టీ20 వరల్డ్‌కప్-2026 ఫైనల్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. ఈ తుది పోరును వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. అహ్మదాబాద్ ప్రస్తుతం 'క్రికెట్ ఫీవర్'తో ఊగిపోతోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు మొత్తం అమ్ముడుపోయాయి.
బుక్‌మై షో యాప్ ద్వారా టికెట్లను విక్రయించారు. ప్రారంభ టిక్కెట్ ధర రూ. 2 వేలు కాగా.. గరిష్ట ధర రూ. 75000గా నిర్ణయించారు. అయితే టిక్కెట్లు దొరకని అభిమానులను ధళారులు టార్గెట్ చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టిక్కెట్‌ను రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) కార్యదర్శి అనిల్ పటేల్ స్పందించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి ఫిజికల్ టిక్కెట్లను విక్రయించడం లేదని, కేవలం బుక్‌మైషో యాప్ ద్వారానే అధికారిక బుకింగ్స్ జరుగుతాయని స్పష్టం చేశారు.
అడ్డదారుల్లో టిక్కెట్లు కొనవద్దని ఆయన హెచ్చరించారు.కేవలం టిక్కెట్లే కాదు, అహ్మదాబాద్, గాంధీనగర్ నగరాల్లో హోటల్ గదుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా అహ్మదాబాద్ హోటల్లో ఒక రోజుకు ధర రూ. 4,000గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ క్రేజ్ కారణంగా ఈ ధరలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. అంటే ఒక్క రోజుకు రూ.40,000 పైగా వసూలు చేస్తున్నారు.


