ఇలాంటి ఆలయం దేశంలో మరెక్కడా లేదు.. దీని విశిష్టత ఇదే

What Is The History Of Trishund Ganpati Mandir? - Sakshi

ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా మనం పూజించేది ఆ గణనాథుడిని. ఏకదంతుడిగా ప్రసిద్ధి చెందిన ఆ వినాయకుడికి మూడు తొండాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా, నమ్మాలి మరి. ఇలా మూడు తొండాలున్న త్రిసూంద్‌ గణపతిని చూడాలంటే మనం పూణెలో ఉన్న సోమ్వర్‌ పేట్‌ జిల్లాకి వెళ్ళాల్సిందే. ఈ ప్రాంతంలో ఉన్న నజగిరి అనే నదీ తీరంలో ఉంది ఈ త్రిసూంద్‌ గణపతి దేవాలయం. 

భీమజీగిరి గోసవి అనే వ్యక్తీ ఈ ఆలయాన్ని 1754లో మొదలుపెట్టారట. పదహారు సంవత్సరాల నిర్మాణం తరువాత 1770లో  గణపతిని ప్రతిష్టించారు. ఇక్కడి గర్భగుడి గోడల మీద మూడు శాసనాలు చెక్కబడి ఉన్నాయట. రెండు శాసనాలు సంస్కతంలో ఉంటే మూడోది పెర్షియన్‌ భాషలో ఉందట. ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయంలోని వినాయకుడికి మూడు తొండాలు, ఆరు చేతులు ఉండి స్వామి నెమలి వాహనంపై ఆశీనుడై ఉంటాడట. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. ఆలయంప్రాంగణంలో కూడా అనేక దేవతా విగ్రహాలు, ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువుల విగ్రహాలు శోభాయమానంగా కనపడతాయి.

ఎక్కడా లేని మరొక వింత ఈ ఆలయంలో ఒక గోడ మీద అమెరికన్‌ సైనికుడు ఖడ్గ మృగాన్ని ఇనప చైనులతో కడుతున్నట్టుగా ఉండే విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మన దేశంలో మరెక్కడా చూడలేము. అలాగే ఆలయాన్ని నిర్మించిన గోసవి మహాశయుడి సమాధి కూడా ఆ ఆలయ ప్రాంగణంలో ఉండటం ఇంకో విశేషం. ఆలయం కింద భాగంలో నీరు నిలవ ఉండే విధంగా కొలనులాంటిది కట్టారు.  ఎప్పుడూ నీటితో ఉండే ఆ కొలనుని గురుపూర్ణిమ రోజు నీరంతా ఖాళీ చేసి పొడిగా ఉంచుతారు.

ఆ రోజు అక్కడివారు తమ గురువుగా భావించే ఆలయ నిర్మాణకర్త గోసవికి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో సంకటహర చతుర్థిని ఎంతో ఘనంగా నిర్వహించే ఆచారం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోందిట. నెలలో ఆ ఒక్క రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కూడా. ఇక వినాయక చవితి ఉత్సవాలు ఇంకెంత ఘనంగా జరుగుతాయో వేరే చెప్పకర్లెద్దు. తొమ్మిది రోజులు పూణె చుట్టుపక్కల ఉన్న ఊరుల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ  విశేష పూజలు నిర్వహిస్తారట. రాజస్థాని, మాల్వా మాదిరి శిల్పకళ ఉట్టిపడే ఈ ఆలయాన్ని ప్రస్తుతం  ఒక ట్రస్ట్‌ నడిపిస్తోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top