అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..! | Ultimate Araku Valley Travel Guide: Borra Caves, Coffee And Waterfalls | Sakshi
Sakshi News home page

అరకు విహారం.. ఘుమ ఘుమల కాపీ సేవనం..!

Aug 4 2025 10:12 AM | Updated on Aug 4 2025 10:47 AM

Ultimate Araku Valley Travel Guide: Borra Caves, Coffee And Waterfalls

అరకు టూర్‌ అంటే అరకొరగా ఉండదు. జీఐ ట్యాగ్‌ సొంతమైన కాఫీ రుచిలా ఉంటుంది. చక్కటి పచ్చదనం మధ్య కాఫీ తోటల్లో విహారం. చిక్కటి కాఫీ ఘుమఘుమల మధ్య ప్రకృతి వీక్షణం. గాలికొండ నుంచి నేలమ్మకు వందనం చేయడం. బొర్రా గుహల రాతి శిలల శిల్పచాతుర్యం. ఆదివాసీ మ్యూజియం చెప్తున్న నాటి జీవనశైలి...అందుకే దీనిని తూర్పు కనుమల రత్నం అన్నారు. వీటన్నింటినీ చూపిస్తుంది అరకులోయ పర్యటన.

విశాఖపట్నం నుంచి అరకుకు సాగే ప్రయాణమే ఓ అద్భుతం. కేరళలోని వయనాడు ప్రయాణం పశ్చిమ కనుమల సౌందర్యానికి అద్దం పడుతుంది. తూర్పు కనుమల లాలిత్యానికి అరకు ప్రయాణం దర్పణమవుతుంది. ఈ కాఫీ రుచి కొలమానం ప్రపంచస్థాయి అవార్డే. 

జీఐ ట్యాగ్‌ అందుకున్న కాఫీ ఇది. కాఫీ గింజలు ఓ రకమైన కమ్మదనాన్ని గాల్లో మోసుకొస్తుంటాయి. తోటల్లో విహరిస్తున్నప్పుడు చెట్ల ఆకులు ఒంటిని తాకుతూ కలిగించే గిలిగింతను మాటల్లో వర్ణించలేం. 

కాఫీ చెట్ల లేత ఆకులు ముదరు కాఫీ గింజ రంగులో ఉంటాయి. లేత కాఫీ గింజలు పచ్చగా ఉంటుంది. ముదిరే కొద్దీ చిక్కటి ఎరుపుదనం సంతరించుకుంటాయి. ఎండిన తర్వాత నల్లగా మారుతాయి. కాఫీ తోటల విహారం తర్వాత ముందుకు సాగే కొద్దీ ఒక్కొక్క ప్రదేశమూ మినిమమ్‌ గ్యారంటీ ఆహ్లాదాన్నిస్తాయి.

ట్రైబల్‌ మ్యూజియం
అరకు బస్‌ స్టేషన్‌ నుంచి కేవలం పావుకిలోమీటరు లోపే ఉంటుంది మ్యూజియం. తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యం ఈ విజిట్‌లో ప్రత్యేక ఆకర్షణ. అరకు, విశాఖపట్నం పరిసరాల్లో 19 రకాల ఆదివాసీ జాతుల వాళ్లు నివసించేవారు. ట్రైబల్‌ కల్చర్, అందులోని వైవిధ్యతను పరిరక్షించే ఉద్దేశంతో దీనిని 1996లో ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఆదివాసీలు ప్రాచీన కాలం నుంచి ఉపయోగించిన వస్తువులు, ధరించిన ఆభరణాలు, దుస్తులు, వేటాడే సాధనాలు, వంట సామగ్రి, వారి పెళ్లి వేడుక ఫొటోలు ఉన్నాయి.  

ఆదివాసీలు రూపొందించిన చిత్రలేఖనాలు, కళారూపాలను కూడా చూడవచ్చు. వారి మయూర నృత్యం, ధింసా నృత్యం శిల్పాలు ఆకర్షణీయంగా ఉంటాయి.  ఎర్రమట్టితో నిర్మించి తెల్లటి అంచులతో ఈ భవనం ఆర్కిటెక్చర్‌ బాగుంటుంది. ఈ మ్యూజియం ఉదయం పది గంల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియం కావడంతో టికెట్‌ నామమాత్రమే. పెద్దవాళ్లకు పది రూ΄ాయలు, పిల్లలకు ఐదు రూ΄ాయలు.

పద్మపురం గార్డెన్స్‌
ఇది అరకు బస్‌ స్టేషన్‌ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరాన ఉంది. చాలా ప్రసిద్ధి చెందిన గార్డెన్‌ ఇది. పాతిక ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ గార్డెన్‌ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ పాలన కాలంలో 1942లో ఏర్పాటు చేశారు. ఇక్కడ పండిన కూరగాయలు రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికుల కోసం వెళ్లేవని చెబుతారు. 

యుద్ధం ముగిసిన తర్వాత ఈ గార్డెన్‌ని హార్టికల్చర్‌ నర్పరీ, మొక్కల పెంపకంలో శిక్షణ కేంద్రంగా మార్చారు. ఇక్కడి  వృక్ష శిల్పాలు కనువిందు చేస్తాయి. చెట్టుని శిల్పం ఆకారంలో మలిచి పెంచడానికి కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది. ఈ గార్డెన్‌ మొత్తం తిరిగి చూడడానికి టాయ్‌ ట్రైన్‌ ఎక్కాలి. ఈ గార్డెన్‌లో ట్రీ టాప్‌ హట్స్‌ ఉన్నాయి. 

అంటే చెట్టు మీద గుడిసెలన్నమాట. టూరిస్టులు రాత్రి బస కోసం బుక్‌ చేసుకోవచ్చు. వీటిని హ్యాంగింగ్‌ కాటేజ్‌ అంటారు. ఈ గార్డెన్స్‌లో రోజ్‌ గార్డెన్‌ ఉంది. పద్మపురం గార్డెన్స్‌కి ఎంట్రీ టికెట్‌ పది రూపాయలు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి.

కుర్సురా మ్యూజియం
ఇది దేశ భద్రత కోసం 31 సంవత్సరాల΄ాటు నిర్విరామంగా సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్న సబ్‌ మెరైన్‌. ఇండో– పాక్‌ యుద్ధంలో ఈ సబ్‌మెరైన్‌ అరేబియా సముద్రంలో గస్తీ కాసింది. ఆ తర్వాత అండమాన్‌ దీవులలో సేవలందించి తన సర్వీస్‌ కాలంలో 73,500 నాటికల్‌ మైళ్లు ప్రయాణించిన ఈ సబ్‌మెరైన్‌ 2001 నుంచి విశ్రాంతిలో ఉంది. 

ఇంతటి సమగ్రమైన సబ్‌మెరైన్‌ను ప్రభుత్వం 2002 లో ప్రదర్శనశాలగా మార్చింది. ఇది పిల్లలకు, పెద్దవాళ్లకు కూడా వినోదభరితంగా జ్ఞానాన్ని పంచే అధ్యయన కేంద్రం. దీని నిర్వహణకు ప్రభుత్వానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. 

అయితే ఈ సబ్‌మెరైన్‌ వీక్షణానికి వచ్చే పర్యాటకుల ఎంట్రీ టికెట్‌ల మీద ఏడాదికి కోటి రూపాయలను సంపాదిస్తోందీ సబ్‌మెరైన్‌. రోజుకు ఐదారు వందల మంది పర్యాటకులు వస్తుంటారు. సెలవు రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంటుంది. విశాఖపట్నానికి వచ్చిన వాళ్ల రామకృష్ణ బీచ్‌ని, అందులో ఉన్న సబ్‌మెరైన్‌ మ్యూజియాన్ని చూడకుండా రారంటే అతిశయోక్తి కాదు.

కైలాసగిరి
ఇది విశాఖపట్నం నగరానికి సమీపంలో ఆరువందల అడుగుల ఎత్తున్న కొండ. సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎకోపార్కు ఇది. రోప్‌వేలో కొండమీదకు వెళ్లడం పిల్లలకే కాదు పెద్దవాళ్లకు కూడా జాయ్‌ఫుల్‌గా ఉంటుంది. బెస్ట్‌ టూరిస్ట్‌ స్పాట్‌ అవార్డు అందుకున్న పర్యాటక ప్రదేశం ఇది.  స్థానికులు, బయటి వాళ్లు అంతా కలిసి కైలాసగిరిని రోజుకు మూడు వేల మందికి పైగా సందర్శిస్తారు.

గాలికొండ వ్యూపాయింట్‌
ఈ టూర్‌లో తూర్పు కనుమల ప్రకృతి సౌందర్యాన్ని అనంతంగా ఆస్వాదించవచ్చు. విశాఖపట్నం– అరకు రీజియన్‌లో ఎత్తైన ప్రదేశం గాలికొండ. 4,320 అడుగుల ఎత్తు ఉంటుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనంలో షేడ్స్‌ను లెక్కపెట్టాలంటే ఈ రోడ్డు వెంట ప్రయాణిస్తున్నంత సేపూ కనురెప్ప వేయకుండా చూడాలి. ఇక బొర్రా గుహలు ఓ ప్రకృతి అద్భుతం. 

గుహల పై కప్పు నుంచి స్టాలగ్‌మైట్‌ ధారలు ధారలుగా కారుతూ వాతావరణంలో మార్పులతో గడ్డకట్టి΄ోయి ఉంటుంది. అమరనాథ్‌ లో మంచు శివలింగం రూపం సంతరించుకున్నట్లు ఇక్కడ స్టాలగ్‌మైట్‌తో ఏర్పడిన శివలింగం రూపానికి పూజలు చేస్తారు. అమర్‌నాథ్‌ మంచులింగం ఏటా కరిగిపోతూ కొత్తగా రూపుదిద్దుకుంటుంది. బొర్రా గుహల్లోని స్టాలగ్‌మైట్‌ శివలింగం స్థిరంగా ఉంటూ ఉంటుంది.

చందనోత్సవ సింహాచలం
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఏడాదంతా చందనలేపనంతో ఉంటాడు. ఏడాదికోసారి చందనోత్సవం జరుగుతుంది. ఈసందర్భంగా పాత చందన లేపనాన్ని తొలగించి కొత్తగా చందనలేపనం చేస్తారు. స్వామి దేహం నుంచి తీసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఈ ఆలయంలో కప్పస్తంభం అని ఉంటుంది. అది కప్పం అనే పదం నుంచి వచ్చింది. రాజుకు కప్పం కట్టని ఉద్యోగులను ఆ స్తంభానికి కట్టేసి శిక్షించేవారని స్థానిక కథనం. 

ఇప్పుడు భక్తులను ఆ స్తంభానికి కట్టేసి, తాడుతో సున్నితంగా రెండు దెబ్బలు వేస్తారు. ఆ స్తంభాన్ని కౌగలించుకుని కోరికలు కోరుకుంటే అవి తీరుతాయని ఒక విశ్వాసం. సంతానాన్ని కోరుకునే వారు. పుట్టిన సంతానాన్ని దేవుని దర్శనానికి తీసుకువచ్చి మొక్కు తీర్చుకునే వారు. దాంతో కప్పస్తంభాన్ని కౌగలించుకుని కోరుకుంటే సంతానం కలుగుతుందనే అభిప్రాయం వాడుకలోకి వచ్చింది. 

సింహాచలంలో సంపెంగ పూలు ప్రసిద్ధి. చందనం రంగులో పొడవుగా ఉండే ఈ పూలను అటవీ ప్రదేశం నుంచి ఆదివాసీలు సేకరించి తెస్తారు. వాటిని మాలలుగా కట్టి అమ్ముతారు. ఈ టూర్‌ గుర్తుగా ఓ దండ కొనుక్కుని తలకు అలంకరించుకోవచ్చు లేదా మెడలో మాలగా వేసుకుని పరిమళాన్ని ఆస్వాదించవచ్చు.

అన్నవరం
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం ఎంతటి ప్రసిద్ధి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన ఆలయం. పురాణాల్లో ఉదహరించిన రత్నాచలం అనే ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ ఆలయం ఉన్న కొండ పేరు రత్నగిరి. ఈ ఆలయంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి భక్తులు ఆసక్తి చూపుతుంటారు. 

అరకు టూర్‌లో రైలు, రోడ్డు రవాణా సంస్థలు నిర్వహిస్తున్న ఈ రెండు ప్యాకేజ్‌లలో ఉన్న ప్రధానమైన తేడా అన్నవరం, సింహాచలం ఆలయాల విషయంలోనే. తెలంగాణ టూరిజమ్‌ బస్సు టూర్‌లో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ టూర్‌లో వెళ్తే సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామి దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన పర్యాటక ప్రదేశాలు రెండు టూర్‌లలోనూ ఒకే విధంగా ఉంటాయి. బస్‌ టూర్‌లో థింసా నృత్యం అదనం.

జ్యూవెల్‌ ఆఫ్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఐదు రోజుల టూర్‌లో విశాఖపట్నం, అరకు కవర్‌ అవుతాయి. అరకులో పర్యటించడానికి సెప్టెంబర్‌ నుంచి అనువైన సమయం. దసరా సెలవులకు ప్లాన్‌ చేసుకుంటే కాఫీ తోటల సౌందర్యాన్ని ఆస్వాదించడంతోపాటు పిల్లలకు సబ్‌ మెరైన్‌ నేవీ యుద్ధ నౌకను చూపించవచ్చు.

ఐఆర్‌సీటీసీ టూర్‌ ఇలా ఉంది!
మొదటి రోజు:  గురువారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకు 12728 నంబర్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది.
రెండవ రోజు: శుక్రవారం ఉదయం 5.55 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఐఆర్‌సీటీసీ టూర్‌ నిర్వహకులు పర్యాటకులను రిసీవ్‌ చేసుకుని హోటల్‌కు తీసుకెళ్తారు. చెక్‌ ఇన్, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత సిటీ టూర్‌. కాళీమాత ఆలయం, సబ్‌మెరైన్‌ మ్యూజియం వీక్షణం తర్వాత హోటల్‌కు వచ్చి లంచ్‌ చేయడం. మధ్యాహ్నం తర్వాత కైలాసగిరి సందర్శనం, రిషికొండ బీచ్‌ విహారం. రాత్రి బస విశాఖపట్నం హోటల్‌లో.
మూడవ రోజు:  బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత రోడ్డు మార్గాన అరకుకు ప్రయాణం. టైడా జంగిల్‌ బెల్స్‌ ఎకో టూరిజమ్‌ రిసార్ట్‌లో సేదదీరడం, పద్మపురం గార్డెన్స్, ట్రైబల్‌ మ్యూజియం విజిట్‌ తర్వాత లంచ్‌ విరామం. మధ్యాహ్నం తర్వాత గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల విహారం తర్వాత సాయంత్రానికి తిరిగి విశాఖపట్నంలోని హోటల్‌కు చేరడం, రాత్రి బస.
నాలుగవ రోజు: బ్రేక్‌ఫాస్ట్‌ తరవాత హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి బయలుదేరాలి. దారిలో సింహాచలం దేవస్థానం, రామకృష్ణ బీచ్‌లో విహారం తర్వాత నాలుగు గంటలకు విశాఖపట్నంలో స్టేషన్‌లో డ్రాప్‌ చేస్తారు. సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ట్రైన్‌ నంబర్‌ 12727 గోదావరి ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.
ఐదవ రోజు: ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు హైదరాబాద్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది.

ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్‌ ధరలివి: 

  • కంపర్ట్‌ కేటగిరీ (థర్డ్‌ ఏసీ), సింగిల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి దాదాపుగా 28 వేల రూపాయలవుతాయి. ట్విన్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి 17 వేలవుతాయి. ట్రిపుల్‌ షేరింగ్‌లో 13 వేలకు పైగా ఉంటుంది.

  • స్టాండర్డ్‌ కేటగిరీ (స్లీపర్‌) సింగిల్‌ షేరింగ్‌లో 26 వేలకు పైగా అవుతుంది. ట్విన్‌ షేరింగ్‌లో 15 వేలకు పైగా, ట్రిపుల్‌ షేరింగ్‌లో 11 వేలకు పైగా అవుతుంది.

  • ప్యాకేజ్‌లో మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, ఒక లంచ్, రెండు డిన్నర్‌లుంటాయి.

  • ఇది వీక్లీ టూర్‌. గురువారం మాత్రమే ఉంటుంది. 

  • ఇవి వర్తించవు: ప్యాకేజ్‌లో సూచించిన భోజనాలు తప్ప ఇతర భోజనాలు పర్యాటకులు సొంతంగా భరించాలి. రైల్లో కొనుక్కున్న తినుబండారాలు, పర్యాటక ప్రదేశాల ఎంట్రీ టికెట్‌లు, బోటింగ్, హార్స్‌రైడింగ్‌ వంటి ఇతర టికెట్‌లు వగైరాలు ప్యాకేజ్‌లో వర్తించవు.

టూర్‌ కోడ్‌: https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR027

తెలంగాణ టూరిజమ్‌ నిర్వహిస్తున్నరోడ్‌ ప్యాకేజ్‌ ఇలా ఉంది!
మొదటి రోజు:  సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌లోని పర్యాటక భవన్‌ (బేగంపేట, గ్రీన్‌ల్యాండ్స్‌) నుంచి తెలంగాణ టూరిజమ్‌ బస్‌ బయలుదేరుతుంది. అదే బస్సు ఆరున్నరకు బషీర్‌బాగ్‌ సీఆర్‌వో ఆఫీసు చేరుతుంది. ఆ స్టాప్‌కు సమీపంలో ఉన్న వాళ్లు అక్కడే ఎక్కవచ్చు. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది.
రెండవ రోజు: ఉదయం ఆరు గంటలకు బస్సు విశాఖపట్నం చేరుతుంది. హోటల్‌ గదిలో చెక్‌ ఇన్, రిఫ్రెష్‌మెంట్, బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత సిటీటూర్‌. కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్‌ మ్యూజియం విజిట్, బీచ్‌ విహారం తర్వాత హోటల్‌కు చేరడం, రాత్రి బస.
మూడవ రోజు: ఉదయం ఆరు గంటలకు అరకుకు ప్రయాణం. ట్రైబల్‌ మ్యూజియం విజట్, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్‌లో విహారం, బొర్రా గుహల వీక్షణం, ధింసా నాట్యాన్ని ఆస్వాదించడం ఆ రాత్రికి అరకులో బస.
నాలుగవ రోజు: అరకు నుంచి అన్నవరానికి ప్రయాణం. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు ప్రయాణం హైదరాబాద్‌కు సాగుతుంది.
ఐదవ రోజు: ఉదయం ఏడు గంటలకు బస్సు హైదరాబాద్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది.

బస్‌ ప్యాకేజ్‌ ఇలా...

  • తెలంగాణ టూరిజమ్‌ నిర్వహిస్తున్న అరకు టూర్‌ ప్యాకేజ్‌లో పెద్దవాళ్లకు ఒక్కొక్కరికి 6,999 రూపాయలు, పిల్లలకు 5,599 రూపాయలు.

  • ప్యాకేజ్‌లో నాన్‌ ఏసీ బస్సు ప్రయాణం, వైజాగ్‌లో ఏసీ బస, అరకులో నాన్‌ ఏసీ బస ఉంటాయి.
    ఆహారం, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ టికెట్‌లు, దర్శనం టికెట్‌లు, బోటింగ్‌ వంటివేవీ వర్తించవు.

– వాకా మంజులారెడ్డి, సాక్షి, ఫీచర్స్‌ ప్రతినిధి 

(చదవండి: వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement