హిమాలయాల ఒడిలో, మేఘాలకు పైన కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం తుంగ్‌నాథ్ ఆలయం. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ జిల్లాలో, సముద్ర మట్టానికి 3,680 మీటర్లు (12,073 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా, శివుడికి అంకితమైన అత్యంత ఎత్తైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది పంచ కేదారాలలో మూడవది, అంటే తృతీయ కేదార్.
పౌరాణిక కథ
మహాభారత కథతో ఈ ఆలయానికి విడదీయరాని సంబంధం ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు తమ సోదరులను చంపిన పాప పరిహారం కోసం శివుడిని వెతుకుతూ హిమాలయాలకు వచ్చారట. శివుడు వారికి కనిపించకుండా ఎద్దు రూపంలో దాక్కున్నాడని, అప్పుడు ఆయన శరీర భాగాలు ఐదు చోట్ల వెలిశాయనేది పౌరాణిక విశ్వాసం.
అందులో చేతులు (బాహువులు) వెలసిన ప్రదేశమే తుంగనాథ్. ఆలయ పునాదిని అర్జునుడు వేశాడని కూడా పురాణ కథనాల్లో చెబుతారు. ఈ ఆలయం వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా భావిస్తారు.
చోప్టా నుంచి మొదలయ్యే ప్రయాణం
తుంగనాథ్ ఆలయం కొలువై ఉన్న ప్రదేశం అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి ’మినీ స్విట్జర్లాండ్’ అని పిలిచే చో΄్టా నుండి ట్రెక్ చేయాలి. కేవలం 3 కిలోమీటర్ల దూరమే అయినా, నిటారుగా ఉండే ఈ దారిలో రోడోడెండ్రాన్ పూల అడవులు, మంచు కప్పిన హిమాలయ శిఖరాలు కనువిందు చేస్తాయి.ఆలయానికి మరో 1.5 కిలోమీటర్ల దూరంలో చంద్రశిల శిఖరం ఉంది. అక్కడి నుండి నందాదేవి, త్రిశూల్, చౌఖంబా శిఖరాలుం ఇలా 360 డిగ్రీలలో ఎటు తిరిగినా హిమాలయాల దర్శనం అనేది జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.
ఎప్పుడు వెళ్లాలి?
చలికాలంలో అంటే సాధారణంగా నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు మంచు కారణంగా ఆలయం మూసివేయబడుతుంది. అప్పుడు ఉత్సవమూర్తిని మక్కుమఠ్‌కు తరలిస్తారు. దర్శనానికి సాధారణంగా ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఆలయం తెరవడం, మూసివేయడం తేదీలు ప్రతి సంవత్సరం మారవచ్చు.
తుంగనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది ప్రకతి, ఆధ్యాత్మికత, సాహసం కలిసిన ఒక పవిత్ర యాత్ర. శివుడి నామస్మరణతో ఆ కొండల్లో వేసే ప్రతి అడుగు మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది.
చదవండి: ధృతరాష్ట్ర కౌగిలి


