డాబాగార్డెన్స్: విశాఖపట్నం మహా నగర పాలక సంస్థ(జీవీఎంసీ) పాలకవర్గం గడువు ముగియడంతో వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ సాధించిన ప్రగతి మరోసారి తెరపైకి వచ్చింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నాలుగేళ్ల పాటు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గొలగాని హరి వెంకటకుమారి హయాంలో నగరం అనేక రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఎలాంటి రాజకీయ పరిజ్ఞానం లేని విద్యావేత్త అయిన బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళను, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక చేయడం విశాఖ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పలికింది.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన పాలకవర్గం, ప్రజలకు అండగా నిలుస్తూనే నగరాన్ని ప్రగతి పథంలో నడిపించింది. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. దశాబ్దాలుగా పాతనగరం వాసులను వేధిస్తున్న ఇరుకు రోడ్ల కష్టాలకు చెక్ పెడుతూ, జగదాంబ జంక్షన్ నుంచి పాత పోస్టాఫీసు వరకు రోడ్డు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేసి వారి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చారు. అంతర్జాతీయ సదస్సులకు వేదికైన విశాఖను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలు, వాటర్ ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా మార్చారు. బీచ్‌లను సుందరంగా మార్చారు. రూ.2.3 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో జగదాంబ జంక్షన్‌లో 20 మీటర్ల క్లాక్ టవర్‌ను నిర్మించారు. పచ్చదనంతో నగరానికి కొత్త అందాలు అద్దారు. మూలకు చేరిన శివాజీ పార్కును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియానికి రూ.16.90కోట్లతో నూతన హంగులు తీసుకురావడం పాలకవర్గ పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి.
సమగ్రాభివృద్ధే లక్ష్యంగా.. : కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా, ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో జీవీఎంసీ వైఎస్సార్ సీపీ పాలకవర్గం విశేష కృషి చేసింది. మధురవాడ జోన్–2 భూగర్భ మురుగునీటి వ్యవస్థకు ఏకంగా రూ.553 కోట్లు, రోడ్ల నిర్వహణ, గుంతల పూడ్చివేతకు రూ.770 కోట్లు, సామాజిక భవనాల నిర్మాణం, నిర్వహణకు రూ.700 కోట్లు, మురుగునీటి కాలువల నిర్మాణానికి రూ.159 కోట్లు, 24 గంటల మంచినీటి పథకానికి రూ.140 కోట్లు కేటాయించి నగర మౌలిక రూపురేఖలను మార్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం నాడు–నేడు ద్వారా నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లను కార్పొరేట్ స్థాయిలో ఆధునికీకరించి పేదలకు మెరుగైన విద్య, వైద్యాన్ని చేరువ చేశారు. సింహాచలం వచ్చే భక్తుల కోసం మౌలిక వసతుల కల్పనతో పాటు అడవివరం రోడ్డును విస్తరించారు. ఈ మేరకు భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకున్నారు.
పార్టీలకతీతంగా ప్రగతి పరుగులు
కుల, మత, పారీ్టలకతీతంగా అందరినీ కలుపుకుపోతూ.. పారిశుధ్య నిర్వహణలో ఎక్కడా రాజీ పడకుండా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేయర్ స్వయంగా పర్యవేక్షించడం నగర స్వచ్ఛతకు ఎంతో దోహదపడింది. నగర ప్రథమ పౌరురాలిగా ఇద్దరు రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులకు, ముఖ్యమంత్రికి ఆతిథ్యం ఇవ్వడంతో పాటు ఐదుగురు కమిషనర్లు, ఒక స్పెషలాఫీసర్‌తో సమన్వయం చేసుకుంటూ హుందాగా పరిపాలన సాగించారు. మొత్తంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్గనిర్దేశంలో, మేయర్ హరి వెంకటకుమారి నేతృత్వంలో నగరం ఆ నాలుగేళ్లలో ప్రశాంతంగా.. అభివృద్ధిలో దూసుకుపోయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.


