ఇది భారత్‌ భరించలేని బెడద

Sakshi Guest Column On Khalistan Punjab Amritpal Singh

విశ్లేషణ

పాకిస్తాన్‌తో కలిసి వేర్పాటువాద శక్తులు పంజాబ్‌లో సమస్యను పెంచి పోషించడానికి ప్రయత్నిస్తున్నారనేది స్పష్టం. పోలీసులు ఇప్పటికైనా మేలు కున్నారు. కానీ రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడేందుకు ప్రభుత్వం, పోలీసు బలగాలకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. అలాగే ఖలి స్తాన్‌ నిరసనకారులు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల త్రివర్ణ పతాకాన్ని దించేయడం వంటి చర్యలకు దిగారు.

వీరి కార్యకలా పాలను నిరోధించేందుకు సమర్థ చర్యలు చేపట్టాలని కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాల మీద భారత్‌ ఒత్తిడి తేవాలి. యుద్ధప్రాతిపదికన ఖలిస్తాన్‌ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. లేదంటే 1980లలో పంజాబ్‌ను వెంటాడిన ఉగ్రవాద పీడ కలలు పునరావృతమైతే దేశం వాటిని భరించలేదు.

‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్, అతడి అనుచరులపై మోపిన ఉక్కు పాదం నాటకీయంగా ఉంది. అది రహస్యంగా జరిగింది. వేర్పాటువాద బోధకుడు గత కొంతకాలంగా పెంచుకుంటూ వచ్చిన ప్రమాద తీవ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా మేలుకుంది. ఫిబ్రవరి 23న జరిగిన అజ్‌నాలా ఘటన పోలీసులకు పెద్ద ఉపద్రవంలా మిగిలింది. ఈ ఘటనలో ఖలిస్తానీలు తుపా కులు పేల్చి పోలీసులపై దాడికి దిగారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ అనుయాయి లవ్‌ప్రీత్‌ సింగ్‌ ఓ తూఫాన్‌లా పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఈ వేర్పాటువాదికి పోలీసులు దాదాపుగా లొంగిపోవడం కలవరపెట్టింది. తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న తర్వాత, ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఎట్టకేలకు మార్చి 18నఅమృత్‌పాల్‌ సింగ్, అతడి మద్దతుదారులకు వ్యతిరేకంగా చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది.

ఇలాంటి సమయంలో ఏ రాష్ట్ర పోలీసుకు అయినా మంచి నిఘా వ్యవస్థ, సమగ్ర ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. పైగా ఈ పథకాన్ని అమలుపర్చే బృందాన్ని జాగ్రత్తగా ఎంచుకోవలసి ఉంది. అయితే పంజాబ్‌ పోలీసులు ఎక్కడో దారి తప్పినట్లు కనిపిస్తోంది. అసలు అందరికంటే ముందు అమృత్‌పాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేయవలసింది.

అతడిని బహిరంగంగా కస్టడీలోకి తీసుకుని వుంటే అతడి అనుచరులు చెదిరిపోయేవారు. అమృత్‌పాల్‌ ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. దీన్ని జీర్ణించుకోవడం కష్టం. పంజాబ్‌ పోలీసులు ఎల్లప్పుడూ శాంతిభద్రతల దృక్కోణంలో పనిచేస్తుంటారని పంజాబ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సుఖ్‌చైన్‌ సింగ్‌ గిల్‌ వ్యాఖ్యానించారు. ఈ వాదన సమంజసంగా లేదనిపించేలా క్షేత్ర స్థాయి ఘటనలు జరిగాయి.

మారుమూల దాగి వున్న వ్యక్తిని పట్టుకోవడానికి పంజాబ్‌ అటు నాగాలాండ్‌ కాదు, ఇటు చత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ కాదు. చూస్తుంటే పంజాబ్ పోలీసులు గందరగోళానికి గురైనారనిపించింది. లేదా అమృత్‌పాల్‌ను ఇప్పటికే నిర్బంధించి ఉండాలి. కానీ బహిరంగంగా కోర్టుకు హాజరు పర్చకపోయి ఉండాలి. ఏ రకంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వానికీ, పోలీసులకూ ఇది అంత మంచిపేరేమీ తీసుకురాలేదు.

వారిస్‌ పంజాబ్‌ దే అనుయాయులకు వ్యతిరేకంగా నాలుగు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. సమాజంలో సామరస్యతను పాడు చేయడం, పోలీసులపై దాడి చేయడం, హత్యాయత్నానికి దిగడం, ప్రజాసేవకులు తమ విధులు చేపట్టకుండా అడ్డుకోవడం వాటికి కారణాలు. ఇవి సరే. కానీ భింద్రన్‌వాలే 2.0 అని తనను తాను చెప్పుకొంటున్న వ్యక్తిని బహిరంగంగా పట్టుకోకపోతే, ఈ దాడులతో ఉపయోగం ఉండదు.

రాష్ట్ర పోలీసులు కొన్ని మాత్రమే ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. భటిండాలో 16 మంది ఖలిస్తానీ మద్దతుదారులను అరెస్టు చేశారు. లూథియానాలో 21 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. అజ్‌నాలాలో ఏడుగురిని చుట్టుముట్టారు. మొత్తంగా 112 మందిని అరెస్టు చేశారు. ఫిరోజ్‌పూర్, భటిండా, రూప్‌ నగర్, ఫరీద్‌ కోట్, బటాలా, హోషియార్‌పూర్, గుర్దాస్‌పూర్, మోగా, జలంధర్‌ వంటి నగరాల్లో భద్రతా దళాలు తమ బలం తెలిపేలా జాతీయ పతాకం చేబూని మార్చ్‌ కూడా నిర్వహించాయి.

రాజకీయాలకో నమస్కారం! ఈ చర్యలన్నీ స్వాగతించాల్సినవే. కానీ గత కొద్ది నెలలుగా, పంజాబ్‌ పోలీసులు వారి ఘనతకు తగినట్లుగా వ్యవహరించలేక పోయారు. అత్యంత శక్తిమంతులైన శత్రువులకు కూడా నరకం చూపించే తమ సమర్థతను వారు ప్రదర్శించలేకపోయారు. ఒకే ఒక వివరణ ఏమిటంటే, ఈ వ్యవహారంలో పోలీసులు కాస్త నెమ్మదిగా వ్యవహరించాలని సూచనలు అందివుండాలి.

వారిస్‌ పంజాబ్‌ దే ప్రతీఘాతుక కార్యకలాపాల గురించి మాట్లాడుతూనే, పంజాబ్‌ రాజ కీయ నాయకత్వం అమృత్‌పాల్‌ సింగ్‌ పేరును ప్రత్యేకించి పేర్కొనక పోవడంపై చాలామంది ఎత్తిచూపారు. నేటి రాజకీయాలకో నమ స్కారం. వాటి వల్ల పోలీసులు ఏ చర్యా చేపట్టకపోవడమే సురక్షిత మైన చర్య అనుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇది వివాదానికి దారి తీయవచ్చు, పైగా అధికారంలో ఉన్నవారు తమకు మద్దతుగా నిల బడకపోవచ్చు అని వారు భావించి వుండాలి. ఇలాంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వ విశ్వస నీయతను, చిత్తశుద్ధిని దెబ్బతీస్తాయి.

నిస్సందేహంగా, అమృత్‌పాల్‌ సింగ్‌ ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ తగిలింది. అజ్‌నాలా పోలీస్‌ స్టేషన్‌కు గురు గ్రంథ్‌ సాహిబ్‌ని తీసు కెళ్లాలనీ, దాన్ని ఒక కవచంగా ఉపయోగించాలనీ అతడు తీసుకున్న నిర్ణయాన్ని సిక్కు మతాధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు, అతడు అదృశ్యమైపోవడం పట్ల కూడా తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఎందుకంటే ఎలాంటి ప్రమాదాన్నయినా నిర్భయంగా ఎదుర్కొ వాలనీ, దాన్ని సవాలుగా తీసుకోవాలనీ బోధించే సిక్కు సంప్రదాయానికి ఇది భిన్నం. ఇక్కడ రెండు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఒకటి పాకిస్తాన్ తో, ఆ దేశ గూఢాచార సంస్థ ఐఎస్‌ఐతో సింగ్‌కు గల లంకె. ఒక సీనియర్‌ పంజాబ్‌ పోలీస్‌ అధికారి దీన్ని స్పష్టంగా పేర్కొన్నారు కూడా.

అలాగే, తన మచ్చలను చిరుతపులి ఎన్నటికీ మార్చుకోలేనట్టుగా– తమ ప్రజలు ఆకలితో అలమటిస్తూ, దేశ ఖజానా దివాళా తీస్తున్న సమయంలో కూడా భారత్‌కు వ్యతిరేకంగా సమస్యలు సృష్టించడానికి పాకిస్తాన్‌ తన ఎత్తులను ఎన్నటికీ వదులుకోదనే విషయం స్పష్టమైంది. రెండోది ఏమిటంటే– పోలీసు, శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలో ఉంటున్నప్పటికీ వేర్పాటువాదం ఈ స్థాయిలో చెలరేగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.

ఉగ్రవాదులకు స్తూపాలా? గత 10 సంవత్సరాలుగా పంజాబ్‌ పరిస్థితులు దిగజారుతున్నాయి. 2014లో దమ్‌దమీ టక్‌సాల్‌ సంస్థ ‘ఆపరేషన్‌ బ్లూ స్టార్‌’లో చనిపోయిన జర్నైల్‌ సింగ్‌ భింద్రన్‌వాలే, ఇంకా ఇతర తీవ్రవాదులకు స్వర్ణ దేవాలయం ఆవరణలో స్మారక స్థూపం నిర్మించింది. పంజాబ్‌ వ్యాప్తంగా అనేక సందర్భాల్లో ఖలిస్తాన్, భింద్రన్‌వాలే పోస్టర్లను బహిరంగంగా ప్రదర్శించారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ వాటిని నిర్లక్ష్యం చేశాయి.

పంజాబ్‌ ఈరోజు అనేక రకాల సమస్యలతో పోరాడుతోంది. రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వం పకడ్బందీగా పథకం వేస్తోంది. దీనికి తోడుగా సరిహద్దుల అవతలి నుంచి సీమాంతర మాదక ద్రవ్యాల సమస్య కూడా తీవ్రంగానే ఉంది. పాకిస్తాన్‌ నుంచి డ్రోన్లతో ఆయుధాలు జారవిడవడం, రాష్ట్రం లోపల సాయుధ ముఠాలు పెరగడం, ఖలిస్తాన్‌ రూపకల్పనకు మద్దతిచ్చే శక్తులు పెరగడం– వీటన్నింటినీ దీర్ఖకాలిక పథకంతో పరిష్కరించాల్సి ఉంది. అరకొర స్పందనలు, తలొగ్గిపోయే చర్యలు వంటివి సరిపోవు.

కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో ఖలిస్తాన్‌ మద్దతుదారుల కార్యకలాపాలను నిరోధించేందుకు సమర్థ చర్యలు చేపట్టాలని భారత ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి. ఖలిస్తాన్‌ అనుకూలవాద నినాదాలు చేస్తున్న నిరసనకారులు లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల త్రివర్ణ పతాకాన్ని కిందికి దించేయడంతో ఇలాంటి చర్య చేపట్టడం తప్పనిసరిగా మారింది.

భారత ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన దీన్ని పరిష్కరించాల్సి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే, 1980లలో పంజాబ్‌ను వెంటాడిన ఉగ్రవాద సమస్యలు  తిరిగి సంభవిస్తే భారతదేశం వాటిని భరించలేదు.

ప్రకాశ్‌ సింగ్‌ 
వ్యాసకర్త మాజీ పోలీస్‌ అధికారి
(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top