కార్తీక 2.ఒ | Sakshi
Sakshi News home page

కార్తీక 2.ఒ

Published Tue, Jun 20 2023 12:34 AM

VK Karthika: Online Platform Pratilipi Seeks to Create Westland 2.0 - Sakshi

కార్తీక వీకే... ఎంతోమంది సాహిత్యాభిమానులకు సుపరిచితమైన పేరు. ‘క్వీన్‌ ఆఫ్‌ ఇండియన్‌ పబ్లిషింగ్‌’గా  కీర్తి అందుకున్న వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ (అమెజాన్‌ కంపెనీ) పబ్లిషర్‌గా ఎంతోమంది రచయితలను ప్రపంచానికి పరిచయం చేసింది. పాఠకుల నాడి పట్టుకుంది. మారుమూల పల్లె నుంచి హైటెక్‌ సిటీ వరకు ఏ చిన్న మెరుపు మెరిసినా ఆ మెరుపును అందుకోగలిగింది. కారణాలపై స్పష్టత ఇవ్వకపోయినా అమెజాన్‌ కంపెనీ వెస్ట్‌ల్యాండ్‌ బుక్స్‌ను మూసివేసింది.  ఆ తరువాత ఏమైంది?

‘ప్రతిలిపి’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది కార్తీక. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ప్రతిలిపి’ దేశంలోని పన్నెండు భాషలకు సంబంధించిన సృజనాత్మక రచనలకు, సాహిత్యభిమానుల మధ్య చర్చలకు వేదిక అయింది.
బెంగళూరు కేంద్రంగా పనిచేసే ‘ప్రతిలిపి’ వెస్ట్‌ల్యాండ్‌ పబ్లిషింగ్, ఎడిటోరియల్, మార్కెటింగ్, సేల్స్‌ టీమ్‌ను యథాతథంగా తీసుకొని కొత్త ప్రయాణం మొదలు పెట్టింది.
ఈ కొత్త వెంచర్‌ని ‘వెస్ట్‌ల్యాండ్‌ 2.ఒ’ అని పిలుస్తున్నారు.

 దేశంలోని మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఎడిటర్‌లలో ఒకరిగా పేరుగాంచిన కార్తీకకు వెస్ట్‌ల్యాండ్‌లాగే ‘ప్రతిలిపి’ని పాపులర్‌ చేయాల్సిన బాధ్యత ఉంది.
‘ప్రతిలిపి పేపర్‌బ్యాక్స్‌’ శీర్షికతో తమ యాప్‌లో పాపులర్‌ అయిన రచనలను కార్తీక నేతృత్వంలో పుస్తకాలుగా తీసుకు రానుంది ప్రతిలిపి.
‘గతానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే అప్పుడు పాపులర్‌ రచనలను పుస్తకాలుగా ప్రచురించేదాన్ని. ఇప్పుడు యాప్‌లో పాపులర్‌ అయిన రచనలను పుస్తకంగా ప్రచురించబోతున్నాను’ అంటుంది కార్తీక.

‘పుస్తకం అంటే కొన్ని పేజీల సముదాయం కాదు. అదొక ప్రపంచం’ అని చెప్పే కార్తీకకు ‘సంప్రదాయ పబ్లిషర్‌’ అని పేరు ఉంది. అయితే ఇప్పుడు ఈ సంప్రదాయ పబ్లిషర్‌ ఆడియోబుక్, యాప్, పాడ్‌కాస్ట్‌... మొదలైన ఫార్మాట్‌లలో సాహిత్యాభిమానులకు చేరువ కావడానికి కొత్తదారిలో ప్రయాణం చేస్తుంది.
‘కాలంతోపాటు నడవాలి. కొత్త ఫార్మాట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. ఇది సవాలు మాత్రమే కాదు ఎంతో ఉత్సాహం ఇచ్చే పని కూడా’ అంటుంది కార్తీక.
కార్తీకతో కలిసి మరోసారి పనిచేయడానికి రచయితలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆ ఉత్సాహమే ఆమె బలమని చెప్పాల్సి అవసరం లేదు కదా!

వైవిధ్యమే బలం
ప్రచురణ రంగానికి వైవిధ్యమే ప్రధాన బలం. అందుకే ఎప్పటికప్పుడు పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుంటాను. పాఠకులకు ఎలా చేరువ కావాలనేదానిపై రకరకాలుగా ఆలోచిస్తాను. పాఠకులకు చేరువ కావాలనే లక్ష్యం కోసం వక్రమార్గాల్లో పయనించడం నా సిద్ధాంతం కాదు. సమాజానికి హాని చేసే కంటెంట్‌ను దగ్గరికి రానివ్వను. వ్యాపారానికి నైతికత అనేది ముఖ్యం. విలువలకు ప్రాధాన్యత ఇస్తాను. ఎంపికకు సంబం«ధించిన విషయంలో కూడా ‘నాదే రైట్‌’ అనే ధోరణితో  కాకుండా ఇతరులతో విస్తృతంగా చర్చిస్తాను.

సోకాల్ట్‌–మెయిన్‌ స్ట్రీమ్‌ ఆలోచనలకు పక్కకు జరిగితే ఎంతో అద్భుతమైన ప్రతిభను వెలుగులోకి తీసుకురావచ్చు. నా కెరీర్‌లో సంతోషకరమైన విషయం ఏమిటంటే యువతలో చదివే వారి సంఖ్య పెరగడం. ‘కొత్త పాఠకులు ఎలాంటి కంటెంట్‌ను ఇష్టపడుతున్నారు?’ అని తెలుసుకోవడం ముఖ్యం. శక్తిమంతమైన, సృజనాత్మకమైన ఆలోచనలు ఎక్కడో ఒకచోట ఉంటాయి. అవి ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వెలుగులోకి తీసుకురావడమే పబ్లిషర్‌ బలం.

– కార్తీక వీకే
 

Advertisement

తప్పక చదవండి

Advertisement