100 డేస్: బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రహమాన్
విశ్లేషణ
ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు ప్రస్తుతం మూడు ప్రభుత్వాల పనితీరును ప్రత్యేకంగా గమనిస్తున్నారు. అవి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్. ఇవి వేర్వేరు స్వతంత్ర దేశాలు కాగా, ఇపుడు అకస్మాత్తుగా వారి దృష్టిని తమిళనాడు ఆకర్షిస్తున్నది. ఈ జాబితాలోకి అనూహ్యంగా ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ కూడా వచ్చి చేరింది. పరిశీల కుల దృష్టిలో ఇటువంటి జాబితా ఒకటి తయారు కావటానికి కారణం, ఈ పరిణామాలన్నింటి వెనుక యువతరం ఆగ్రహం ఒక అంతస్సూత్రంగా కనిపిస్తుండటం; ఇదంతా ఆసియాలో జరుగుతుండటం.
నేషనల్ ఛార్టర్– ఒక ప్రత్యేకత
బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం ఫిబ్రవరి 17న అధికారానికి వచ్చిన తారిఖ్ రహమాన్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయ్యాయి. ఆయన నాయకత్వాన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) అధికారానికి వచ్చిన పరిస్థితులు తెలిసినవే. షేక్ హసీనా ప్రధానిగా 17 సంవత్సరాల పాటు సాగిన అవామీ లీగ్ పాలనను తీవ్రంగా వ్యతిరేకించిన యువతరం ఉద్యమంతో ఆ ప్రభుత్వం పతనమైంది. కొంతకాలం మధ్యంతర ప్రభుత్వ పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో బీఎన్‌పీ మూడింట రెండు వంతుల ఆధిక్యతతో విజయం సాధించింది. ప్రతిపక్ష జమాతే ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ తాము పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించగలమనీ,కొంత కాలంపాటు అయినదానికి కానిదానికి ఆందోళనలు చేయబో మనీ ప్రభుత్వానికి హామీ ఇచ్చాయి.
ఇదిగాక గమనించవలసిన విషయం, అధికార పక్షానికి తన సొంత మేనిఫెస్టో ఒకటిగాక, అన్ని పార్టీల ఆమోదంతో ‘నేషనల్ ఛార్టర్’ పేరిట పరిపాలనా సంస్కరణల కార్యక్రమం ఒకటి కూడా ఎన్నికలకు ముందే రూపు తీసుకుంది. ఎన్నికలతో పాటే దానిపై రెఫరెండం జరగగా అందుకు ప్రజామోదం లభించింది. ఇటువంటి ఛార్టర్, అందుకు రెఫరెండం అన్నది ప్రజాస్వామ్య వ్యవస్థలలో మరెక్కడా జరిగినట్లు లేదు. ప్రపంచవ్యాప్తంగా పరిశీలకులు బంగ్లా దేశ్‌ను గమనించటానికి ఇవన్నీ కారణమవుతున్నాయి.
మాట నిలబెట్టుకుంటారా?
పదిహేడు సంవత్సరాల అస్తవ్యస్త పాలన తర్వాత కొత్త ప్రభు త్వపు పనితీరును అంచనా వేసేందుకు కేవలం వంద రోజుల వ్యవధి నిజానికి సరైనది కాదు. ఆ పరిమితిని దృష్టిలో ఉంచుకుంటూనే అసలు ఈ కాలంలో జరిగిందేమిటనేది చూడవచ్చు. మాజీ ప్రధాని బేగం ఖలేదా జియా కుమారుడైన తారిఖ్ రహమాన్ గత చరిత్ర గొప్పదేమీ కానందున, ఆయన దీర్ఘకాలపు ప్రవాస జీవితం నుంచి ఎన్నికలకు కొద్దికాలం ముందు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు, తానిప్పుడు మారిన మనిషినని ప్రకటించారు. ఇప్పుడు మే 27కు హనీమూన్ కాలం ముగిసేవరకు ఆయన తన మాట ప్రకారమే వ్యవహరిస్తూ రావటాన్ని ప్రజలు, ప్రతిపక్షాలు కూడా గుర్తించినట్లు కనిపిస్తున్నది. ఆ విధంగా మొదట పాలకునిపై వ్యక్తిగత స్థాయిలో నమ్మకం ఏర్పడితే, హనీమూన్ కాలంలో ఏమి జరిగినా జరగకున్నా రాగల రోజులపై ఆశాభావం కలుగుతుంది.
పరిపాలనకు వస్తే, యథాతథంగానే వెనుకబడినది అయిన బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా సుదీర్ఘ పాలనలో అవినీతి వల్ల సమస్యలు మరింత పెరిగాయి. కనుక, కొత్త ప్రభుత్వం నిజాయితీగా, శ్రద్ధగా పనిచేసినా పరిస్థితులు కుదుట పడేందుకు చాలా సమయమే తీసు కుంటుంది. అదట్లుండగా, ఇపుడు మూడు నెలలుగా కొనసాగు తున్న ఇరాన్ యుద్ధం సృష్టించిన చమురు, గ్యాస్ సమస్యలు పిడుగు వలె వచ్చి పడ్డాయి. వారి ఇంధన అవసరాలలో 62 శాతం దిగుమ తుల ద్వారా తీరవలసినవే. ఈ స్థితి వల్ల కొత్త ప్రభుత్వం మరింత సతమతమవుతున్నది.
ఇది మొత్తం మీద గల స్థూల పరిస్థితి కాగా, తారిఖ్ రహమాన్ ప్రభుత్వం వీటిని సాకుగా చూపకుండా అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవటం గురించి చెప్పాలి. ఆ పనులు చేసే ముందు ఆయన స్వయంగా ప్రతిపక్ష నాయకుల నివాసాలకు వెళ్లి సంప్రదింపులు జరిపారు. పరిపాలన విషయంలో ప్రజలకు తక్షణం అనుభవంలోకి వచ్చేది సంక్షేమ చర్యలన్నది తెలిసిందే. ఆ ప్రకారం పేదలకు, రైతులకు ఆహార సహాయంగా నెలకు 2,500 బంగ్లాదేశ్ టాకాల (ఒక రూపాయి 1.29 టాకాలకు సమానం) విలువ చేసే కార్డులు జారీ చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడి పెంపకందారులకు పదివేల టాకాల వరకూ రుణమాఫీ జరిపారు. పేదలందరికీ వైద్య చికిత్సల కార్డులు పంపిణీ చేశారు. స్కూలు పిల్లలకు యూనిఫారాల సరఫరా జరిగింది.
ఉలికిపాటు ఉప్పెన
ఇటువంటివి సంక్షేమాలు, ఉపశమన చర్యలు కాగా, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం దేశమంతటా సాగునీటి కాల్వల పునరుద్ధరణను ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లో వరి ఉత్పత్తి తగినంత ఉన్నా, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంతోపాటు దేశమంతటా చెట్ల పెంపకంవల్ల గ్రామీణు లకు ఉపాధికల్పన జరుగుతుందన్నది ఆలోచన. యువకుల ఉపా ధికి పరిశ్రమలు, వాణిజ్యం తప్పనిసరి గనుక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణం, ఎగుమతి రంగాల విస్తరణ, కొత్త పెట్టుబడుల ఆకర్షణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరొక వైపు, కొన్ని అంశాలకు సంబంధించి విమర్శలు కూడా వినవస్తు న్నాయి. వాటిలో ముఖ్యమైనవి శాంతిభద్రతలు, అదే విధంగా వేర్వేరు రంగాల సంస్కరణల కోసం రూపొందించిన జాతీయ ఛార్టర్ అంశాలను ఇంతవరకు పార్లమెంట్‌లో ధ్రువీకరించటంపై గానీ, అమలు పరచటంపైగానీ తగు చర్యలు తీసుకోకపోవటం.
రాగల రోజులలో వీటితోపాటు, భారతదేశంతో సంబంధాల మెరుగుదల బీఎన్‌పీ ప్రభుత్వానికి సవాళ్లు కానున్నాయి. ప్రధాని రహమాన్ అధికారానికి వచ్చినప్పుడు, ఆ పని తప్పక చేయగల మనీ, అందుకు పరస్పర ప్రయోజనాలు, గౌరవాలు ఆధారం కావా లనీ, అదే ప్రాతిపదికపై సమస్యలను పరిష్కరించుకోగలమనీ అన్నారు. కానీ ఈ వంద రోజులలో ఆ దిశగా అడుగులు పడలేదు. ఇందుకు రెండు వైపుల నుంచి చొరవ అవసరం. నదీ జలాలు, సరిహద్దుల గుర్తింపు, వలసలు, షేక్ హసీనా అప్పగింత వంటివి తేలిక వివాదాలు కావు.
మళ్లీ మొదటికి వస్తే, బంగ్లాదేశ్‌తోపాటు శ్రీలంక, నేపాల్ ప్రభుత్వాల పనితీరుపై, అవి ఇంతకుముందటి ప్రభుత్వాల కన్న ఎంత భిన్నంగా ఉండగలవన్న దానిపై, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఏర్పడింది. తమిళనాడులో విజయ్ గెలుపులోనూ వారు యువతరం తిరుగుబాటుతో కూడిన ఆకాంక్షల వెల్లువను చూస్తున్న సమయంలో, ‘కాక్‌రోచ్’ ఉప్పెన వారిని ఉలికిపాటుకు గురిచేసింది. ప్రధాని మోదీ ఇటీవలి అసెంబ్లీ విజయాలతో ఎదురులేకుండా పోయిందనుకుంటుండగా, యువతరం నుంచి ఈ అనూహ్యమైన భూకంపం వారిని పునరాలోచనలో పడవేసింది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


