కడలి కబుర్లు | World Oceans Day is indeed celebrated annually on June 8th | Sakshi
Sakshi News home page

కడలి కబుర్లు

Jun 8 2025 12:02 AM | Updated on Jun 8 2025 5:12 AM

World Oceans Day is indeed celebrated annually on June 8th

అగాధ జలనిధి కడలి.. అది అనంత జీవరాశికి ఆలవాలం... నేలపై ఉండే జీవులకు ప్రాణవాయు ప్రదాత.. సాగరగర్భం అనేక వింతలకు నిలయం... సముద్రాలను కాపాడుకోవడం మానవాళి కర్తవ్యం.. సముద్రాలను కాపాడుకుంటేనే మనకు మనుగడ. సముద్రం ఒక వేదికైతే... అందులో చేపల నాటకం.. ఆక్టోపస్‌ డాన్స్‌.. డాల్ఫిన్‌ పాటలు.. ఇలా మరెన్నో కళాకారులతో నిండుతుంది. అయితే, ఆకతాయులు వేసే ప్రతి ప్లాసిక్‌ బాటిల్‌కు ఒక రంగురంగుల చేప ఊపిరి ఆగిపోతోంది. అలలు నవ్వడం మానేస్తున్నాయి. అందుకే, ప్రతి ఏటా జూన్‌ 8న జరుపుకునే ‘ప్రపంచ సాగర దినోత్సవం’(World Oceans Day) రోజునైనా, సముద్రం అంటే సరదా కాదు, ఒక జీవనిధిగా గుర్తించి కాపాడుకుందాం.

సముద్రం అంటే ఒక పరిగెడుతున్న చేపల రాజ్యమని, అందులో నీళ్లు, చేపలు, బోట్లు తప్పే మరేం ఉంటాయ్‌! అని చాలామంది అనుకుంటుంటారు. కాని, సముద్రం ఎంత గొప్పది అంటే సముద్రమంత! ‘సాగరః సాగరోపమః’ అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అంటే.. సముద్రం సముద్రమంత గొప్పదని అర్థం. సముద్రాన్ని మరోదానితో పోల్చడం సాధ్యం కాదు. అంతటి మహాసముద్రం లోపల వేలాది ర హస్యాలు. భయంకరమైన నిజాలు, వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. వాటిలో బయటకు తెలిసినవి కొన్నే! కాని, సముద్రంలో ఒక చిన్న వినోదం కూడా ఉంటుంది.

అది ఒక చక్కని కామెడీ కథల వేదిక. అక్కడి చేపలు చేసే శబ్దాలు రేడియోలో కంటే ఎక్కువగా మాట్లాడతాయి, ఆ శబ్దాలు మనకు వినపడవంతే! ఆక్టోపస్‌లు ఎనిమిదేసి చేతులతో మాయాజాలం చూపిస్తాయి. జెల్లీఫిష్‌ సిల్లీ విన్యాసాలు చేస్తూ ఉంటుంది. ఒకపక్క తాబేలు స్లో మోషన్‌ డాన్స్‌ చేస్తుంటే మరోపక్క డాల్ఫిన్‌లు, తిమింగలాలు ‘ప్లాస్టిక్‌ తినకురా! ఓ నీలి నేస్తమా!’ అంటూ రీమిక్స్‌ చేస్తూ ర్యాప్‌ పాడుతుంటాయి. ఇక సముద్రపు స్టార్‌ షార్క్‌ని సెల్ఫీ అడిగి, దాని నవ్వు చూసిన అలలు పరుగెడుతుంటాయి.

ఇలా సముద్రంలో ఎన్నో వింతలు.. విడ్డూరాలు ఉన్నాయి. అలాగే జీవం కూడా ఉంది. అందుకే, మనుషులు ఆనందంగా ఉండాలంటే సముద్రం కూడా ఆనందంగా ఉండాలి. అలా ఆనందంగా ఉండాలంటే మనం సముద్రానికి ప్లాస్టిక్‌ బ్యాగ్‌లను టోపీలుగానూ, బాటిళ్లను సీ డెకరేషన్లగానూ చేయకూడదు. సముద్రాన్ని ప్రేమించడం అంటే, మన భవిష్యత్తును మనం ప్రేమించడమే! పుడమికి ప్రాణవాయువును అందిస్తున్న సాగరునికి ప్రతి ఒక్కరూ ‘థ్యాంక్స్‌’ చెప్పుకునేలా.. ఈ ప్రత్యేక కథనం.. 

అలా మొదలైంది... 
ప్రతి సంవత్సరం జూన్‌ 8న ప్రపంచం నీలికడలి గురించి ఒక నిలువెత్తు నిజాన్ని గుర్తు చేసుకుంటుంది. అదే సముద్రాలు మనకు ఒక ముఖ్య జీవనాధారం అని. ఆక్సిజన్‌ లేకుంటే ఎంత ప్రమాదమో, సముద్రాలు లేకున్నా కూడా అంతే ప్రమాదం. ఒకరకంగా చెప్పాలంటే మనం పీల్చుకునే ఊపిరిలో సగానికి సగం సముద్రాల నుంచే వస్తుంది. ఇంతటి ముఖ్యమైన వనరును కూడా మానవులు కాలుష్యంతో నింపి నాశనం చేస్తున్నారు. అందుకే, 1992లో బ్రెజిల్‌లో జరిగిన ‘ఎర్త్‌ సమ్మిట్‌’లో కెనడా మొదటిసారి ‘సముద్రాలకు ఒక ప్రత్యేక దినోత్సవం కావాలి’ అని చెప్పింది. ఆ కలను 2008లో ఐక్యరాజ్యసమితి సాకారం చేసింది. ఇక అప్పటి నుంచి ఏటా జూన్‌ 8న ‘ప్రపంచ సాగర దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. 

సముద్రంలో సినిమా.. 
అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని కళ్ల ముందుకు తీసుకొచ్చిన సినిమా ‘అండర్‌ ది సీ 3డీ’. ప్రముఖ సంస్థ ఐమాక్స్‌ తెరకెక్కించిన ఈ సినిమా మామూలు సినిమా కాదు. ఇదొక డాక్యుమెంటరీగా తీసుకొచ్చిన సముద్ర మాయాజాలం. ప్రముఖ డైరెక్టర్‌ హవర్ట్‌హాల్‌ దర్శకత్వం వహించగా, మిచెల్‌ హాల్‌ దీనికి రచన అందించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ సముద్రం లోతుల్లో తేలియాడుతూ, చుట్టూ రంగురంగుల చేపలను, నిగనిగలాడే పగడాల దిబ్బలను, నెమ్మదిగా కదిలే వివిధ సముద్రపు జీవులను చూస్తున్నట్లు ఉంటుంది.

ఈ సినిమా కేవలం రంగుల బొమ్మలనే కాదు, ప్రకృతి చేసే అలజడి, వాతావరణ మార్పులు, పెరిగే ఉష్ణోగ్రతలు, మానవ తప్పిదాలు– ఇలా ఇవన్నీ సముద్రానికి చేస్తున్న ముప్పును చక్కగా చూపిస్తూనే, మనుషుల్లో ‘ఇక కొంతకాలంలో ఈ అందాలను చూసే అవకాశం లేకుండా పోతుందా?’ అనే ప్రశ్నను రేకెత్తించేలా చేస్తుంది. ఇందుకోసం ‘కర్ల్‌ ట్రయాంగిల్‌’ అనే సముద్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సముద్ర జీవులు నివాసం ఉండే ప్రాంతం. అక్కడ చిత్రీకరణ అత్యంత ప్రమాదకరం.

ఒక తప్పు జరిగినా అక్కడి జీవ వ్యవస్థ మొత్తానికి ముప్పు వాటిల్లుతుంది. అందుకే, ఈ ఇద్దరు ప్రతి ఫ్రేమ్‌ను చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఒక పెద్ద కెమెరాను ఉపయోగించారు. దాని బరువు సుమారు ఆరువందల కిలోలు ఉంటుంది. వివిధ ప్రత్యేక అనుమతులు తీసుకొని సుమారు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశారు. అలా ఒక అద్భుత ప్రపంచాన్ని తెరమీదకు తీసుకొచ్చారు.

సంభ్రమపరచే సాగర వాస్తవాలు
సముద్రం లోపల ఏకంగా 37 ‘భారలోహాలు’ ఉన్నాయి. లిథియం, కోబాల్ట్, మాంగనీస్, టైటానియం ఇలా మరెన్నో మినరల్స్‌ ఉన్నాయి.
⇒  సముద్రంలో ఉన్న మొత్తం ఉప్పుని ఉపయోగిస్తే, భూమిపై నేల అంతటినీ ఐదు వందల అడుగుల ఎత్తుతో కప్పేయొచ్చు.

⇒ మనకి సముద్రపు లోతుల గురించి కంటే అంతరిక్షం గురించి ఎక్కువ తెలుసు. ఇంకా 90 శాతం సముద్రం మ్యాప్‌ కూడా గుర్తించలేదు. సముద్ర గర్భంలో ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు ఎన్నో ఉన్నాయి.
⇒ సముద్రపు నీటి స్థాయి అప్పుడప్పుడు పైకి, కిందికి ఊగుతుంది. శీతాకాలం వస్తే నీరు మంచుగా మారుతుంది. అలాగే, తాపం పెరిగితే భూమి మీదకు వస్తుంది.

⇒ సముద్రం భూమి మీద 71% విస్తీర్ణాన్ని కలిగి ఉంది. సముద్రాల్లోని నీటిని కలిపితే 320 మిలియన్‌ క్యూబిక్‌ మైళ్ల నీళ్లు! అంతేకాదు, సముద్రాల్లో నీళ్లు ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. అవి ఎక్కడో వర్షంగా పడతాయి, మరెక్కడో మంచుగా మారతాయి. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. 
⇒ సముద్రం అంటే ఉప్పు నీరు మాత్రమే ఉండదు. ఉప్పు లేని సముద్రాలు ఉన్నాయి. వాటిని ‘గ్రేట్‌ లేక్స్‌’ అంటారు. అంటే సముద్రం కాదు. కాని, ఈ సరస్సులు సముద్రాల్లో ఉంటాయి.

⇒ సముద్రంలో ఏకంగా 2.2 మిలియన్‌ జాతుల జీవులు ఉన్నాయని అంచనా. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పటి వరకు కనుక్కోగలిగాం.
⇒ సముద్రపు నేల ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది! అగ్నిపర్వతాల వలన వచ్చిన మాగ్మా ఎత్తైన పర్వతాలను సృష్టిస్తుంటుంది. వీటిపై అక్కడక్కడ ఉండే ‘బ్లాక్‌ స్మోకర్స్‌’ అనే పగుళ్లు సముద్రంలో పొగను కూడా వదులుతాయి. 

హద్దుల్లేని భజంత్రీలు
ఒకప్పుడు పెళ్లి అంటే పందిరి, లైట్ల మెరుపులు, మైక్‌ పట్టుకుని చేసే ‘వేదపారాయణం’. కాని, ఈ స్టయిల్‌ పెళ్లిళ్లను ఈ కాలపు జంటలు అసలు ఒప్పుకోవడం లేదు. అన్నింటికంటే ముందు పెళ్లికి కచ్చితంగా కావాల్సింది అంతులేని తీరాలతో ఉండే ప్రేమ అని కొందరు అంటున్నారు. అంటే పెళ్లి వేదికలుగా సముద్ర తీరాలకు ఓటు వేస్తున్నారు. కాబట్టి పెళ్లి అనగానే పురోహితుడి కంటే ముందు ప్యాకేజీలో బీచ్‌ బుకింగ్స్‌ చేస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో ది బెస్ట్‌ ఇవి.

గోవా: గోవాలో పెళ్లంటే.. పెళ్లి కంటే ముందు పెళ్లి విందు మిన్న అన్నట్లే! శుభ ముహూర్తానికి ముందే ‘సన్‌సెట్‌ క్లిక్స్‌’, ‘బీచ్‌ బేస్‌డ్‌ బంగ్లా’ బుక్‌ అయిపోతాయి. వేదమంత్రాల పక్కనే డీజే ప్లే అవుతుంది. పక్కా ఎంజాయబుల్‌ పెళ్లికి వెళ్లాలంటే గోవాలో జరిగే పెళ్లికి పిలవకుండా వెళ్లినా తప్పులేదు.

అండమాన్: జీవిత ఖైదీని అందంగా బంధించాలంటే అండమాన్‌లో పెళ్లి చేసుకోవాలి. వధువు వస్తే ఫ్లవర్స్‌ కాకుండా, టైడల్‌ షవర్‌ ఫీల్స్‌ వస్తాయి.

కేరళ: వరుడు బోటులో వస్తే, వధువు కొబ్బరి చెట్టు కింద నిలబడి ‘నన్ను తీసుకెళ్తావ్‌ కదా’ అని చెప్పే ఓ చక్కని సన్నివేశంలాంటిది కేరళ పెళ్లి.

గోకర్ణ: గోకర్ణలో పెళ్లంటే ఒక చిన్న పండగలాంటిది. ఓం కారంతో శుభారంభం పలికి, పెళ్లి, తర్వాత సంగీతం, చివర్లో బీచ్‌ ఫైర్‌ డాన్స్‌తో అలరించేదే ఈ పెళ్లి.

పుదుచ్చేరి: ఫ్రెంచ్‌ వీధుల్లో ప్రేమగా నడుస్తూ, బీచ్‌ సరసన ప్రేమ పంచుకుంటే, ఫొటోల్లోనే కాదు, జీవితమే ఒక రొమాంటిక్‌ సినిమాలా కనిపిస్తుంది. అటువంటి సినిమాటిక్‌ ఫీల్‌ కోసం పుదుచ్చేరి బెస్ట్‌ ప్లేస్‌.

డయ్యూ: తక్కువ ఖర్చుతో హైవోల్టేజ్‌ బీచ్‌ పెళ్లి కావాలంటే ఇది బెస్ట్‌. ఓ వైపు పోర్చుగీస్‌ ఇళ్లు, మరోవైపు బ్రైట్‌ లైట్స్‌తో ఉంటుంది. ఈ పెళ్లిని చూసిన తర్వాత పెళ్లికాని అబ్బాయిలు కూడా తమ పెళ్లి ఇక్కడే చేసుకోవాలని ఫిక్స్‌ 
అయిపోతారు.

మహారాష్ట్ర: ఇక్కడ బీచ్‌ వెడ్డింగ్‌ అంటే పక్కనే కోటలు, వెనుక సముద్రం, ముందు మేకప్‌ ఫెయిల్‌ అయిన వధూవరులు. ఎందుకంటే, ఇక్కడ సూర్యుడు తన శక్తిని కొంచెం ఎక్కువే చూపిస్తాడు. అయినా కూడా అందంగానే ఉంటారు.

లక్షద్వీప్‌: ఇది పెళ్లి కాదు బాస్, అడ్వెంచర్‌! ఇక్కడ పెళ్లి చేసుకుంటే పంచభూతాలే సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎందుకంటే, ఇక్కడ చాలామంది స్కూబా డైవింగ్‌ చేస్తూ, 
‘ఐ లవ్‌ యూ’ చెçప్పుకుంటారు. బంధువులు ఎవరైనా రావాలంటే, ముందే స్విమ్మింగ్‌ తెలిసుండాలి.

కాబట్టి పెళ్లి అంటే ‘పెద్దవాళ్ల దీవెనలు, బంధుమిత్రులతో విందుభోజనాలు’ అనుకునే రోజులు పోయాయి! ఇప్పుడు పెళ్లి అంటే– ‘ఐలాండ్‌ ప్యాకేజీ బుక్‌ చేసి, టెంట్లు వేసుకుని, సముద్రపు హోరుకు హార్ట్‌బీట్‌ జోడించి, ప్రేమను చాటాలి అనుకుంటున్న రోజులివి. అయితే, ఈ సముద్ర సంబరాలకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్‌ను రాసుకెళ్లడం మర్చిపోకండి.

సముద్రంలో మిస్టరీగా మిగిలిన ప్రదేశాలు.. 
సముద్రాల్లో కొన్ని ప్రదేశాల గురించి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నా, అవి ఇప్పటికీ ప్రశ్నలు, సమాధానాల కంటే అర్థం కాని కథల్లానే మిగిలిపోయాయి. అలాంటి ఐదు అత్యంత రహస్యమైన సముద్ర ప్రదేశాలు ఇవే..

బెర్ముడా ట్రయాంగిల్‌ 
ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో ఉన్న ఈ ప్రాంతంలో విమానాలు, నౌకలు చాలా అదృశ్యమయ్యాయి. అవన్నీ ఎక్కడికి పోయాయి? కారణం ఏమిటి? ఇంకా తెలియలేదు. ఇది సాంకేతిక సమస్యా? లేక ఏదైనా భౌతిక శక్తుల మాయాజాలమా అనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు.

మారియానా ట్రెంచ్‌ 
మనం సముద్రాన్ని కేవలం ఐదు శాతమే అన్వేషించాం. కానీ అంతకంటే లోతైన ప్రదేశం కూడా ఉంది. అదే పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న ‘చాలెంజర్‌ డీప్‌’ అనే ప్రదేశం. దీని లోతు దాదాపు 11 కిలోమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చని అంచనా. ఇందులో కంటికి చిక్కని లోకం ఉండవచ్చు అనే అనుమానం శాస్త్రవేత్తల్లో ఉంది. 

సర్గాసో సముద్రం 
ఈ సముద్రంలో ప్రవాహాలు కనిపించవు. కానీ అందులో తేలే సర్గాసం అనే సముద్రపు మొక్కలు, అక్కడి జీవవైవిధ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాయి. ఇది సముద్రానికి మధ్యలో ఉన్న, అతిపెద్ద సర్గాసం మొక్కల రాజ్యం లాంటిది.

బాల్టిక్‌ సీ అనోమలీ 
సోనార్‌ స్కాన్లలో కనిపించిన ఒక నిర్మాణం చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఏలియన్స్‌ నిర్మించారా లేదా సహజంగానే ఏర్పడిందా లేక మానవ నిర్మాణమా అనేది ఇప్పటికీ ఎవ్వరూ తేల్చలేకపోయారు.

గ్రేట్‌ బ్లూ హోల్‌ 
బెలీజ్‌ సమీపంలో ఉన్న అతిపెద్ద సింక్‌ హోల్‌ ఇది. ఈ సముద్ర గుంత లోతుల్లో దిగుతున్న కొద్దీ నీటి ఉష్ణోగ్రత, పీడనం మారుతూ ఉంటుంది. ఇవి చూపుతున్న ప్రభావాలు శాస్త్రవేత్తలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇలా సముద్ర గర్భం ఒక్కొక్క చోట ఒక్కో విధంగా విశేషమైన ప్రత్యేకతతో ఉంటుంది. ఇవే కాకుండా సముద్ర గర్భం ఎన్నో రాజ్యాలను తనలో దాచుకుందని చరిత్ర చెప్తుంది.

అలాంటి అతిపెద్ద నగరాల్లో శ్రీకృష్ణుడి నగరంగా చెప్పుకునే ‘ద్వారక’ ఒకటి. టెక్టానిక్‌ ప్లేట్స్‌ కదలికలు జరుగుతున్న ప్రతిసారి ఎంతో కొంత భూమి సముద్రంలోకి దిగిపోతుంది. అలాగే కొంత భూమి సముద్రం బయటికి చొచ్చుకొని కూడా వస్తుంది. అలా మనకి ఒక ఖండమే మునిగిపోయినట్లు కూడా చరిత్ర చెప్తుంది. అందుకే, టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినా, ఇప్పటికీ మనిషి పరిశోధన చేయాలంటే భయపడే అతిపెద్ద అంశం ఒక్క సముద్రం మాత్రమే!

సముద్రపు వింత జీవులు...
సముద్రంలోని కొన్ని నమ్మలేని, వింత జీవులు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..  
క్రిస్మస్‌ ట్రీ వర్మ్‌: ఈ చిన్న జంతువుల శరీరంపై ఉండే స్పైరల్‌ ఆకారాల ‘ప్లూమ్స్‌’ క్రిస్మస్‌ ట్రీలలా కనిపిస్తాయి! ఇవి శ్వాస తీసుకోవడానికి, ఆహారం సేకరించడానికి ఉపయోగ పడతాయి.

లీఫీ సీ డ్రాగన్‌: ఆస్ట్రేలియా తీర ప్రాంతాల్లో కనిపించే ఈ జీవి, సీ హార్స్‌ కుటుంబానికి చెందినది. దాని శరీరంపై ఆకుల్లా కనిపించే చేతులు ఉంటాయి. వీటిని శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఒక ఆయుధంలా ఉపయోగిస్తుంది.

ఆంగ్లర్‌ ఫిష్‌: సముద్రం లోలోతుల్లో ఉండే జీవి ఈ ఆంగ్లర్‌ ఫిష్, దాని నోటిపైన మెరిసే గ్లో లైట్‌తో మామూలు చేపలను ఆకర్షించి వెంటనే చంపి, తినేస్తుంది.

నార్తర్న్‌ స్టార్‌గేజర్‌: ఈ చేప మట్టిలో దాగి, తన కళ్లతో పైకి చూస్తూ, చిన్న చేపలు ఎప్పుడొస్తాయా అని వేచి చూసి చంపి తినేస్తుంది. ఒక్కసారిగా పైకి దూకి, శత్రువును హడలెత్తిస్తుంది.

రెడ్‌హ్యాండ్‌ ఫిష్‌: ఈ జీవి ఈత కొట్టదు, నడుస్తుంది. రెడ్‌హ్యాండ్‌ ఫిష్‌ అనే ఈ చేప, టాస్మానియా సముద్ర తీరానికి ఆవల కనిపిస్తుంది. ఇది చేతుల్లా ఉండే మొప్పలతో సముద్రం అట్టడుగు నేలమీద నడుస్తూ తిరుగుతుంది.

సముద్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు చూస్తే, ప్రకృతి మనకేదో బలమైన సంకేతాలను పంపుతున్నట్లు అనిపిస్తోంది. కాని, మనం వాటిని గమనిస్తున్నామా? సముద్రపు లోతుల్లో నివసించే కొన్ని జీవులు అకస్మాత్తుగా భూమి మీదకు రావడం మనకు సమాధానం కావాల్సిన ప్రశ్నలు. ఈ మధ్యే ఆస్ట్రేలియాలో ఒకేసారి 150 కిల్లర్‌ వేల్స్‌ చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇవి చాలా తెలివైన, సమూహంగా జీవించే జలచర జీవులు. ఒక్కసారిగా ఈ స్థాయిలో వీటి మరణం సంభవించడం సాధారణ విషయం కాదు.

ఇక ‘బ్లాక్‌ డెవిల్‌ ఫిష్‌’ గురించి చెప్పాలంటే, ఇది ఆరువేల మీటర్ల లోతుల్లో ఉండే జీవి. అలాంటి జీవి ఒడ్డుకి వచ్చి చనిపోవడం అత్యంత అరుదైన ఘటన. అలాగే ‘ఓర్‌ ఫిష్‌’ లేదా ‘డూమ్స్‌ డే ఫిష్‌’ అనే చేప కూడా, సాధారణంగా మూడు నుంచి ఐదువేల మీటర్ల లోతులో జీవిస్తుంది. ఇది భూకంపాల ముందు ఉపరితలానికి వస్తుందన్న నమ్మకాలు కొన్ని దేశాల్లో ఉన్నాయి, ముఖ్యంగా జపాన్ లో. 2011 సునామీకి ముందు ఈ చేపలు ఎక్కువగా కనిపించాయి. ఇలా ఈ మధ్య కాలంలో సముద్రంలో అట్టడుగున ఉండే చాలా జీవులు బయటకు వస్తున్నాయి.

శాస్త్రవేత్తల వివరాల ప్రకారం, భూమి లోతుల్లో జరిగే టెక్టానిక్‌ ప్లేట్స్‌ కదలికలు, ఈ జీవులను పైకి తేలుస్తున్నాయేమో అని భావిస్తున్నారు. అయితే, ఇలా ఒకేసారి మూడు రకాల సంఘటనలు ఓర్‌ ఫిష్‌ ఉపరితలానికి రావడం, బ్లాక్‌ డెవిల్‌ ఫిష్‌ మరణం, కిల్లర్‌ వేల్స్‌ గుంపుగా నశించడం అన్నీ దాదాపుగా ఒకే సమయంలో చోటు చేసుకోవడం అనేది ప్రళయానికి సంకేతం అని, ఇది ప్రకృతి మనకు ‘జాగ్రత్త పడండి,’ అని హెచ్చరిస్తున్నట్లు చాలామంది భావన. త్వరలోనే దాదాపు అన్ని మతాల పురాణాల్లో ఉండే అతిపెద్ద జలచర జీవి ‘లేవియతాన్‌’ కూడా నిద్ర లేచిందని కథలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే, త్వరలోనే యుగాంతం జరగక మానదనే ప్రచారం కూడా వినిపిస్తోంది. 

ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, సముద్రాల్లో వేసే ప్లాస్టిక్‌ను తగ్గించడం అనేది పెద్ద మార్పు కాదు కాని, మంచి ఫలితాన్ని ఇచ్చే అతిపెద్ద విషయం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement