మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్‌ చేశారా? | Your child's Is it a good school check these details inside | Sakshi
Sakshi News home page

మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్‌ చేశారా?

Jun 19 2025 11:19 AM | Updated on Jun 19 2025 1:19 PM

Your child's Is it a good school check these details inside

 బడి గంట- నేటి నుంచి వరుస కథనాలు

స్కూల్‌ ఫీజ్‌ ఎంత కడుతున్నారో మీకు తెలుసుగాని ఆ కట్టిన డబ్బులోని ప్రతి పైసాకు  సరి పడే విధంగా అక్కడ  పాఠాలు చెబుతున్నారా? సౌకర్యాలు ఉన్నాయా? టీచర్లు యోగ్యులేనా? విద్యావిధానంలో వారి తాత్త్వికత ఏమిటి?  స్టూడెంట్‌–టీచర్‌ మధ్య అనుబంధం ఉందా? ఆటలు ఉన్నాయా?  విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నేటి నుంచి అవగాహన కథనాలు... 

‘మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నారు’ అని పేరెంట్స్‌ అనుకున్నంత మాత్రాన అది మంచి స్కూల్‌ అయిపోదు. ‘ఏదో చిన్న స్కూల్‌లో చదువుతున్నారులే’ అన్నంత మాత్రాన అది చెడ్డ స్కూల్‌ అయిపోదు. చాలా ఎక్కువ ఫీజు ఉన్నది చాలా మంచి స్కూల్‌ అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. దగ్గరగా ఉందనో, ట్రాన్స్‌పోర్ట్‌ ఉందనో, అందరూ అక్కడే చదువుతున్నారనో... రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను ఎంచిన స్కూళ్లలో చేరుస్తుంటారు. చేర్చి, మళ్లీ స్కూల్‌ వైపే చూడకుండా క్లాసుల మీద క్లాసులు చదివిస్తుంటారు. మన పిల్లలకు వచ్చే మార్కులను బట్టే అది మంచి స్కూల్‌ అనుకునేవారు కూడా ఉంటారు. అంటే పిల్లలకు నూటికి 90కి పైన వస్తున్నంత కాలం ఆ స్కూల్‌ ఎలా ఉన్నా వారికి పర్వాలేదు. కాని ఇలాంటి అంచనాలన్నింటితో ఒక స్కూల్‌ని ఎంచడం విద్యార్థికి ఏదో ఒక మేర నష్టం చేయడమే అంటున్నారు నిపుణులు. 

ఇదీ చదవండి: టెంట్‌ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?

ఒక స్కూల్‌ ఎప్పుడు మంచి స్కూల్‌ అవుతుంది అనే దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పేపర్‌లో ఆ స్కూల్‌ విద్యార్థుల మార్కుల కనిపించడం వల్ల మాత్రమే మంచి స్కూల్‌ అనుకోక నిజంగా పిల్లలు సరైన స్కూల్‌లో చేరాలంటే, కొనసాగాలంటే తల్లిదండ్రులు ఆ స్కూల్‌ను ఈ ప్రమాణాల రీత్యా పరిశీలించాల్సి ఉంటుంది.

విద్యా తాత్త్వికత ఎలాంటిది?
ప్రతి మంచి స్కూల్‌కు ఒక తాత్త్వికత ఉంటుంది. తమ బడిలో చదివిన పిల్లల వికాసం ఏ రీతిన సాగాలో ఆ స్కూల్‌ ఏర్పాటు సమయంలోనే నిర్వచనం చేసుకుని ఉంటారు. భారతీయతలోని భిన్న సమాజాల పిల్లల కలయికతతో తరగతి ఉండాలనీ, అన్ని భాషల సంప్రదాయాల పిల్లల మధ్య సమ భావనతో తరగతి  ఉండాలని, ఏ ఒక్క సమూహపు అహం/ ప్రాధాన్యం పెరగని విధంగా చూడగలరని, విద్యార్థుల మధ్య  పోటీతత్త్వం ఎగదోసి ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసే విధానం అవలంబించరని, బోధన ఇంగ్లిష్‌ మీడియం అయినా ప్రతి మాతృభాషనూ గౌరవించగలిగే స్కూల్‌ను మంచి స్కూల్‌గా ఎంచవచ్చు.

బుర్రలా... మరబొమ్మలా?
చదువు ఎలా నేర్పిస్తారో చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిలబస్‌ పూర్తి చేయడమే లక్ష్యంగా, పిల్లలు పాఠాలు బట్టీయం వేసి, పరీక్షల్లో ముక్కస్య ముక్కహ రాసి, నూటికి నూరు తెచ్చుకొనేలా తోముతారా లేదా ప్రశ్న మార్చి ఇచ్చినా రాసేలాగా, బుర్ర పెట్టి ఆలోచించగలిగేలాగా, సొంతంగా నేర్చుకునే లాగా, సబ్జెక్ట్స్‌పై ఆసక్తి కలిగేలాగా చెబుతారా? ఈ రెండో విధానం కలిగినది మంచి స్కూల్‌.

చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్‌ డైట్‌తో

వినూత్నమైన టీచింగ్‌
టీచింగ్‌ ఎలా ఉంటుందనేది చూడాలి? అదే మూస సంప్రదాయ పద్ధతిలోనేపాఠాలు చెబుతున్నారా? లేదంటే ఆధునికమైన ఉపకరణాలు, సాధనాల సహాయంతో చెబుతున్నారా చూడాలి. ఎప్పటికప్పుడు సిలబస్‌ను వర్తమాన పరిస్థితులను బట్టి మెరుగు పరుచుకుంటూ పిల్లలను ఇన్‌వాల్వ్‌ చేస్తూ అవసరమైతే ఎక్స్‌పర్ట్‌లను బయటి నుంచి పిలిపించి స్పెషల్‌ క్లాసెస్‌ నిర్వహిస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారా లేదా చూడాలి. రెండో రకం స్కూలుకు  ప్రాధాన్యం ఇవ్వాలి.

టీచర్లు ఉన్నారా?
ఒక స్కూల్‌ మనుగడ ఆ స్కూల్లో పని చేసే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్‌ యాజమాన్యం క్వాలిఫైడ్‌ టీచర్లను తీసుకుంటున్నారా? వారికి మర్యాదకరమైన జీతాలు ఇస్తున్నారా? టీచర్లు ఆ యాజమాన్యానికి లాయల్‌గా ఉన్నారా? ఐదేళ్ల పాటైనా ఒక్కో టీచర్‌ ఆ స్కూల్లో పని చేయగలుగుతున్నారా? ఈ సంవత్సరం ఉండి మరో సంవత్సరం మారి΄ోయే టీచర్లు ఉన్న స్కూల్లో పాఠాలు నడవవు. స్కూల్‌ మీద ప్రేమతో ఉంటూ పాఠాలు చెప్పే తపన కలిగిన టీచర్లు ఉన్న స్కూల్‌ను ఎంచుకోవాలి. అలాగే టీచర్లు మొరటుగా ఉంటూ స్టూడెంట్స్‌తో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఆ స్కూల్‌ జోలికి  పోరాదు. స్ట్రిక్ట్‌గా ఉండటం వేరు స్టూడెంట్స్‌ను అవమానిస్తూ, భయభ్రాంతం చేయడం వేరు.

క్రీడలు, కళలు
క్రీడలకు, కళలకు స్థానం లేని స్కూల్‌కు ఆమడ దూరం ఉండాలి. ఆటస్థలం లేని స్కూల్‌ ప్రైమరీ లెవల్‌ నుంచి హైస్కూల్‌ లెవల్‌ వరకూ పనికి రాదు. ప్లేగ్రౌండ్‌ ఉన్నా ఆటలను ప్రోత్సహించక చివరి పీరియడ్‌ వరకూ పాఠాలతో ఊదరగొట్టే స్కూల్స్‌ను మంచివి అనుకోకూడదు. పిల్లల్లో ఎంతో సృజన ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారికి ధన, కనక, వాహనాలిచ్చినట్టే. విద్యార్థి ఎదుగుదల సమగ్రంగా జరగాలి. పాఠాలతోపాటు ఆట పాటలకు విలువిచ్చే బడికే ఓటు.

సామాజిక బాధ్యత నేర్పుతున్నదా?
మన పాటికి మనం చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, సుఖంగా బతికే ధోరణిని పెంచేలా వీరి తర్ఫీదు ఉంటుందా లేదంటే ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం గురించి ఎరుక పరిచి, అందులో ఉన్న అంతరాల వల్ల బాధ పడేవారి కోసం, సమాజంలో ఉన్నతి కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత రేపు పెద్దయ్యాక ఉంటుంది అనే చెప్పేలా తర్ఫీదు ఉంటుందా చూడాలి. రెండో రకం తర్ఫీదు మంచిది.

భద్రత, పరిశుభ్రత
అన్నింటి కంటే ముఖ్యం భద్రత. పిల్లలు ఉన్న చోట వేయి కళ్లతో ఉండాలి. స్కూల్లో ఆయాలు, సెక్యూరిటీ వాళ్లు సరైన ట్రయినింగ్‌ ఉన్న వాళ్లేనా? బస్‌ల డ్రైవర్లు లైసెన్స్‌లు ఉన్నవాళ్లేనా? కెమెరాల నిఘా ఉందా? ఔట్‌ పాస్‌ నియమాలు ఎలా ఉన్నాయి? టాయిలెట్ల దగ్గర రక్షణ ఉందా? ఇవి చూడాలి. అలాగే స్కూల్లో పరిశుభ్రతపాటిస్తున్నారా? గాలి వెలుతురు ఉండేలా చూస్తున్నారా? మంచి నీరు ఇస్తున్నారా? పిల్లల ఆరోగ్యం హటాత్తుగా పాడైతే వారు వెంటనే తల్లిదండ్రులకు తెలియ చేస్తున్నారా? ఫస్ట్‌ ఎయిడ్‌ ఇవ్వ గలుగుతున్నారా... ఇవన్నీ చూసుకుని,  సంతృప్తికరంగా ఉంటే అది మంచి స్కూల్‌. 

ప్రతి పైసాకు ప్రతిఫలం
స్కూళ్లు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ వసూలు చేసిన ఫీజుకు జవాబుదారీగా స్కూల్‌ను నిర్వహిస్తున్నారా? ప్రతి పైసాకు ప్రతిఫలం ఇస్తున్నంత బాగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారా? పిల్లలు సంతోషంగా స్కూల్‌కు వెళ్లి సంతోషంగా తిరిగి ఇల్లు చేరుతున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నది మంచి స్కూలో కాదో తేల్చుకోండి.

Advertisement
 
Advertisement
Advertisement