టెంట్‌ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి? | Negative conditioning psychology phobia of tent check deets inside | Sakshi
Sakshi News home page

టెంట్‌ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?

Jun 19 2025 10:15 AM | Updated on Jun 19 2025 1:24 PM

Negative conditioning psychology phobia  of tent check deets inside

నాకొక చిత్రమైన సమస్య ఉంది. ఎక్కడైనా సరే ఇంటి ముందు టెంట్‌ వేసి ఉంటే నాకు విపరీతంగా భయం వేస్తుంది. ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయారేమో అని ముందు అనిపించి, తర్వాత మా అమ్మమ్మకి ఏదైనా అవుతుందేమో, తనకేమైనా అయితే నేను ఒంటరి వాణ్ణి అయిపోతా అని భయం వేస్తుంది. ఎవరైనా గృహ ప్రవేశం, పెళ్ళి కోసం టెంట్‌ వేసుకున్నా నాకు మాత్రం నెగటివ్‌ ఆలోచనలు వచ్చి ఒళ్ళంతా చెమటలు, గుండెదడ, కళ్ళు తిరగడంలాంటివి అవుతాయి. ఇలా అయినప్పుడు నేను కూడా చనిపోతానేమో అన్నంత భయం కలుగుతుంది. ఈ భయం వల్ల నేను నా ఫ్రెండ్స్, ఇంకా చుట్టాల ఫంక్షన్స్‌కి వెళ్ళడమే మానేశాను. ఎక్కడైనా టెంట్‌ వేసి ఉంటే అటు వైపు వెళ్ళలేను. అందరూ హేళన చేస్తారని బయటకు చెప్పుకోలేను. దయచేసి ఈ సమస్య నుండి ఎలా బయట పడాలో తెలుపగలరు!– నాగరాజు, బద్వేల్‌ 


నాగరాజు గారు, చిన్న వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోవడం అనేది మీ మెదడు పైన బాగా ప్రభావం చూపినట్లుంది. దాని వల్ల ‘టెంట్‌’కి మీ మెదడు ‘నెగటివ్‌ కండిషనింగ్‌’ (Negative conditioning) కి గురి అయింది. దీని వల్ల ఎక్కడ టెంట్‌ కనపడినా మీ మెదడు విపరీతమైన ఆందోళనకి  ప్యానిక్‌ అటాక్సికి గురి అవుతుంది. వైద్య పరిభాషలో దీన్ని ‘స్పెసిఫిక్‌ ఫోబియ్‌’ లేదా ‘టిసింటో ఫోబియా’ అంటారు.  మీకు టెంట్‌ అంటే భయం ఉన్నట్లే కొందరికి కుక్క లేదా పిల్లి అంటే భయం ఉంటుంది. ఇంకొందరు లిఫ్ట్‌ అంటే భయపడతారు... అన్ని సందర్భాల్లో కూడా నిజానికి భయం అవసరం లేదు. కానీ ఫోబియాలో ఇలాంటి  మాములు విషయాలే విపరీతమైన భయానికి ఆందోళనకి గురి అయ్యేలా చేస్తాయి. 

మీరు ఒక సైకియాట్రెస్ట్‌ని కానీ, క్వాలిఫైడ్‌ క్లినికల్‌ సైకాలజిస్ట్‌ని కానీ కలిస్తే కౌన్సిలింగ్‌ కొన్ని రిలాక్సేషన్‌ పద్దతులు మరియు ‘ఎక్స్‌ పోజర్‌ అండ్‌ రెస్పాన్స్‌ ప్రివెన్షన్‌‘ అనే మానసిక చికిత్స విధానం ద్వారా మీ సమస్య నుండి బయట పడేస్తారు. అలాగే ‘వర్చువల్‌ రియాలిటీ’ అనే అత్యాధునిక వైద్య విధానం కూడా అన్ని రకాల ఫోబియాస్‌ నుండి బయట పడేలా సహాయం చేస్తుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల మీకు తొందరగా ఉపశమనం దొరికి మీరు థెరపీలో మరింత మెరుగ్గా  పాల్గొనగలుగుతారు.

డా. -ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ sakshifamily3@gmail.com

 

Advertisement
 
Advertisement
Advertisement