వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..! | IRCTC Four Day Packages For Vaishno Devi From Delhi | Sakshi
Sakshi News home page

వైష్ణోదేవి దర్శనం..హిమాలయాల వీక్షణం..!

Jul 21 2025 7:10 AM | Updated on Jul 21 2025 9:55 AM

IRCTC Four Day Packages For Vaishno Devi From Delhi

వైష్ణోదేవి దర్శనం భారతీయుల కల అని చెప్పవచ్చు. హిందువులు భక్తిశ్రద్ధలతో పూజించే దైవం వైష్ణోదేవి. కశ్మీర్‌ వాసులు శ్రీ మాతా వైష్ణోదేవి అని పిలుచుకుంటారు. ఈ ఆలయం జమ్ము నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదు వేల అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ శక్తిపీఠాన్ని చేరడం కష్టం అని చెప్పకూడదు, బహు కష్టం అని చెప్పడమే కరెక్ట్‌. ఈ అమ్మవారు కొలువైన పర్వతం పేరు త్రికూట పర్వతం. ఏడాదికి దాదాపు కోటి మంది సందర్శించుకునే ఈ ఆలయానికి జీవితంలో ఒకసారైనా వెళ్లాలని ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆ కోరికను తీరుస్తోంది. 

1వ రోజు
న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో రాత్రి 8.40కి ట్రైన్‌ నంబరు 12425 రాజధాని ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.

2వ రోజు
తెల్లవారు జామున ఐదు గంటలకు రైలు జమ్ము రైల్వేస్టేషన్‌కు చేరుతుంది. టూర్‌ నిర్వహకులు రైల్వే స్టేషన్‌లో రిసీవ్‌ చేసుకుంటారు. అక్కడి నుంచి కాట్రాకు రోడ్డు మార్గాన వెళ్లాలి. నాన్‌ ఏసీ వెహికల్‌లో ప్రయాణం. మార్గమధ్యంలో సరస్వతి ధామ్‌ చూసుకుని కాట్రాకు చేరి అక్కడ హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌ కావాలి. వైష్ణోదేవి దర్శనం తర్వాత తిరిగి హోటల్‌కు వెళ్లి భోజనం, విశ్రాంతి. రాత్రి బస అక్కడే.

వైష్ణోదేవి యాత్రలో తొలిమెట్టు కాట్రా 
వైష్ణోదేవి దర్శనం అనుభూతి కాట్రా పట్టణం నుంచే మొదలవుతుంది. జమ్ములో రైలు దిగిన తరవాత నలభై కిలోమీటర్లు రోడ్డు మార్గాన ప్రయాణించాలి. ఈ పట్టణం సముద్రమట్టానికి 2,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. బాణగంగానది ఈ పట్టణం నుంచే ప్రవహిస్తుంటుంది. ఇక్కడి ప్రజల భాష డోంగ్రీ. హిందీ, పంజాబీ, అస్సామీ, కశ్మీరీ భాషలు మాట్లాడే వాళ్లు కూడా ఉంటారు. హిందీ వచ్చిన పర్యాటకులు కూడా స్థానికులు మాట్లాడే హిందీ యాసను అందుకోవడం కష్టం. 

టూర్‌ నిర్వహకులు, గైడ్‌లు ఇంగ్లిష్‌ మాట్లాడతారు, వైష్ణోదేవి దర్శనానికి వచ్చిన పర్యాటకులు కాట్రాలోని గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లలో బస చేస్తారు. కాట్రా పట్టణం కేవలం వైష్ణోదేవి పర్యాటకుల ఆధారంగానే అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక వీథి మొత్తం సావనీర్‌ షాపులే. డ్రై ఫ్రూట్స్‌ దుకాణాలు, ఉన్ని దుస్తులు, లెదర్‌ జాకెట్‌ల షాప్‌లకు లెక్కే ఉండదు. ఇక్కడి నుంచి వైష్ణోదేవి ఆలయానికి ట్రెకింగ్‌ మొదలవుతుంది.

ఇన్సూరెన్స్‌ తప్పనిసరి!
వైష్ణోదేవి దర్శన యాత్ర ప్రమాదంతో కూడిన పర్యటన కావడంతో పర్యాటకులకు యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. నడవ లేని వాళ్ల కోసం ఎలక్ట్రిక్‌ వాహనాలు, హెలికాప్టర్‌ సర్వీస్‌ కూడా ఉంటుంది. కాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి హెలికాప్టర్‌లో వచ్చేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతోంది. దాంతో కాట్రా చుట్టుపక్కల ఎటు చూసినా హెలీపాడ్‌లు దర్శనమిస్తాయి. ఇటీవల రోప్‌వే సౌకర్యం కూడా మొదలైంది. ఇది కాట్రాకు వైష్ణోదేవి ఆలయానికి మధ్యలోనున్న భైరోనాథ్‌ ఆలయం నుంచి మొదలవుతుంది. 

వైష్ణోదేవిని దర్శించుకోవడానికి విమానంలో వచ్చే వాళ్లు జమ్ములో దిగాలి. కొన్ని రైల్‌ సర్వీసులు కాట్రా స్టేషన్‌కు వస్తాయి. కొన్ని రైళ్లు జమ్ము మీదుగా వెళ్తాయి. ఆ రైళ్లలో వచ్చిన వాళ్లు జమ్ము నుంచి రోడ్డు మార్గాన కాట్రాకు చేరాలి. ఈ పర్యటనలో పర్యాటకుల ప్రధాన ఉద్దేశం వైష్ణోదేవిని దర్శించుకోవడంగానే ఉంటుంది. కానీ కాట్రాలో ఉన్న ‘శ్రీ మాతా వైష్ణోదేవి యూనివర్సిటీ’ని విజిట్‌ చేసి తీరాలి, కనీసం బయలు నుంచి అయినా చూడాలి. ఇక్కడ ఇంజనీరింగ్‌ కోర్సులు, ఎకనమిక్స్‌ వంటి సబ్జెక్టులతో΄ాటు బయోటెక్నాలజీ కోర్సులు కూడా ఉన్నాయి.  

బాణగంగ కథనం
కాట్రా నుంచి వైష్ణోదేవి మందిరానికి చేరే దారిలో బాణగంగానది ఉందని చెప్పుకున్నాం. ఈ హిమాలయాల్లోని శివాలిక్‌ శ్రేణుల్లో పుట్టింది. ఈ ప్రవాహం చీనాబ్‌ నదిలో కలుస్తుంది. వైష్ణోదేవి తలస్నానం చేయడానికి సృష్టించిన నీటి వనరు అని చెబుతారు. పురాణ కథల ప్రకారం వైష్ణోదేవి... శ్రీరాముని భక్తురాలు. శ్రీరాముని దర్శనం కోసం ఆమె హనుమంతునితోపాటు త్రికూట పర్వతం మీదకు వెళ్తోంది. 

ఆ సమయంలో హనుమంతుడికి దాహమైంది. అతడి దాహం తీర్చడం కోసం వైష్ణోదేవి ఈ ప్రదేశంలో బాణం వేసిందని, ఆ బాణం తాకిడితో నీటి చెలమ ఏర్పడిందని, హనుమంతుడు దాహం తీర్చుకున్న తర్వాత వైష్ణోదేవి ఇక్కడే తలస్నానమాచరించిందని, అందుకే బాణ్‌గంగ అనే పేరు వచ్చిందని చెబుతారు. స్థానికులు బాల్‌గంగ అని కూడా పిలుస్తారు. దీనికి అర్థం వైష్ణోదేవి తలస్నానం చేసిన నది అని.

పర్యాటకులకు వైద్య సేవ
జమ్ము నుంచి కాట్రా వెళ్లే దారిలో సరస్వతి ధామ్‌ ఉంది. వైష్ణోదేవి దర్శనం కోసం వచ్చే యాత్రికుల సౌకర్యార్థం పని చేస్తోంది. బస, ఆహార సౌకర్యాలు మాత్రమే కాదు, ఈ పర్యటనలో గాయపడిన వారి చికిత్స ప్రధాన ఉద్దేశంగా  వైష్ణోదేవి ఆలయ బోర్డు దీనిని ఏర్పాటు చేసింది.  

3వ రోజు
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తర్వాత లంచ్‌ ప్యాక్‌ చేసి ఇస్తారు. హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి కాట్రా నుంచి నుంచి చినాబ్‌ వంతెనకు బయలుదేరాలి. చినాబ్‌ వంతెన, పరిసరాల వీక్షణం తర్వాత జమ్ముకు ప్రయాణం. దారిలో రఘునాథ్‌ టెంపుల్‌ దర్శనం. రాత్రి ఎనిమిది గంటలకు జమ్ము రైల్వేస్టేషన్‌లో దించుతారు. జమ్ములో 12426 జమ్ము రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాలి. ఆ రైలు రాత్రి 9.25గంటలకు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.

వంతెన ప్రయాణం ఆకాశ విహారం
చినాబ్‌ నది మీద వంతెన పూర్తయింది. నాలుగు దశాబ్దాల కిందట 1983లో శంకుస్థాపన చేసుకున్న ఈ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని గత నెలలో ప్రయాణానికి సిద్ధమైంది. చినాబ్‌ వంతెనను ఇంజనీరింగ్‌ మిరకిల్‌ అని చెప్పాలి. సుడిగాలులు, భూకంపాలను తట్టుకునే టెక్నాలజీతో నిర్మించారు. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జి. దీని ఎత్తు 1,178 అడుగులు. 

ఈ బ్రిడ్జి ఈఫిల్‌ టవర్‌ కంటే ఎత్తైన నిర్మాణం. ఈఫిల్‌ టవర్‌ ఎత్తు 1,083 అడుగులు మాత్రమే. ఇక చినాబ్‌ వంతెన పొడవు 4,314 అడుగుల పొడవు, అంటే 1315 మీటర్లన్నమాట. చినాబ్‌ నది రెండు కొండల మధ్య ప్రవహిస్తోంది. ఆ కొండలను కలుపుతూ నిర్మించిన వంతెన ఇది. జమ్ము– బారాముల్లా లైన్‌లో కౌరి– బక్కాల్‌ రైల్వే స్టేషన్‌ల మధ్య వస్తుంది. ప్రస్తుతం ఇది గొప్ప పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందనుంది.

ఇది ప్రయాణం కాదు విహారం!
ఏటా చలికాలంలో రోడ్డు మార్గం మంచుతో కప్పబడి΄ోతుంది. దాంతో జమ్ము– కశ్మీర్‌కి మిగిలిన దేశంతో సంబంధాలు తెగి΄ోతాయి. ఈ రైల్‌ బ్రిడ్జితో ఏడాది పొడవునా సామాన్యులు కశ్మీర్‌కు ప్రయాణం చేయగలుగుతారు. చినాబ్‌ నది మీద నిర్మించిన ఈ వంతెనను కేవలం రవాణా సౌకర్యంగా భావించలేం. ఇది ప్రపంచంలో మనదేశానికి ఒక రికార్డును అందించింది. మన ఇంజనీరింగ్‌ టెక్నాలజీని ప్రపంచానికి చాటుకోవడానికి గొప్ప ప్రతీకగా నిలుస్తోంది. 

అంతకంటే ఎక్కువగా పర్యాటకులు హిమాలయాలను కళ్ల నిండుగా చూసుకోవడానికి ఈ వంతెన గొప్ప అవకాశం. తల వంచి చూస్తే మౌనంగా ప్రవహిస్తున్న చినాబ్‌ నది, తల తిప్పి చూస్తే 360 డిగ్రీలలో ఎటు చూసినా హిమాలయ శ్రేణులతో ప్రకృతి రమణీయత కనువిందు చేస్తుంది.

ఫొటోలు తీసుకోవాలి!
ఈ టూర్‌లో ఫొటోలు తీసుకోవడానికి చక్కటి ప్రదేశం చినాబ్‌ వంతెన, ఆ పరిసరాలు. పర్యాటకుల్లో చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే... క్లోజప్‌ ఫొటోలు తీసుకుంటారు. ఆ ఫొటోలో మనుషులు ప్రముఖంగా కనిపిస్తుంటారు, నేపథ్యం సరిగ్గా కవర్‌ కాదు. కొన్ని లాంగ్‌ షాట్‌లు తీసుకోవాలి. పనోరమిక్‌ షాట్‌లు తీసుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత వాటిని కంప్యూటర్‌లో చూసుకున్నప్పుడు మరోసారి ఆ ప్రదేశాల్లో మనో పర్యటన చేయవచ్చు. 

ఈ రైల్లో కొన్ని కోచ్‌లు పర్యాటకుల కోసం డిజైన్‌ చేసింది ఇండియన్‌ రైల్వే శాఖ. అందులో నుంచి హిమాలయాలను వీక్షిస్తూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. అలాగే చక్కటి వ్యూ పాయింట్‌లను గుర్తించి అక్కడ రైలు కొద్దిసేపు ఆగుతుంది. మామూలు స్టిల్‌ ఫొటోగ్రఫీ కెమెరాలు, వీడియో కెమెరాలు, స్మార్ట్‌ ఫోన్‌లతో ఫొటోలు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరమూ ఉండదు. కానీ డ్రోన్‌ కెమెరాలో చిత్రీకరించాలంటే పర్యాటకులు సంబంధిత అధికారులకు తమ వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలి.

సాహసాల ముఖద్వారం
చినాబ్‌ రైలు వంతెన టూరిస్టులకు ఆటవిడుపు వంటిది. హిమాలయాల్లో పీర్‌పంజాల్‌ శ్రేణుల్లో ట్రెకింగ్, నదుల్లో రివర్‌ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్‌ వంటి అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌కి ఈ ప్రదేశం ఎంట్రీ పాయింట్‌. వైష్ణోదేవి దర్శనంతోపాటు భీమ్‌ఘర్‌ ఫోర్ట్, శివ్‌ ఖోరీ గుహాలయం, పాట్నీటాప్‌ హిల్‌ స్టేషన్, సనాసర్‌ సరస్సు, అడ్వెంచర్‌ పార్కులకు వెళ్లడానికి ఇది జంక్షన్‌ పాయింట్‌.

ఎప్పుడు వెళ్లాలి?
ఈ టూర్‌కి వెళ్లడానికి మార్చి నుంచి అక్టోబర్‌ మధ్య కాలం అనువుగా ఉంటుంది. ఈ సమయంలో ఆకాశం మబ్బుల్లేకుండా నిర్మలంగా ఉంటుంది. హిమాలయాలు చక్కగా కనిపిస్తాయి. నవంబర్‌ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. ఈ సమయంలో రైల్లో ప్రయాణిస్తూ అద్దాల్లోంచి చూడడానికి బాగుంటుంది. కానీ పర్యటన సజావుగా సాగదు.

బంగారు మందిరం
జమ్ము నగరంలో రఘునాథ్‌ టెంపుల్‌ది ప్రత్యేకస్థానం. ఉత్తరాది రాష్ట్రాల్లోని పెద్ద ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయం ఉన్న వీథి పేరు రఘునాథ్‌ బజార్‌. డోగ్రా పాలకులు కట్టించిన ఆలయం ఇది. మొదటి డోగ్రా ΄ాలకుడు గులాబ్‌ సింగ్‌ 1835లో నిర్మాణాన్ని ప్రారంభించాడు. మహారాజా రణ్‌బీర్‌ సింగ్‌ 1857లో విగ్రహప్రతిష్ఠ చేశాడు. మిగిలిన భారతదేశంలో బ్రిటిష్‌ పాలన పట్ల అసహనం పెట్టుబుకుతూ సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం అది. 

ప్రతిష్ఠాపన తర్వాత మరో మూడేళ్ల పాటు చిన్న చిన్న నిర్మాణపనులు కొనసాగాయి. అంతకంటే ముందు 18వ శతాబ్దంలోనే కులు రాజు రాజా జగత్‌సింగ్‌ ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాడని ఆ తర్వాత ఎదురైన రాజకీయ అనిశ్చితి కారణంగా నిర్మాణం ముందుకు సాగలేదని, కుల్లు రాజుకు సామంతులుగా ఉన్న డోగ్రా రాజులు స్వతంత్రత సాధించిన తర్వాత జమ్ము–కశ్మీర్‌ రాజ్య తొలి మహారాజు గులాబ్‌ సింగ్‌ నిర్మాణం మొదలు పెట్టాడని స్థానికులు చెబుతారు. 

ఈ ఆలయంలో రఘునాథుని పేరుతో పూజలందుకుంటున్న దేవుడు శ్రీరాముడు. ఆలయం లోపలి గోడలకు బంగారు తాపడం చేశారు. ఆలయంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడివి ప్రధాన విగ్రహాలు. వీటితోపాటు అనేకమంది దేవుళ్లు దేవతల సాలగ్రామ రూపాలుంటాయి. ఆలయంలో సంస్కృత గ్రంథాల లైబ్రరీ ఉంది. అందులో ప్రాచీన చేతిరాత ప్రతులు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ చూడడం ఆహ్లాదకరం మాత్రమే కాదు, అవగాహనకరం కూడా. 

4వ రోజు
రైలు తెల్లవారు జామున 5.55 గంటలకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు చేరడంతో టూర్‌ పూర్తవుతుంది.
‘మాత వైష్ణోదేవి విత్‌ చినాబ్‌ బ్రిడ్జి’ టూర్‌ ప్యాకేజ్‌లో ప్రయాణం నాలుగు రోజులుంటుంది. 

ఇది ఢిల్లీ నుంచి మొదలయ్యే టూర్‌. ఇందులో వైష్ణోదేవి దర్శనంతో΄టు చినాబ్‌ వంతెన వీక్షణం ఉంటుంది. టూర్‌ కోడ్‌: MATA VAISHNODEVI WITH CHENAB BRIDGE EX DELHI (WEEKDAY) (NDR01C)

ప్యాకేజ్‌ ఇలా: థర్డ్‌ ఏసీలో ప్రయాణం. కాట్రాలో ఏసీ హోటల్‌ బస. సింగిల్‌ ఆక్యుపెన్సీ 14,200 రూపాయలు. డబుల్‌ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 11,555 రూపాయలు. ఢిల్లీకి వెళ్లే టికెట్‌లు, ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే టికెట్‌లు ఈ ప్యాకేజ్‌లో వర్తించవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement