కష్టాలు దురదృష్టమంతులం కాబట్టి రావు. అవి మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, వివేచన శక్తిని బయటకు తీసుకొచ్చి.. అసామాన్యుడిని పరిచయం చేస్తాయ్. ఎందుకుపనిరాను అనుకున్న వాడిని సైతం అందలం ఎక్కేలా ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది అనేందుకు ఈ మహిళే ఉదాహరణ. అయితే మనకొచ్చిన కష్టాలకు స్పందించే తీరు..చూసే విధానమే..ఉన్నత స్థానంలో కూర్చోబెడుతుంది. ఇక్కడ ఈ మహిళ సాధారణ స్వీపర్ స్థాయి నుంచి ఎవ్వరూ ఊహించని ఉన్నత శిఖరాలకు చేరి యువతకు ఆదర్శంగా నిలబడటమే కాదు..సక్సెస్‌కి పులిస్టాప్ ఉండదు కేవలం కామానే(,) అని నిరూపించింది.
ఆ మహిళే ప్రతీక్షా తండ్వాల్కర్. పూణేలో పుట్టి పెరిగిన ప్రతీక్ష బాల్యమంతా కష్టాలమయం. ఆమె తన ఇంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడోతరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 16 ఏళ్లకు వివాహం చేసేశారు. సరిగ్గా పెళ్లైనా మూడేళ్లకే అంటే 20 ఏళ్ల వయసులో భర్త సదాశివ్ కడు మరణించడంతో మూడేళ్ల బిడ్డను పెంచుకోవడానికి అష్టకష్టాలు పడింది. మొదట్లో టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనులు చేపట్టింది. ఇవేమి తన పొట్టపోషణకు స్థిరమైన ఆదాయం కాదనిపించి..తన భర్త పనిచేసే ముంబై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) శాఖకు వచ్చింది.
నిజానికి అక్కడకు తన దివంగత భర్తకు రావాల్సిన జీతం కోసం వచ్చిందామె. అలా ఆ బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి తనకు ఉద్యోగం ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది. దాదాపు ఐదు నెలల తదనంతరం ఆ బ్యాంక్‌లోనే పార్ట్ టైమ్ స్వీపర్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. 1985 ఆ టైంలో అక్కడ నెలకు రూ. 60 నుంచి 65ల జీతంతో ఎస్‌బీఐలో స్వీపర్‌గా చేరింది. బ్యాంక్ తెరిచే ఆవరణ ముందు ఊడ్చడం, తుడవడం, టాయిలెట్లు శుభ్రం చేయడం, ఫర్నీచర్‌పై ఉన్న దుమ్మును దులపడవం వంటివి ఆమె బాధ్యతలు.
అలా ఎస్‌బీఐల్ స్వీపర్‌గా చేరి..అక్కడితో ఆగిపోలేదు..పనిచేస్తూనే ఆపేసిన చదువుని కొనసాగించింది. బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తూనే రాత్రిపూట చదువుతూ..8,9,10 తరగతలును పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్ నైట్ కాలేజ్‌ల సాయంతో పూర్తిచేసింది. 1990లో, ఆమె స్వీపర్ నుంచి మెసెంజర్‌గా పదోన్నతి పొందింది. ఐదేళ్ల తరువాత, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, బ్యాంక్ డిపార్ట్‌మెంటల్ అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి క్లర్క్-కమ్-క్యాషియర్ అయ్యింది.
ఆ తర్వాత ప్రమోద్ తండ్వాల్కర్‌ను వివాహం చేసుకున్నారామె. ఆయన మరింత ఉన్నత పదవులు అలంకరించేలా ప్రోత్సహించడంతో ఏజీఎం, డీజీఎం స్థాయికి చేరుకుని పదవీవిరమణ చేశారు. బ్యాంక్‌లో మంచి కెరీర్‌ని నిర్మిచుకున్నాక..కూడా తన సక్సెస్‌ని, ఆసక్తిని ఆపలేదామె. 55 ఏళ్ల వయసులో తన చిరకాల ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం ప్రకృతి వైద్యంలో రెండేళ్ల కోర్సుని పూర్తి చేసింది.
అక్కడితో ఆగడం లేదామె తనకు నచ్చిన రంగాలను ఎంచుకుని కొంగొత్త స్కిల్‌ని నేర్చుకుంటూ వృద్ధాప్యాన్ని కూడా అందంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందామె. ఈ మహిళ ప్రతీక్ష కథ..మన నేపథ్యం..మన స్థితి మన తలరాతను నిర్ణయించవు. ఎదగాలి, కష్టపడాలనుకుంటే..ముళ్లబాటలాంటి జీవితం సైతం పూలపాన్పులా మారుతుందని ప్రతీక్ష విజయగాథ చెప్పకనే చెబుతోంది కదూ..!.
ఇదీ చదవండి: జైలు పాలైనా..చదవడం ఆపలేదు! కట్‌చేస్తే ఇవాళ డీఎస్పీగా..


