తల్లీ.. నీకు సెల్యూట్‌! | Zomato lady delivery agent riding bike with her child goes viral | Sakshi
Sakshi News home page

తల్లీ.. నీకు సెల్యూట్‌!

Nov 20 2024 1:47 AM | Updated on Nov 20 2024 1:47 AM

Zomato lady delivery agent riding bike with her child goes viral

నాడు ఝాన్సీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని వీపుకు కట్టుకుని జవనాశ్వాన్ని దౌడు తీయిస్తూ బ్రిటిష్‌ వారిపై కత్తి ఝళిపిస్తే, నేడు ఈ రాజ్‌కోట్‌ యువతి తన బిడ్డను మోటార్‌ బైక్‌ పైన కూర్చోబెట్టుకుని, వీపుకు బ్యాగు తగిలించుకుని, డెలివరీ ఏజెంట్‌గా జీవన పోరాటం సాగిస్తోంది! ఈ దృశ్యాన్ని చూసిన ‘విష్విద్‌’ అనే ఇన్ స్టాగ్రామ్‌ యూజర్‌ ఆమెను వీడియో తీసి, బ్యాక్‌గ్రౌండ్‌లో కత్తి పట్టిన ఝాన్సీరాణిని ఆమెకు జత కలిపి పెట్టిన పోస్ట్‌కు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. నెటిజెన్ లు తమ కామెంట్‌లలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.‘‘బైక్‌ నడుపుతున్నావ్‌.. బద్రం సిస్టర్‌’’ అని జాగ్రత్తలు చెబుతున్నారు. 

హెల్మెట్‌ పెట్టుకోవాలని కొందరు సూచిస్తున్నారు. కాళ్లకు చెప్పులు తొడుక్కోవాలని మరికొందరు కోరుతున్నారు. ఈ యువతి గత నెల రోజులుగా డెలివరీ ఏజెంటుగా పని చేస్తోంది. ఇన్ స్టాలో వెల్లడైన వివరాలను బట్టి.. ఈమె హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసింది. పెళ్లయ్యాక, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు. ఇక ఇప్పుడైతే.. ‘‘బిడ్డ తల్లివి కదా.. ఉద్యోగం ఎలా చేస్తావ్‌?’’ అని అడుగుతున్న వారే ఎక్కువమంది! చివరికి డెలివరీ ఏజెంట్‌ ఉద్యోగాన్ని ఎంచుకుని, తనతోపాటు కొడుకునూ వెంట బెట్టుకుని ధైర్యంగా జీవనయానం సాగిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement