మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా | Sakshi Guest Column On melodrama of Maharashtra politics | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర రాజకీయాల మెలోడ్రామా

Jun 4 2025 6:17 AM | Updated on Jun 4 2025 6:17 AM

Sakshi Guest Column On melodrama of Maharashtra politics

సందర్భం

మహారాష్ట్రలో గత మూడేళ్ల నుండి వాయిదాపడిన 29 మున్సిపల్‌ కార్పొరేషన్, 257 నగర పురపాలక, ఇతర స్థానిక  పంచాయతీ ఎన్నికలను రాబోయే నాలుగు నెలల్లో పూర్తి చేయాల్సిందిగా 2025 మే 6న సుప్రీంకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. అంతే, ప్రాంతీయ పార్టీలు... ముఖ్యంగా, ఉభయ శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌  (ఎన్సీపీ) పార్టీలు వారి వారి కార్యకర్తలను ఏకతాటిపై తెచ్చే ప్రయత్నంలో ఉన్నాయి. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేర్కొనే ఈ ఎన్నికల జయాపజయాలు జాతీయ విషయాలపై కాకుండా, స్థానిక సమస్యలపైనే ఆధారపడుతుంటాయి. 

ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్ధవ్‌ థాకరే శివసేనకు... పుణె మునిసిపల్‌ కార్పొరేషన్, దగ్గర్లో ఉన్న పింప్రీ చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్, శరద్‌ పవార్‌ ఎన్సీపీ పార్టీలకు భాలే ఖిల్లా(కంచుకోట)గా చెప్పుకుంటారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ పార్టీలు ఇక్కడ పట్టు కోల్పోవటంతో, తిరిగి వారి ఉనికిని క్రియేట్‌ చేయటానికి సీనియర్‌ పవార్, ఉద్ధవ్‌ థాకరే క్షేత్ర స్థాయి ఎన్నికల విజయం కోసం పావులు కదుపుతున్నారు.

227 కార్పొరేటర్లు ఉన్న ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్, దేశంలోనే అతిపెద్ద, అతి పురాతన (1889) ప్రజా ప్రతినిధుల సంస్థ. డెబ్భై నాలుగు వేల కోట్ల రెవెన్యూ బడ్జెట్‌తో, గత ముప్పై సంవత్సరాల నుండి గ్రేటర్‌ ముంబై కార్పొరేషన్‌ శివసేన ఆధీనంలో ఉంది. 2017 ఎన్నికల్లో 84 సీట్లు సాధించింది శివసేన. అప్పట్లో జరిగిన పోటా పోటీ ఎన్నికలో బీజేపీ 82 సీట్లు గెలిచి, కేవలం రెండు సీట్లు మాత్రమే శివసేనకు వెనుకంజలో ఉంది. 

కానీ, 2022లో పార్టీ చీలికతో 42 మంది సేన కార్పొరేటర్లు ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే వర్గంలోకెళ్ళిపోయారు. కార్పొరేషన్‌ ఎన్నికలు సమీపించటంతో మాజీ కార్పొరేటర్లు కూడా కొందరు ఉద్ధవ్‌ పార్టీకి తిలోదకాలు ఇచ్చారు. అయినా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 20 మంది ఉద్ధవ్‌ శివసేన ఎమ్మెల్యేలలో ముంబై సిటీకి చెందినవారు 10 మంది! రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికలకు ఇది వారికి ఒక విధంగా ఆశా కిరణమే అనొచ్చు.

రాజ్‌ థాకరే ప్రాతినిధ్యం వహిస్తున్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ఇప్పటివరకూ, ఉద్ధవ్‌ శివసేనకు ఓట్‌ కట్టర్‌ గానే నష్టం చేకూర్చింది. సందర్భోచితంగా స్థానిక బీజేపీ నేతలు, రాజ్‌ థాకరే పార్టీని తమకు అనుకూలంగా వాడుకుంటారు. ఉద్ధవ్, రాజ్‌ కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇరు పార్టీలకు కలసి వస్తుంది అని రాజకీయ విశ్లేషకులే కాక, పార్టీ కార్యకర్తలు సైతం తరచుగా చెపుతుంటారు. కానీ, అది ఇంత వరకూ జరగ లేదు.  

2024 డిసెంబరులో రాష్ట్ర ముఖ్య మంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేయగానే, ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్‌ థాకరే వెళ్ళి ఆయనను కలవటం, మహాయుతి భాగస్వామి షిండే వర్గంలో కలకలం సృష్టించింది; ‘టిట్‌ ఫర్‌ టాట్‌’ అన్నట్టు శివసేన (షిండే) నేత, ఉపముఖ్యమంత్రి ఏక్‌ నాథ్‌ షిండే, రాజ్‌ సాహెబ్‌ ఇంటికెళ్ళి ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు. 

ఇదంతా గమనిస్తే, ప్రస్తుతం ఇక్కడి రాజకీయాల్లో ‘దోస్తీ దుష్మనీ’కి నిర్వచనమే తెలియటం లేదు. ఇక, మొన్న జరిగిన మరాఠీ సినీ కార్యక్రమంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఎం.ఎన్‌.ఎస్‌. నేత రాజ్‌ థాకరే, ‘మహారాష్ట్ర సంక్షేమం కోసం తన పార్టీ ఉద్ధవ్‌ శివసేనకు మద్దతివ్వటానికి సిద్ధమే’ అని అన్నారు. మరుసటి రోజు ముంబై నగర వీధుల్లో, థాక్రే బ్రదర్స్‌ ‘మహారాష్ట్ర హిత్‌’ కోసం ఒక్కటవ్వాలి అని శివసేన పోస్టర్లు వెలిశాయి.

ఇక బాబాయి, అబ్బాయిల (ఎన్సీపీ పార్టీల) విషయానికి వస్తే, ‘రాబోయే స్థానిక ఎన్నికల్లో అజిత్‌ పవార్‌ వర్గం, మీ పార్టీతో చేతులు కలుపుతుందా?’ అన్న విలేఖరి ప్రశ్నకు శరద్‌ పవార్, ‘మున్ముందు ఈ రెండు పార్టీలు విలీనం అయినా ఆశ్చర్యం లేదు’ అంటూ తన పార్టీ నేతలను కూడా విస్మయంలో ముంచారు. 

2019 నుండి మహారాష్ట్ర రాజకీయాలు చిత్ర విచిత్రంగా మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. భాజపాతో 30 ఏళ్ల సంబంధం తెగతెంపులు చేసుకుని ఉద్ధవ్‌ థాకరే కాంగ్రెస్‌ ఎన్సీపీలతో మైత్రి కుదుర్చుకుని ముఖ్యమంత్రి కావటం; తర్వాత, 2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ షిండే 52 మంది శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ను పదవీచ్యుతుణ్ణి చేసి భాజపా సహాయంతో సీఎం కావటం; మరో సంవత్సరం గడిచాక (2023 జూలై) అజిత్‌ దాదా, 43 ఎన్సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి, భాజపా కనుచలువతో ఉపముఖ్యమంత్రి కావటంతో మహారాష్ట్ర రాజకీయ రంగస్థలంలో మెలోడ్రామా చోటు చేసుకుంది.

రాష్ట్ర స్థాయి నేతలకు అతీతంగా, గ్రామ, జిల్లా, నగర స్థాయిలో అధికారం కోసం ఉబలాటపడే నాయకులు మాత్రం ముంబైలోని వారి అగ్ర నాయకుల ఫర్‌మాన్‌ పట్టించుకోదలచుకో లేదు. శివసేన, ఎన్సీపీ రెండూ రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఈ పార్టీల నాయకులు, వాలంటీర్లు వారికి తోచిన రీతిలో సమీకరణలు చేసుకుంటున్నారు. అయితే స్థానిక నాయకులను తమ ‘గ్రిప్‌’లో ఉంచుకోవాలనే ప్రయత్నమే పవార్, థాకరే పార్టీలు చెప్పే మెర్జర్‌  ధోరణి రహస్యం.

జిల్లా గోవర్ధన్‌ 
వ్యాసకర్త మాజీ పీఎఫ్‌ కమిషనర్, ముంబై 
‘ 98190 96949

Advertisement
 
Advertisement
Advertisement