ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అమెరికా అధికారికంగా వైదొలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సిబ్బందిని యూఎస్ వెనక్కి పిలిపించింది. డబ్ల్యూహెచ్‌వోకు అగ్రరాజ్యం రూ.2 వేల కోట్లు బకాయిపడింది. బకాయిలు చెల్లించేవరకు యూఎస్ ఉపసంహరణ పూర్తికాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది
కొవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో, సంస్కరణలను అమలుచేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైందంటూ యూఎస్ ఆరోగ్య, మానవ సేవల విభాగం (HHS) ఆరోపించింది. సభ్య దేశాల రాజకీయ ప్రభావం కూడా కారణమేనని తెలిపింది. ఇకపై డబ్ల్యూహెచ్‌వోకు అమెరికా నుంచి వచ్చే అన్ని రకాల నిధులు నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వోకు సంబంధించిన సాంకేతిక కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఎస్ పేర్కొంది. అయితే, డబ్ల్యూహెచ్‌వో.. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ ఉపసంహరణ అమెరికాకే కాకుండా ప్రపంచ మొత్తానికి ఒక నష్టమని సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియేసస్ పేర్కొన్నారు.
సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా చెప్పగానే సరిపోదని.. సంస్థకు బకాయిపడిన 260 మిలియన్ డాలర్లను చెల్లించేవరకు డబ్ల్యూహెచ్‌వో నుంచి యూఎస్ ఉపసంహరణ సాధ్యం కాదని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. మరోవైపు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికారిక వర్గాలు స్పందిస్తూ.. సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేమీ లేదంటూ కొట్టిపారేశాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సందర్భాల్లో ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ట్రంప్ ఈ ఉపసంహరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.


