‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః‘ స్త్రీలను గౌరవించే సమాజంలోనే ప్రగతి, సౌభాగ్యం ఉంటాయన్నది మన సాంస్కృతిక సంప్రదాయం. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ గౌరవం మాటలకే పరిమితం కాకుండా, బాలికలకు సమాన హక్కులు, రక్షణ, విద్యావకాశాలు కల్పించినప్పుడే ఆ సంప్రదాయానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. బాలికల సమస్యలు, వారి హక్కులు, సమాజంలో వారికి దక్కాల్సిన స్థానంపై అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఒక ఆత్మపరిశీలనా వేదిక.
‘ఒక బాలుడికి చదువు చెబితే ఆ వ్యక్తి మాత్రమే ప్రయోజకుడవుతాడు, అదే ఒక బాలికకు విద్యాబుద్ధులు నేర్పిస్తే ఆ కుటుంబంతో పాటు యావత్ సమాజమే వికసిస్తుంది’ అంటారు పెద్దలు. విద్య బాలికకు కేవలం అక్షరజ్ఞానం మాత్రమే కాదు; అది ఆమెకు ఆలోచనా స్వేచ్ఛను, ఆర్థిక స్వావలంబనను, నాయకత్వ లక్షణాలను అందిస్తుంది. ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలైతే, తన పిల్లల ఆరోగ్యం, విద్య, సంస్కారాల పట్ల సంపూర్ణ అవగాహనతో మెలుగుతుంది. తద్వారా భావితరం ఆరోగ్యకరమైన పునాదులపై నిలబడుతుంది.
బాలికల భవిష్యత్తును చిదిమేస్తున్న అతిపెద్ద సామాజిక రుగ్మత బాల్య వివాహం. యుక్తవయస్సు రాకముందే పెళ్లి చేయడం వల్ల బాలికలు చదువుకు దూరమవ్వడమే కాకుండా, చిన్న వయసులోనే తల్లులై తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం (పీసీఎమ్‌ఏ–2006): అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. ఈ చట్టం కింద తల్లిదండ్రులు, వివాహాన్ని ప్రోత్సహించిన వారు కూడా శిక్షార్హులు.
భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ బాలికలు, మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలను రూపొందించాయి. 18 ఏళ్ల లోపు బాలికలపై జరిగే ఎలాంటి లైంగిక వేధింపులు, దాడులనైనా తీవ్రమైన నేరంగా పోక్సో చట్టం– 2012 పరిగణించి కఠిన శిక్షలు అమలు చేస్తుంది. గృహహింస నిరోధక చట్టం –2005 మహిళలకు గృహహింస నుంచి తక్షణ న్యాయ రక్షణ, భద్రత కల్పిస్తుంది. దిశ చట్టం – ఇతర సత్వర న్యాయ నిబంధనలు: మహిళలపై జరిగే ఘోర నేరాలకు సత్వర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించినవి.
ఆధునిక సాంకేతికత మహిళల భద్రతకు ఎంతటి బలమైన ఆయుధంగా మారుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ నిరూపించింది. ప్రతి స్మార్ట్‌ఫోన్ లో ఈ యాప్ ఉండడం ద్వారా బాలికలు, మహిళలు నిర్భయంగా సమాజంలో తిరిగే ఆత్మవిశ్వాసం లభిస్తుంది.
బాలికలు వంటింటి కుందేళ్లు కారు; దేశ సరిహద్దులను కాపాడే సైనికులు, అంతరిక్షాన్ని శోధించే శాస్త్రవేత్తలు, దేశాన్ని నడిపించే నాయికలు. స్త్రీలను దైవంగా పూజించనవసరం లేదు, తోటి మనిషిగా గుర్తించి సమాన గౌరవం, స్వేచ్ఛ, భద్రత ఇస్తే చాలు. బాలికల పరిరక్షణ మన అందరి సమిష్టి బాధ్యత.
– భవనం బద్రిరెడ్డి, సైకాలజిస్టు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, చీరాల
ఇదీ చదవండి: కౌటిల్యమా... కనువిప్పా?!


