లౌకికవాదానికి గొడ్డలిపెట్టు రాజకీయం | Sakshi Guest Column On Caste Politics in India | Sakshi
Sakshi News home page

లౌకికవాదానికి గొడ్డలిపెట్టు రాజకీయం

Oct 15 2024 4:20 AM | Updated on Oct 15 2024 4:20 AM

Sakshi Guest Column On Caste Politics in India

విశ్లేషణ

భారతదేశంలో కుల రాజకీయాలు మరింత ఊపు అందుకుంటున్నాయి. హరియాణా, జమ్ము–కశ్మీర్‌ ఎన్నికల్లోని సామాజిక సమీకరణలను పరిశీలిస్తే – అంబేడ్కర్, రామ్‌ మనోహర్‌ లోహియా చెప్పిన కులం పునాదుల మీదే ఎన్నికలు జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. హరియాణాలో కాంగ్రెస్‌ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ కూడా ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలుపెట్టింది. 

జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసు కోగలిగింది. అయితే, బీసీల్లోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించాలి.

కాంగ్రెస్‌ మొదటి నుండీ ఆయా రాష్ట్రా లలో భూస్వామ్య కులాల మీద ఆధారపడి తన రాజకీయాలు నెరపుతున్నదని భాషా రాష్ట్రాల రూపకల్పన నాడే అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. రామ్‌ మనోహర్‌ లోహియా తన ‘కులాల సమస్య’లో భారతదేశంలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగుతుందనీ, జాతీయ స్థాయిలో వాళ్ళ పెత్తనాన్ని హిందూ బ్రాహ్మణ రాజకీయ వ్యవస్థ నడిపిస్తుందనీ అన్నారు. 

శూద్ర కులాలు వారికి సామంతులుగా ఆ యా రాష్ట్రాలను పాలించుకుంటున్నాయనీ, బ్రాహ్మణా ధిపత్యంలో ఏ దోపిడీ అయితే ఉందో శూద్ర భూస్వామ్య కులాల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలలో కూడా అదే ఆధిపత్యం కొనసాగుతుందనీ చెప్పారు. 

ఇవాళ హరియాణాలో కాంగ్రెస్‌ కుల ఓట్లను సమీకరించింది. కాంగ్రెస్‌కు ప్రతిగా బీజేపీ ఎంబీసీ కులాలను సమీకరించడం మొదలు పెట్టింది. కాంగ్రెస్‌ తాము గెలుస్తున్నామనే భావనలో పూర్తి ఫలితాలు వచ్చాక చేసుకునే ఉత్సవాలను అత్యుత్సాహంతో ముందే చేసు కోవటం, జాట్ల వల్ల అణగదొక్కబడుతున్న బీసీ కులాలు సమీకృతమై బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. 

ఈ విషయంలో కాంగ్రెస్‌ పునరాలోచించుకోవలసిన అవసరం వుంది. బీజేపీ తన హిందూవాద సిద్ధాంతాన్ని ఆచరించడంలో వెనుకంజ వేయడం లేదు. కానీ ప్రత్యర్థులు ఎన్నికల్లో ఏ కులాల్ని ఆశ్రయిస్తున్నారో చూసి వాటికి భిన్నమైన కులాల సమీకరణకు పూనుకుంటోంది. కాంగ్రెస్‌ ఉదార బ్రాహ్మణ వాదంలో బీజేపీని ఎదురించలేదు. ప్రత్యామ్నాయ రాజ కీయ వ్యవస్థా నిర్మాణంతోనే దానిని ఎదురించగలుగుతుంది.

నిజానికి మండల్‌ కమిషన్‌ రిపోర్టును బీసీలకు అనుసరింపచేసే విషయంలోనే జనతా పార్టీ నుండి జనసంఘ్‌ బయటకు వచ్చి  భారతీయ జనతా పార్టీగా ముందుకు వచ్చింది. బిందేశ్వరి ప్రసాద్‌ మండల్‌ ఛైర్మన్‌గా, ఆర్‌.ఆర్‌.భోలే, దివాన్‌ మోహన్‌ లాల్, కె. సుబ్ర హ్మణ్యం, దీనబంధు సాహు సభ్యులుగా 1978 డిసెంబర్‌ 20న బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ పార్లమెంటులో ప్రకటించారు. దీనబంధు సాహు ఆరోగ్య కారణాల రీత్యా 1979 నవంబర్‌ 5న తన పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఆర్‌.ఎల్‌.నాయక్‌ను నియమించడం జరిగింది.

మండల్‌ కమిషన్‌ తన రిపోర్టును 1980 డిసెంబర్‌ 31న రాష్ట్రపతికి సమర్పించింది. ఓబీసీ సంక్షేమ పథకాలకు ప్రస్తుతం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందటం లేదు; నిధుల కొరత కారణంగా మరిన్ని పథకాలు చేపట్టలేకపోతున్నామని పలు రాష్ట్రాలు మండల్‌ కమిషన్‌ దృష్టికి తెచ్చాయి; అందువల్ల ప్రత్యేకంగా బీసీల కోసం ఉద్దేశించిన పథకాలకు ఎస్సీ, ఎస్టీ పథకాల వలెనే కేంద్రం సహాయం అంద జేయాలని కమిషన్‌ సిఫారసు చేసింది. 

ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు మండల్‌ సిఫారసులను పక్కకు పెట్టాయి. జనతాదళ్‌ అధికారంలోకి వచ్చాక మండల్‌ కమిషన్‌ సిఫా రసుల అమలు కోసం వి.పి.సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి కేంద్ర సంయుక్త కార్యదర్శి కృష్ణాసింగ్‌ 1990 ఆగస్ట్‌ 13న మెమొరాండం జారీ చేశారు.

‘అనేక తారతమ్యాలు గల మన వంటి సమాజంలో, రాజ్యాంగంలో పొందు పరచిన విధంగా సామాజిక న్యాయ సాధన త్వరగా జరగటం తప్పనిసరి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అప్పటి ప్రభుత్వం రెండవ వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియమించింది. దానినే మండల్‌ కమిషన్‌ అని పిలుస్తున్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు కమిషన్‌ అభిప్రాయ పడిన విధంగా తగు ప్రయోజనాలను ప్రస్తుత సందర్భంలో ఏ విధంగా సమకూర్చాలన్న ప్రశ్నను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. 

ఆ ప్రకారం ఆ యా తరగతులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ సంస్థలలో ముందుగా కొన్ని అదనపు అవకాశాలు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది’. భారత ప్రభుత్వ పరిధిలో గల సివిల్‌ ఉద్యో గాలు, సర్వీసులలో ‘సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీలకు 27 శాతం ఖాళీలు రిజర్వ్‌ అవుతాయి; ఈ రిజర్వేషన్లు నేరుగా రిక్రూట్‌ చేసే ఖాళీలకు వర్తిస్తాయి; ఓపెన్‌ పోటీలో తమ ప్రతిభ ద్వారా ఎంపికయే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీ అభ్య ర్థులు 27 శాతం రిజర్వేషన్‌ కోటా కిందకు రారు’ అని అందులో పేర్కొన్నారు.

మండల్‌ కమిషన్‌ రిపోర్టును అమలు జరుపుతామని కాంగ్రెస్‌ స్పష్టంగా చెప్పలేకపోతోంది. కులగణన వరకే కాంగ్రెస్‌ పరిమితం అయితే, ఆ రోజు తమ హక్కులను కాలరాయడానికే కొత్త పార్టీ పెట్టిన బీజేపీ వైపే బీసీలు మళ్ళీ వెళ్తారు. కానీ వారిలోని మతపరమైన నమ్మకాలను రాజకీయం చేయాలనే ఆలోచన బీజేపీకి ఉందని మనం గమనించవలసిన అవసరం వుంది. బీజేపీ పాలనా పద్ధతిని బీసీలు గుర్తించలేకపోతున్నారు. ఈ విషయాన్ని తెలియ జెప్పటంలో కూడా కాంగ్రెస్, దళిత బహుజన పార్టీలు వెనుకబడి ఉన్నాయి.

మండల్‌ కమిషన్‌ సిఫారసులను, వాటి అమలును వ్యతిరేకిస్తూ అనేక కేసులు దాఖలైనాయి. 1993లో సుప్రీంకోర్టు మండల్‌ ప్రతిపా దించిన బీసీ రిజర్వేషన్లను సమర్థిస్తూ బీసీ కులాలను గుర్తించడానికి శాశ్వతంగా జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో కమిషన్‌లను ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అప్పటికి పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి. అందువల్ల పి.వి. హయాంలో మండల్‌ కమిషన్‌ సిఫారసుల్లో ఒకటైన ఉద్యోగ రంగంలో 27 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాజకీయ, సామాజిక, పారిశ్రామిక తదితర సమస్త రంగాల్లో బీసీ రిజర్వేషన్లను అమలు జరపాల్సే ఉంది. 

హరియాణాలో జాట్లంతా హస్తం పార్టీ వైపు ఉన్నారన్న ప్రచారం పూర్తిస్థాయిలో నిజం కాదు. అయినా జాట్లకు వ్యతిరేకంగా ఉన్న కులాల్లో అత్యధికులు తమ పార్టీ వైపు మొగ్గు చూపేలా కమలం పార్టీ చేసుకోగలిగింది. కాంగ్రెస్‌ అగ్రనేతలు హుడా, సెల్జా మధ్య విభేదాలు బహిరంగంగానే బయట పడటం, సెల్జాను పక్కన పెట్టడం కొన్ని తరగతుల ప్రతినిధులను దూరం చేశాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో ‘ఆప్‌’ ఒంటరిగా పోటీ చేయడం; స్థానికంగా ఉంటున్న జేజేపీ, దళితుల మద్దతున్న భీమ్‌ ఆర్మీ పార్టీతోనూ; ఐఎన్‌ఎల్‌డీ బీఎస్‌పీతోనూ పొత్తు పెట్టుకోవడం కూడా ఓట్ల చీలికకు దారి తీసింది.

నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రకటిస్తున్న ఉచితాలు కూడా బడ్జెట్లకు అతీతంగా ఉంటున్నాయి. ప్రజలను సోమరులను చేసే పథకాల కంటే కూడా ప్రజలను ఉత్పత్తిలో భాగం చేసి శ్రమ ద్వారా ధనం సంపాదించే ప్రణాళికలు ముఖ్యం. మాయావతి ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయ అభివృద్ధికి, దళిత బహుజనుల ఆర్థిక సామాజికాభివృద్ధికి, మైనారిటీ సంక్షేమానికి, లా అండ్‌ ఆర్డర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. నిజానికి కాన్షీరాం బీసీలను, దళితులను ఐక్యం చేసే రాజకీయ వ్యూహాలు రచించారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా బహుజనుల రాజ్యాధికరమే రావాల్సి ఉంది. 

ఇకపోతే జమ్ము కశ్మీర్‌లో ఇండియా కూటమి విజయపతాకం ఎగురవేయడం ఒక చారిత్రక అంశం. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్‌ 370ని బీజేపీ రద్దు చేసిన దానికి ఫలితంగా ప్రజలు ప్రతీకారం తీర్చుకున్నారు. నిజానికి హిందూ రాజకీయాలు లౌకికవాదానికి గొడ్డలిపెట్టు. ఉత్పత్తిని, ఉపాధిని, శ్రమ సంస్కృతిని, మానవ జీవన వ్యవస్థల ప్రజ్వలనాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళే రాజకీయ ప్రణాళిక ఇప్పుడు అవసరం.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement