breaking news
Womens Group
-
ఆకుపచ్చని ఉద్యమం
మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎడారిలాంటి చోట కూడ పచ్చని తోటై పలకరిస్తుంది. మహిళల సారథ్యంలోని ‘వనమాలి గార్డెనింగ్ గ్రూప్’ వాట్సాప్ వేదికగా విశాఖపట్టణంలో మిద్దెతోటల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వనమాలి గార్డెనింగ్ గ్రూప్‌లో మూడువేలమంది మహిళలు ఉన్నారు. అంతరించిపోతున్న అరుదైన సంప్రదాయ మొక్కలకు జీవం పోస్తున్నారు. గ్రీన్డ్రైవ్స్ నిర్వహిస్తూ రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు...‘పై కప్పు ఇస్తారా...పచ్చగా మార్చేస్తాం, మాకు ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మిద్దె చూపిస్తే చాలు మీకు కావాల్సిన ఆకు కూరలు, కూరగాయలు పండించే మార్గాల్ని చూపుతాం’ అంటున్నారు వనమాలి గార్డెనింగ్ గ్రూపుల నిర్వాహకులు అరుణ అరవల, సరితా మల్ల, జ్యోతి నాదెళ్ల. విశాఖపట్టణంలోని మురళీ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు వచ్చిన ఆలోచన మూడువేల మంది మహిళల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆకు పచ్చని ఉద్యమానికి వేదికగా నిలిచింది.అవసరాలు తీరేలా....పర్యావరణానికి మేలు జరిగేలా...వనమాలి గార్డెనింగ్ గ్రూపులో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన కూరగాయల తోట అనే రెండు గార్డెనింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో నగర వ్యాప్తంగా మూడువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వంట గది వ్యర్థాల నుంచి మొక్కలకు అవసరమైన కంపోస్టు ఎరువును తయారు చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతరిస్తున్న ఆకుకూరలకు జీవంఅంతరిస్తున్న సాంప్రదాయ ఆకు కూరలు, కాయగూరల పునరుద్ధరణకు ‘వనమాలి గార్డెనింగ్’ వ్యవస్థాపకురాలు ఎ.అరుణ కృషి చేస్తున్నారు. కొండపిండి ఆకు, నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర వంటి ఆకు కూరలతోపాటు, చెమ్మ చిక్కుడు, ముళ్ల వంకాయలు, ఇతర రాష్ట్రాలకు చెందిన క్లోవ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్, వింగ్డ్ బీన్స్, ఎయిర్ పొటాటో, గుడ్డు వంగ (ఎగ్ బ్రింజాల్), ఎరుపు బర్బాటీ, ఎరుపు తోటకూర, ఎరుపు చిక్కుడు, ఎరుపు బెండ, రెడ్ ముల్లంగి, ఎరుపు బచ్చలి కూరలు, సీమ చింత... మొదలైన వాటిని తన ఇంటి మిద్దెపై పండిస్తున్నారు అరుణ. వీటితో పాటు వైజయంతి మాల, వాటర్ యాపిల్, నోనీ ఫ్రూట్, బిలంబి ఉసిరి, పొట్టి పొట్ల కాయలు, పాన్ మత్తా, మింట్ తులసి, పాండవబత్తి, దాల్చిన చెక్క, అంజీర్, మల్బరీ ఫ్రూట్స్ వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటిని సంబంధించిన విత్తనాలు, నార్లు పంపిణీ చేస్తున్నారు.వనమాలి సమావేశాలువనమాలి పరిధిలో పదిహేను ఏరియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో వంద నుంచి రెండు వందల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఏరియాకి ఇద్దరు ఇంచార్జ్‌లు ఉంటారు. వీరు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత సభ్యులకు అవసరమైన సలహాలు అందిస్తారు. విత్తనాలు, కొమ్మలు, మొక్కలు, నారు ఇచ్చి పుచ్చుకుంటారు. సీనియర్ గార్డెనర్స్ సూచనలు తీసుకుంటారు, కొత్త ఐడియాలు నేర్చుకుంటారు. నెలకోసారి గ్రీన్ డ్రైవ్స్ నిర్వహించి రహదారుల పక్కన పార్క్‌లో మొక్కలు నాటుతున్నారు.కమ్యూనిటీ గార్డెనింగ్‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్’్ట కాన్సెప్ట్‌లో భాగంగా పనికిరాని వస్తువుల్లో నుంచి మొక్కల పెంపకానికి ఉపయోగపడేవాటిని ఎంచుకుంటారు వనమాలి గ్రూప్ సభ్యులు. పాత వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్, బకెట్లు, టబ్స్‌లో మొక్కలు పెంచుతారు. కమ్యూనిటీ గార్డెనింగ్‌ను ప్రోత్సహించడానికి అపార్ట్మెంట్ నివాసితుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వనమాలి గార్డెనింగ్ గ్రూప్. ఈ కార్యక్రమాలలో భాగంగా కూరగాయల మొక్కలు, విత్తనాలు పంచుతారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా...ఇరవై ఏళ్ల క్రితం మిద్దె తోట ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మేడ మీద 500 కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే టెక్నిక్‌ను తెలుసుకుని అమలు చేస్తున్నాను. మేడ పాడవకుండానే తోటను సృష్టించవచ్చు. మా గార్డెనింగ్ గ్రూప్ ద్వారా కొత్త రకాల మొక్కలు, విత్తనాలు పరిచయమయ్యాయి. కేరళ, తమిళనాడు, వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే అరుదైన కూరగాయలు కూడా మా మేడపై పండిస్తున్నాను. గ్రీన్ క్లైమేట్ ఎం.రత్నం సహకారం అందిస్తున్నారు.– అరుణ అరవల– వి.ఆర్. కశిరెడ్డి, సాక్షి, మురళీనగర్, విశాఖపట్నం -
కలిసి కట్టుగా కదిలారు... రోడ్డు నిర్మించారు
‘అయ్యా మా గ్రామానికి రోడ్డు సరిగా లేదు. మీరు పట్టించుకోవాలి’ అని మహిళా బృందం అధికారులకు విన్నవించుకుంది. ‘అలాగే. తప్పకుండా’ అని హామీ ఇచ్చారు అధికారులు. రోజులు గడుస్తున్నా, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.ఝార్ఖండ్‌లోని పిచులియా గ్రామానికి చెందిన మహిళా స్వయం సహాయక బృంద సభ్యులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆలోచించకుండా తామే స్వయంగా రంగంలో దిగారు. 25 మంది మహిళలు పారలు, తట్టలతో రోడ్డు బాగు చేయడానికి దృఢసంకల్పంతో ముందుకు కదిలారు. రాష్ట్ర ప్రభుత్వ పథకం మైయా సమ్మాన్ యోజనను ఉపయోగించుకున్నారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు ప్రతినెల రూ.2,500 పొందడానికి వీలుకల్పించే పథకం ఇది. దసరాకు ముందు రోడ్డు వేయాలనే లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. చాలా రోజులు కష్టపడి తమ గ్రామాన్ని మిగిలిన గ్రామాలు, పట్టణాలతో అనుసంధానించే రోడ్డు నిర్మించారు. దసరాకు కొన్ని రోజుల ముందే రోడ్డు నిర్మాణం పూర్తయింది. -
నారీ‘శక్తి’ వెలుగులిక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు.. సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపన బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. దీనికి సంబంధించిన వర్క్ ఆర్డర్లను ఒకటి, రెండురోజుల్లోనే అందించనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. సచివాలయంలో మంగళవారం జరిగిన పీఆర్ఆర్డీ, ఆర్థిక శాఖ అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహాయించి) 64 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇందుకోసం బ్యాంకర్లతో చర్చలు పూర్తయి, ఒప్పందాలు, రుణాలు అందించే ప్రక్రియకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఒక్కొక్క మెగావాట్ ఉత్పత్తికి రూ.3 కోట్ల వ్యయం కానుండగా.. దీనికి సంబంధించి ఇంకా బ్యాంకర్లతో ఒప్పందాలు, విధి విధానాలు పూర్తి కావలసి ఉంది. మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుదుత్పత్తిలో ఆలస్యం లేకుండా పీఆర్ ఆర్ డీ శాఖ చర్యలు చేపడుతోంది. రుణాలు సమకూర్చనున్న ‘స్త్రీనిధి’ మొత్తంగా 64 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవసరమైన రుణాలను స్త్రీనిధి సంస్థ సమకూర్చనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ.192 కోట్ల పెట్టుబడి అవసరం కాగా, 10 శాతం అంటే రూ.30 కోట్లు.. విలేజ్ ఆర్గనైజేషన్లు అందించనున్నాయి.స్త్రీనిధి ద్వారా మిగిలిన రూ.162 కోట్లను ప్రభుత్వం సమకూర్చనుంది. మార్చి 8నాటికి బ్యాంకర్లతో రుణాలిప్పించి.. వెయ్యి మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేసేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నట్టు ప్రభుత్వవర్గాల సమాచారం. -
లసల్గావ్ మార్కెట్.. ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలి ఆమె!
లసల్గావ్.. అసియాలోనే అతి పెద్ద ఆనియన్ మార్కెట్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సీజన్లో అక్కడ రోజూ ఉల్లిపాయల వేలం జరుగుతుంది. వ్యాపారులు మగవాళ్లే, దళారులు మగవాళ్లే, రైతులూ మగవాళ్లే. ఆడవాళ్లను ఆ దరిదాపుల్లోకి రానివ్వరు. అలాంటిది తొలిసారి.. ‘నా పాట...’ అంటూ ఒక మహిళ గొంతు వినిపించింది. అంతా తల తిప్పి చూశారు. ‘నా పేరు సాధన.. నా పాట ..’ అంటూ ఆమె వేలంలోకి దిగారు. అయితే మగవాళ్లంతా ఆ వేలాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం సాధన వైపు నిలబడింది. సాధనకు వేలం సమకూరింది. గ్లాస్ కన్నా గట్టిదైన ఆ ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలిగా సాధనా యాదవ్ వార్తల్లోకి వచ్చారు. లసల్గావ్ ఉల్లి మార్కెట్లో శుక్రవారం హటాత్తుగా ఉల్లిపాయల వేలంపాట ఆగిపోయింది. ‘‘మేము పాడం’’ అని వ్యాపారులు పక్కకు వెళ్లిపోయారు. వాళ్లతోపాటు దళారీలు, వాళ్లతోపాటు కొద్దిమంది రైతులు! ‘ఆడవాళ్లను వేలంలోకి ఎలా రానిస్తారు?’ అని వాళ్ల అభ్యంతరం. అయితే ఆ మాటను వారు నేరుగా అనలేదు. ‘వేలానికి వచ్చిన ఆ ఆడ మనిషికి కమిటీలో సభ్యత్వం లేదు. తనను వెళ్లిపొమ్మనండి’ అన్నారు. వాళ్లన్న ఆ ఆడ మనిషి సాధనా జాదవ్. వాళ్లన్న ఆ కమిటీ ఏపీఎంసీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. సాధన అనే ఆ మహిళకు ఎపీఎంసీలో సభ్యత్వం లేని మాట నిజమే. అయితే ఉండాలన్న నిబంధన లేదు. సాధన అదే మాట అన్నారు. ‘‘వేలానికి ఎవరొచ్చినా, రాకున్నా మాకు అనవసరం. మేము పాటలోకి దిగుతున్నాం’’ అని చెప్పారు. లసల్గావ్ వేలంలో టన్నుల కొద్దీ ఉల్లిపాయల్ని కొనేసి తను వ్యాపారం చేసుకోడానికి సాధన అక్కడికి రాలేదు. ‘కృషి’ అనే వ్యవసాయ ఉత్పత్తుల మహిళా సహకార సంఘం తరఫున వచ్చారు. ఆమె వెనుక ‘కృషి’ ఉంది. ‘కృషి’ వెనుక నాఫెడ్ ఉంది. (నేషనల్ అగ్రికల్చరల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా). ఎవరున్నా వెనక్కి వెళ్లాల్సిందే అని సాధనను, ఆమె వెంట ఉన్న మరొక మహిళను అక్కడి నుంచి తరిమేసినంత పని చేశారు. అయితే వేలంలో పాల్గొనడానికి సాధనకు అధికారికమైన అడ్డంకులేమీ లేవు. పాటకు వచ్చిన పురుషులు వచ్చారు. పాట సాగింది. సాధనకు పాట దక్కింది. ∙∙ గ్లాస్ సీలింగ్ అంటుంటాం కానీ.. లసల్గావ్ ఆనియన్ సీలింగ్ మహా దృఢమైనది. మగాళ్లంతా జట్టు కట్టినట్లుగా ఆడవాళ్లను వేలంలోకి రానివ్వరు. తక్కువకు పాడి ఎక్కువకు అమ్మేసుకోవాలని అంతా ఒకమాటపై ఉండే ఆ వేలం వలయంలో ఉండేదంతా పురుషులే. మహిళా రైతులు ఉన్నా వారి తరఫున పురుషులనే వేలంలో పాడనిస్తారు. అయితే గత గురువారం నుంచి ‘నాఫెడ్’ తరఫున ‘కృషి’ సంస్థ డైరెక్టర్ అయిన సాధన నేరుగా తనే వేలానికి వస్తున్నారు. పైగా నాఫెడ్‌కు కృషి నోడల్ ఏజెన్సీ. ‘అయితే మాత్రం..’ అని వేలానికి వచ్చిన పురుషులు గురువారం ఒక్కరోజే కాదు, శుక్రవారం, శనివారం కూడా సాధన వేలంలో పాల్గొన్నారు. వేలం ఎవరి ఆధ్వర్యంలో అయితే జరిగిందో ఆ ఎపీఎంసీకి ఛైర్పర్సన్ కూడా మహిళే. సువర్ణ జగ్దీప్. మహిళ కాబట్టి మహిళకు మద్దతు ఇవ్వడం కాదు.. సాధన అవసరమైన పత్రాలన్నీ చూపించారు. ఇక పురుషులు సాకులు చూపడానికి దారి లేకపోయింది. లసల్గావ్ మార్కెట్ కమిటీ పరిధిలోని 321 మంది కమీషన్ ఏజెంట్లలో 107 మంది, కమిటీలో పేరు నమోదు చేయించుకున్న 335 మంది వ్యాపారులలో 71 మంది మహిళలు ఉన్నప్పటికీ ఏనాడూ అక్కడి వారు మహిళల్ని వేలం లోకి రానివ్వలేదు. సాధననా యాదవ్ వల్ల మొదటిసారి ఆ ఆనియన్ సీలింగ్ బ్రేక్ అయింది. ఈ ఘటనతో అసలు లసల్గావ్ వేలంలో ఇంతకాలం ఏం జరుగుతున్నదీ మాధునీ ఖడ్సే అనే మహిళా రైతు ముందుకు వచ్చి చెప్పగలిగారు. సాధనా యదవ్ వేలంపాటలో మహిళా రైతులు, మహిళా వర్తకుల మాట చెల్లుబాటు కాకుండా ఉండేందుకు అవసరమై అన్ని అవాంతరాలను, అడ్డంకులను, అసౌకర్యాలను వేలంలో పాల్గొనడానికి వచ్చే పురుషులు సృష్టిస్తూ ఉంటారని మాధురి చెప్పారు. సాధనా యాదవ్ చొరవతో మొట్టమొదటి సారి మహిళల మాట నెగ్గిందని అన్నారు. తక్కువకు వేలాన్ని ముగించనివ్వకుండా, న్యాయంగా పాడి రైతుకు లాభం చేకూరుస్తారు కనుకనే మహిళలను లోపలికి రానివ్వరని కూడా ఆమె చెప్పారు. ‘‘ఏపీఎంసీ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి ఈ పని చేస్తారు. ఇదేంటని ప్రశ్నించిన రైతు పంట వేలం వరకు రాకుండా వృథా కావలసిందే. మహిళలు ఇలాంటివి సాగనివ్వరు కనుకనే వాళ్లను దూరంగా ఉంచుతారు’’ అని అంటున్న సాధనా యాదవ్.. ‘‘ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. రైతుల తరఫున నిరంతరం ఒకరు ఉండాలి. మా సొసైటీ ఉంటుంది’’ అని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత -
మహిళా గ్రూపు సభ్యుల డబ్బు హాంఫట్
♦ సభ్యులకు తెలియకుండా డ్రా ♦ అధికారులు, సీఏల కుమ్మక్కు ♦ రెండేళ్ల తరువాత వెలుగులోకి.. మెదక్: మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా అధికారులతో కుమ్మక్కైన ఐకేపీ కోఆర్డినేటర్ రూ. 2.10 లక్షలు డ్రా చేసిన సంఘటన రెండేళ్ల తరువాత వెలుగులోకి వచ్చింది. ఇం దుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ మండలం శమ్నాపూర్ తండాలో సుమారు వందకు పైగా ఇళ్లు ఉన్నాయి. ఈ తండాలో స్వ యం సహాయక గ్రూపులను నడిపిం చేందుకు కోఆర్డినేటర్ ను నియమిం చారు. అయితే సదరు కోఆర్డినేటర్ మహిళా గ్రూప్ సభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారికి తెలి యకుండానే అధికారులతో కుమ్మక్కై మూడు గ్రూప్‌లకు చెందిన రూ. 2.10 లక్షలు డ్రా చేసుకున్నాడు. బ్యాంకులో చెల్లించడం లేదు. దీంతో సంబంధిత గ్రూ పు సభ్యులకు బ్యాంకు అధికారులు రుణాలు ఇవ్వడం లేదు. మాకు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని మహిళలు బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా అసలు విష యం బయట పడింది. 2014లో మూడు గ్రూపుల సభ్యుల రూ. 2.10 లక్షలు స్త్రీ నిధి రుణాలు పొందారని, వాటిని వడ్డీతో సహ చెల్లిస్తేనే కొత్త రుణాలి స్తామని బ్యాంకు అధికారులు తెల్చి చెప్పడంతో అమాయక మహిళలంతా తెల్ల మొహం వేశారు. ఈ విషయంపై లబోదిబోమంటూ ఐకేపీ అధికారులకు మొరపెట్టుకున్నారు. శమ్నాపూర్ తండాలో సీఏ పనిచేసిన వ్యక్తి గతంలో ఈ రుణం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో విషయాన్ని ఎవరికి చెప్పొద్దని, త్వరలోనే సీఏ నుంచి డబ్బులు వసూలు చేయిస్తామని ఐకేపీ అధికారులు మహిళా సంఘాల సభ్యులను బుజ్జగించే పనిలో పడ్డ ట్లు విశ్వసనీయ సమాచారం. డబ్బులు డ్రా చేసిన సీఏ ను పిలిపించి లోలోపల చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అధికారి వివరణ: ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం ఇందిరను సాక్షి వివరణ కోరగా తాను ఇక్కడకు రాకముందే ఈ వ్యవహారం జరిగిందన్నారు. కాగా మహిళా గ్రూప్ సభ్యులకు తెలియకుండా శ్రీనిధి రుణాలు తీసుకున్న సీఏతో మాట్లాడుతున్నామని, త్వరలోనే రికవరీ చేస్తామని తెలిపారు. -
కదంతొక్కిన మహిళా లోకం..
డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి - మద్య నిషేధం విధించి, మహిళలకు రక్షణ కల్పించాలి - రుణ మాఫీపై ఖానాపూర్‌లో కదంతొక్కిన మహిళలు ఖానాపూర్ : వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని చెప్పిన బ్యాంకర్లు.. ఇప్పుడు అధిక వడ్డీ వేసి రుణాలు బలవంతంగా వసూలు చేస్తున్నారని, డ్వాక్రా రుణాలు ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం మహిళలు కదంతొక్కారు. భారీ ఎత్తున ఆందోళన శనివారం మండల కేంద్రంలో పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ తీశారు. తదుపరి తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళా గ్రూప్‌కు రూ.10 లక్షల రుణాలు ఇవ్వాల్సింది పోయి.. 2012 నుంచి వడ్డీ మాఫీ అని చెప్పి ఇప్పుడు వాటిపై వడ్డీ వేసి నోటీసులు ఇస్తూ మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని వారు దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేసి.. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మండలంలోని అనేక గ్రూపులకు స్థానిక ఎస్బీహెచ్, ఎస్బీఐ అధికారులు నోటీసులు పంపారని చెప్పారు. ప్రమాదవశాత్తు చనిపోయిన మహిళ రుణాన్ని కూడా మాఫీ చేయాలని కోరారు. రుణాల వసూళ్ల పేరిట ఒత్తిడి చేస్తే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో మద్య నిషేధం విధించి.. రక్షణ కల్పించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్ రాజేశ్వరికి అందించారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మి, ఎం.జ్యోతి, ఉపాధ్యక్షురాలు ఎ.మంగ, కోశాధికారి నంది సమత, సహాయ కార్యదర్శి ఎం.హరిత, నాయకులు జక్కుల గంగామణి, నర్ర ఎంకుబాయి, రాజవ్వ, పద్మ, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నంది రామయ్య, మండల అధ్యక్షుడు మాన్క దేవన్న, నారాయణ, ఎల్ఆర్ ఉపాలి, విజయ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


