జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు | Sakshi Guest Column On India Seasonal agreements with Japan | Sakshi
Sakshi News home page

జపాన్‌తో కాలానుగుణ ఒప్పందాలు

Jul 7 2026 12:02 AM | Updated on Jul 7 2026 12:02 AM

Sakshi Guest Column On India Seasonal agreements with Japan

జపాన్‌ ప్రధాని సనాయే తకాయిచీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ

సందర్భం

జపాన్‌ ప్రధాని సనాయే తకాయిచీ భారత పర్యటన రెండు ప్రత్యేక నేపథ్యాల మధ్య జరిగింది. ఒకటి ఆర్థికమైనది, మరొకటి రక్షణ పరమైనది. ఈ రెండు నేపథ్యాలు ఇరు దేశాలకూ వర్తించేవే. అదే సమయంలో ఒకటి గుర్తించాలి. ఆర్థికమైన వర్తింపు ఉభయులకూ సమానమే కాగా, రక్షణ కోణంలో కొన్ని సామ్యాలతో పాటు కొన్ని తేడాలున్నాయి. ప్రధాని మోదీ, తకాయిచీ మధ్య ఢిల్లీలో ఈ నెల 2న జరిగిన చర్చలు, ఒప్పందాలు కూడా ఈ పరిస్థితులన్నింటిని ప్రతిఫలించాయి. వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు, వాటి అభివృద్ధి ప్రయత్నాలు ఎప్పుడూ ఉండేవే. ఆర్థిక వ్యవస్థల రీత్యా ప్రముఖమైనవి అయిన ఇండియా, జపాన్‌ వంటి దేశాల మధ్య ఇవి ఇంకా బహు ముఖంగా ఉంటాయి. ఆ మేరకు వేర్వేరు రంగాలలో వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు ఎల్లప్పుడూ ఉన్నవే. అటువంటి స్థితిలో కొత్తగా ఏర్పడిందంటున్న ప్రత్యేక నేపథ్యం ఏమిటి?

ప్రత్యేక నేపథ్యం
ఈ ప్రశ్నకు సమాధానం చర్చల అనంతరం ఇరువురు ప్రధానులు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఉంది. అది, ‘‘నేటి అనిశ్చిత పరిస్థితుల మధ్య ఆర్థిక, ఇంధన భద్రతల ప్రాముఖ్యతను రెండు దేశాలు పూర్తిగా అర్థం చేసుకోవటం. దానిని దృష్టిలో ఉంచు కుని ఆర్థిక భద్రత కోసం ఒక ఉమ్మడి రోడ్‌ మ్యాప్‌ను రూపొందించటం’’. నేటి అనిశ్చిత పరిస్థితులన్నవి కేవలం ఇరాన్‌ యుద్ధం వల్ల తలెత్తినవి కావు. భారత్, జపాన్‌లతో పాటు ప్రపంచానికంతా అటువంటి ఒడిదుడుకులు ఉక్రెయిన్‌ యుద్ధంతో నాలుగేళ్ల క్రితం మొదలై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలు, కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఒత్తిడుల మీదుగా ఇరాన్‌ యుద్ధం వరకు సాగివస్తున్నాయి. ఇవి స్థూలంగా పైకి కనిపించేవి. కొంత లోతుకు వెళితే,ప్రపంచ ఆర్థిక రంగానికి అనిశ్చితిని సృష్టిస్తున్న పరిణామాలు మరికొన్ని ఉన్నాయి. అవి, రెండవ ప్రపంచ యుద్థం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్‌ వ్యవస్థలతో మొదలై ప్రపంచ స్వేచ్ఛా వాణిజ్యాలను, ఆర్థిక సంస్కరణలను సులభతరం చేసిన నియమ నిబంధనలు ఇటీవల కొద్ది సంవత్సరాలుగా భంగపడుతుండటం. 

ఆ వ్యవస్థలను, నిబంధనలు సృష్టించిన దేశాలే వాటిని బలహీన పరుస్తుండటం. వాటి ప్రతికూల ప్రభావాలు మధ్యమ స్థాయి దేశాలపై అట్లుంచి, మొదటి 10 స్థానాలలో గల భారత, జపాన్‌ వంటి ఆర్థిక వ్యవస్థలకు సైతం అనిశ్చితిని కల్పిస్తున్నది. ఇది ఇరాన్‌ యుద్ధంతో మరింత తీవ్రమైంది. ఇండియా, జపాన్‌ గత అక్టోబర్‌లో తకాయిచీ అధికారానికి రాక ముందు కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి. మోదీ ప్రభుత్వంపై ఇతరత్రా ఎన్ని విమర్శలైనా ఉండవచ్చు గాక. కానీ, వేర్వేరు దేశాలతో, ప్రాంతీయ ఆర్థిక కూటములతో వీలైనన్ని ఆర్థిక ఒప్పందాల కోసం నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు అనిశ్చితులు ఉండగా, మరొకవైపు ఈ పోటీ ప్రపంచం, దేశంలో అంతర్గతంగా ఎదురవుతున్న ఆర్థిక ఒడిదుడుకులు ఈ విధా నాల వెనుక ముప్పేటగా పనిచేస్తున్నాయని చెప్పాలి. 

అసమ వాణిజ్యం
జపాన్‌ పరిస్థితి భారత్‌ కన్న కొంత మెరుగైనప్పటికీ పైన పేర్కొన్న పరిణామాల మధ్య సమస్యలు తప్పటం లేదు. వాటికి ఇటీవల మరొకటి తోడవుతున్నది. అది, చైనాతో పెరుగుతున్న వివాదాలు. తైవాన్‌ విషయమై తకాయిచీ వైఖరికి ఆగ్రహించిన చైనా, పలు విధాలైన చర్యలతో జపాన్‌ ఆర్థిక రంగాన్ని వీలైనంత కుంటుపరచటం మొదలు పెట్టింది. మరొకవైపు ఇండో–పసిఫిక్‌ రక్షణ బాధ్యతల నుంచి అమెరికా కనీసం పాక్షికంగా ఉపసంహరించుకుంటూ ఆ బరువును ఆ ప్రాంతంలోని జపాన్‌ తదితర మిత్ర దేశాలపై మోపుతుండటంతో జపాన్‌ సైనిక వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక భారాలన్నీ మోసేందుకు తకాయిచీ ప్రభుత్వం ఆసియా నుంచి యూరప్‌ వరకు వేర్వేరు దేశాలతో శరవేగంగా ఆర్థిక ఒప్పందాలు చేసుకుంటున్నది. ఈ విధంగా ఆర్థిక అనిశ్చితులు, వాటిని తట్టుకునే చర్యలన్నవి భారత్, జపాన్‌లకు ఒకే విధంగా ఉన్నట్లు గమనించవచ్చు. 

కనుక, ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో 2వ తేదీన జరిగిన ఆర్థిక ఒప్పందాలన్నీ హర్షించవలసినవే. ఒప్పంద వివరాలు వెంటనే తెలియరాలేదు గానీ తకాయిచీ వెంట సుమారు 100 జపనీస్‌ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు రావటాన్ని బట్టి చర్చలు ఏ స్థాయిలో జరిగి ఉంటాయో ఊహించవచ్చు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా స్వయంగా చెప్పిన దానిని బట్టి, రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంలో 100కు పైగా వాణిజ్య ఒప్పందాలు జరిగాయి. వాటివల్ల జపాన్‌ 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది గాక వచ్చే పదేళ్లలో రెట్టింపు జపనీస్‌ కంపెనీలను, 10 ట్రిలియన్ల జపనీస్‌ యెన్‌ పెట్టుబడులను (మారకం విలువ 1 రూపాయికి 1.69 యెన్‌లు) ఆకర్షించటం లక్ష్యమన్నారు. ఇండియాలో ఇప్పటికే 1,400కు పైగా జపాన్‌ కంపెనీలు, 5,000కు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ సంఖ్యలు రెట్టింపు కావటం ఎట్లున్నా, ఇరువురు ప్రధానులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులలో ఎంత విస్తరిస్తే అంత మేలు కలుగుతుంది. 

అదే సమయంలో భారత ప్రభుత్వంపై కొన్ని పెద్ద బాధ్యతలు కూడా ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సాలీనా ఎగుమతి దిగుమతుల విలువ 27 బిలియన్‌ డాలర్ల మేర ఉంది. అది సంతృప్తి కరమైనదే. కానీ, ఇండియా ఎగుమతులు కేవలం 6 బిలియన్లు, దిగుమతులు 21 బిలియన్లు (మూడున్నర రెట్లు) అంటే ఆ వివరాలు ఎంత అసంతృప్తికరమైనవో వేరుగా చెప్పనక్కరలేదు. ఇంకా చెప్పుకోవాలంటే, భారతదేశపు ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 6వ ర్యాంకుకు చేరినప్పటికీ, సాలీనా వాణిజ్య లోటు 10 బిలియన్‌ డాలర్లకు మించి ఉంది.  

జరగాల్సిన కృషి
ఆర్థిక రంగానికి సంబంధించి జపాన్‌ ప్రధానితో జరిగిన చర్చలలో చమురు తదితర ఇంధన భద్రతలు, ప్రత్యామ్నాయ ఇంధ నాలు, అరుదైన లోహాలు, ఖనిజాల ప్రస్తావనలు అనివార్యంగా వచ్చాయి. వాటికి అనుబంధంగా ఇండో–పసిఫిక్‌ సముద్ర మార్గాల ద్వారా స్వేచ్ఛాయుత రవాణాకు అవకాశాలను కల్పించుకోవటం. ఈ నిర్దిష్టమైన అంశాలన్నీ ఇండియా, జపాన్‌లతో పాటు అన్ని దేశాలలో చర్చలు జరుగుతున్నవే. అయితే ఇవి ఎంత కీలకమైనవో అంత క్లిష్టమైనవి కూడా. వీటి గురించి ఎవరికి వారు అంతర్గత కృషి చేయటం, ఇతరుల సహకారంతో సామరస్య పరిష్కారాలు కనుగొనటం రెండూ అవసరం. ఈ కొత్త పరిస్థితులలో ఆ ప్రయత్నాలు లోగడ కన్నా ఎక్కువగా జరగక తప్పదు. 

చర్చలలో ప్రస్తావనకు వచ్చిన మరొక కీలకాంశం రక్షణ. ఇందుకు రెండు కోణాలున్నాయి. ఒకటి, ఇండో–పసిఫిక్‌ ద్వారా సముద్రయానాలు. ఇది రెండు దేశాలకు సంబంధించినది. రెండు, ఈ మార్గాలలో, అంతకన్నా ఎక్కువగా పసిఫిక్‌లో చైనాను కట్టడి చేసే విషయం. ఈ విధమైన కట్టడి అవసరం ఇండియాకు పరిమిత స్థాయిలో ఉండగా, జపాన్‌కు, దానిని తమ సమగ్ర వ్యూహంలో భాగంగా చేసుకున్న అమెరికాకు అపరిమిత స్థాయిలో ఉంది. అమెరికా ఇటీవల ‘క్వాడ్‌’ ప్రత్యక్ష బాధ్యతల నుంచి నెమ్మదిగా తగ్గుతూ జపాన్, ఆస్ట్రేలియాల బాధ్యతను పెంచుతుండటంతో కొత్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ బాధ్యతను తలకెత్తుకున్న తకాయిచీ రక్షణ వ్యయాన్ని పెంచుతూ, పలుదేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ రక్షణ విషయాలైతే ఢిల్లీలో ‘చర్చకు’ వచ్చాయి గానీ, ‘ఒప్పందాలు’ లేకపోవటం ఇండియా విధానాలకు అనుగుణమైనదేనని చెప్పాలి. 

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement