్ నదీమ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి పాల్గొన్నారు.


