ప్రైమ్‌ మినిస్టరే కెప్టెన్‌గా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన ఘటన..! | World Cup 2023: Interesting Facts About Indian Cricket | Sakshi
Sakshi News home page

ప్రైమ్‌ మినిస్టరే కెప్టెన్‌గా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన ఘటన! క్రికెట్‌కి సంబంధించిన ఆసక్తికర ఘటనలు

Published Sun, Nov 19 2023 8:09 AM | Last Updated on Sun, Nov 19 2023 10:08 AM

World Cup 2023: Interesting Facts About Indian Cricket  - Sakshi

పంచభూతాలు కూడా ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఊపిరి బిగపట్టి ఎదురుచూస్తున్నాయి. మరి సోషల్‌ మీడియా గమ్మున ఉంటుందా? అక్కడ సందడే సందడీ. అందులో నుంచి కొంచెం..

సూపర్‌ హిట్‌ అందుకున్న క్రికెట్‌ సినిమాలు..
మన దేశంలో సినిమాలకు ఎంత క్రేజ్‌ ఉందో క్రికెట్‌కు అంతే క్రేజ్‌ ఉంది. ఈ రెండు క్రేజ్‌లను కలిపితే సూపర్‌ హిట్టే అనుకుంటూ క్రికెట్‌ ప్రధానంగా, క్రికెటర్‌ల జీవితకథల ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని...

22 యార్డ్స్, 83, 1983,  ఆల్‌ రౌండర్, బియాండ్‌ ఆల్‌ బౌండ్రీస్, లగాన్, ఇక్బాల్, దిల్‌ బోలే హడిప్పా, పాటియాల హౌజ్, ఫెరారీ కీ సవారీ, కై పో చే, ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ, అజార్, జెర్సీ, సచిన్‌: ఏ బిలియన్‌ డ్రీమ్స్‌ (డాక్యుమెంటరీ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌), వరల్డ్‌ కప్‌ 2011, హాట్రిక్‌ (స్పోర్ట్స్‌ కామెడీ ఫిల్మ్‌), గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ (బయోపిక్‌ స్పోర్ట్స్‌ ఫిల్మ్‌), గోల్కొండ హైస్కూల్‌. స్పోర్ట్స్‌ కామెడీ యాక్షన్‌ ఫిల్మ్‌ ఫెండ్షిప్‌ (2021)లో హర్బజన్‌ సింగ్‌ ‘భజ్జీ’ అనే పాత్రలో నటించాడు. వెంకటేష్‌ నటించిన ‘వసంతం’ సినిమాలో వీవీఎస్‌ లక్ష్మణ్‌  గెస్ట్‌రోల్‌లో కనిపిస్తాడు.కెప్టెన్‌ చాచా నెహ్రూ

కెప్టెన్‌గా చాచా నెహ్రు..
మన దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్‌ నెహ్రుకు ఆటలు అంటే అందులోనూ క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కాదు బ్రహ్మాండంగా ఆడతాడని పేరు కూడా. ప్రధాని అయిన తరువాత కూడా క్రికెట్‌పై ఆయన అభిమానం తగ్గలేదు. 1953లో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ వరద బాధితుల కోసం దిల్లీలో ఛారిటీ క్రికెట్‌ మ్యాచ్‌ జరిగింది. ప్రైమ్‌ మినిస్టర్‌ వర్సెస్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఇది. నెహ్రూజీ ప్రైమ్‌మినిస్టర్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. చాలా సంవత్సరాల తరువాత బ్యాట్‌ చేతుల్లోకి తీసుకోవడం ఒక విశేషం అయితే ప్రొఫెషనల్‌ ప్లేయర్‌లాగా ఆడడం మరో విశేషం.

అబ్బే... కవిత్వం కాదండీ!
దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ నిక్‌నేమ్‌ కల్నల్‌. ఈ ఫొటోను చూస్తే కల్నల్‌ కవిత్వం రాసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. అయితే అది నిజం కాదు. ప్లేయింగ్‌ డేస్‌లో వెంగ్‌సర్కార్‌ పత్రికలకు కాలమ్‌ రాసేవాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో కాలమ్‌ రాస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది.

అట్లెట్లంటవయ్యా? ఇట్లెట్ల తింటవయ్యా!
1983 క్రికెట్‌ వరల్‌ కప్‌ సమయంలో ‘ఇండియా జట్టు గ్రూప్‌ స్టేజీ దాటి ముందుకు వెళ్లదు’ అని రాశాడు విజ్డన్‌ క్రికెట్‌ మంత్లీ ఎడిటర్‌ డేవిడ్‌ ఫ్రిత్‌. రాస్తే రాశాడుగానీ ఒక మంగయ్య శపథం కూడా చేస్తూ...‘ఈట్‌ మై వర్డ్స్‌’లాంటి ఇంగ్లిష్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఏదో వాడాడు. ఇండియా ప్రపంచ కప్‌ గెలిచిన తరువాత ఒక పాఠకుడు ‘ఇప్పటికీ మీరు మాట మీదే నిలబడతారా?’ అని కవ్వించాడు. ‘ఏదో మాట వరుసకు అన్నాను లేవయ్యా’ అనకుండా మాట మీద నిలబడ్డాడు ఫ్రీత్‌. మ్యాగజైన్‌లో ప్రచురితమైన వ్యాసం కాగితాన్ని కెమెరా ముందు తిన్నాడు. 

యస్‌... ఏనుగే గెలిపించింది!‘..
మిత్రులారా ఈ పుస్తకం చదవండి. క్రికెట్‌కు సంబంధించి సకల వివరాలు, విశేషాలు, వినోదాలు, గణంకాలు... ఇలా ఎన్నో తెలుసుకోవచ్చు’ అని అభిషేక్‌ ముఖర్జీ, జాయ్‌ భట్టాచార్య రాసిన ‘గ్రేట్‌ ఇండియన్‌ క్రికెట్‌ సర్కస్‌’ పుస్తకం గురించి గత నెలలో రాజకీయ నాయకుడు, రచయిత శశి థరూర్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టాడు. దీని ప్రభావమేమో తెలియదుగానీ చాలామంది ఈ పుస్తకంలోని విషయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అందులో కొన్ని...

  • 1971లో భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు వినాయక చవితి వచ్చింది. లండన్‌లోని స్థానిక భారతీయులు చెస్సింగ్టన్‌ జూ నుండి బెల్లా అనే మూడేళ్ళ ఏనుగును తీసుకువచ్చి స్టేడియం చుట్టూ తిప్పారు. మన జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఈ ఏనుగు ఆశీస్సుల వల్లే మన జట్టు గెలిచింది అని చాలామంది బలంగా నమ్మారు.
  • వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో కపిల్‌దేవ్‌ షాట్‌కు ఒక సీగల్‌ చనిపోయింది. (మనస్తాపానికి గురైన కపిల్‌ ఈ బాధ నుంచి కోలుకోవడానికి గ్లాసు నీళ్లు కావాలని కోరాడని, ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఎలన్‌ బోర్డర్‌ తిరస్కరించాడని రచయితలు రాశారు).
  • చండీగఢ్‌లో జరిగిన లోకల్‌ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్‌ (పేరు రాయలేదు) సిక్సర్‌కు ఒక గుర్రం చనిపోయింది.
  • తన తోటలో పండించిన హైబ్రీడ్‌ మ్యాంగోకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ పేరు పెట్టాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఖలీముల్లా ఖాన్‌. ‘ప్రపంచంలో సచిన్‌లాంటి ప్లేయర్‌ మరొకరు లేరు. అందుకే హైబ్రీడ్‌ మ్యాంగోకు ఆయన పేరు పెట్టాను’ అంటాడు ఖాన్‌.
  • తీహార్‌ జైలులోని ఒక బ్లాక్‌కు మనోజ్‌ ప్రభాకర్‌ పేరు ఉండేది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో మనోజ్‌ పేరు వినిపించిన తరువాత బ్లాక్‌కు ఆయన పేరును తొలగించారు అధికారులు. 

(చదవండి:  ఒక రోజు హోటల్‌ అద్దె లక్షన్నర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement