
ఎంపవర్‌మెంట్
‘అయ్యా మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు. మీరు పట్టించుకోవాలి’ అని మహిళా బృందం అధికారులకు విన్నవించుకుంది. ‘అలాగే. తప్పకుండా’ అని హామీ ఇచ్చారు అధికారులు. రోజులు గడుస్తున్నా, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఝార్ఖండ్‌లోని పిచులియా గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకుండా తామే స్వయంగా రంగంలో దిగారు. 25 మంది మహిళలు పారలు, తట్టలతో రోడ్డు బాగు చేయడానికి దృఢసంకల్పంతో ముందుకు కదిలారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకం మైయా సమ్మాన్ యోజనను ఉపయోగించుకున్నారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రతినెల రూ.2,500 పొందడానికి వీలుకల్పించే పథకం ఇది. దసరాకు ముందు రోడ్డు వేయాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. చాలా రోజులు కష్టపడి తమ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు, పట్టణాలతో అనుసంధానించే రోడ్డు నిర్మించారు. దసరాకు కొన్ని రోజుల ముందే రోడ్డు నిర్మాణం పూర్తయింది.