ICC World Cup 2023: ఒక రోజు హోటల్‌ అద్దె లక్షన్నర

ICC Cricket World Cup 2023 Final Match: Hotel and flights ticket prices soaring in Ahmedabad - Sakshi

వైరల్‌

అహ్మదాబాద్‌ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్‌కప్‌ వన్‌డే క్రికెట్‌ ఫైనల్స్‌ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్‌ రూమ్‌లు? టికెట్‌లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్‌. ప్రతి విశేషమూ వైరలే.

‘ఆల్‌ రోడ్స్‌ లీడ్‌ టు అహ్మదాబాద్‌’. క్రికెట్‌ జ్వరం, క్రికెట్‌ జలుబు, క్రికెట్‌ దగ్గు, క్రికెట్‌ కలవరింతలు, క్రికెట్‌ స్లీప్‌ వాక్‌... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్‌కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్‌ కప్‌ ఫైనల్స్‌. ఇండియా వెర్సస్‌ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్‌.

ఇది నేరుగా చూడ దగ్గ మేచ్‌యే గాని... టీవీలలో చూడ మ్యాచ్‌ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్‌ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్‌ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్‌ టికెట్లు లేవు.

ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్‌ ఫ్లయిట్‌ టికెట్‌ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్‌లో రూమ్‌ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్‌లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్‌ 34 వేలకు అమ్ముతున్నారు.

2500 టికెట్‌ 42 వేలు. పదివేల టికెట్‌ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్‌ ఫుడ్డు, రెస్టరెంట్‌ బిజినెస్, క్యాబ్‌ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్‌. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి.

100 కోట్ల జాతకం ఎలా ఉందో!
చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్‌’ యాప్‌ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్‌ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్‌ ఫౌండర్‌ పునీత్‌ గుప్తాకు ఫైనల్స్‌ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్‌ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్‌ యూజ్‌ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు.

2011లో ఇండియా వరల్డ్‌ కప్‌లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్‌ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్‌లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్‌ హల్‌చల్‌ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్‌ ఇండియా! జాతకం తిరగరాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top