ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది! | UK Woman heart stopped for 17 minutes during gym session | Sakshi
Sakshi News home page

ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!

Aug 1 2025 10:23 AM | Updated on Aug 1 2025 12:05 PM

UK Woman heart stopped for 17 minutes during gym session

విక్టోరియా అనే ఓ మహిళ గుండె స్పందనలు ఆగాయి. కార్డియాక్‌ అరెస్ట్‌తో ఆ గుండె ఆగగానే ఆమె దాదాపుగా చని΄ోయిందనే అనుకున్నారందరూ! ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిందామె గుండె. అయితే... అత్యంత అప్రమత్తతతో అత్యవసరంగా స్పందించిన కొందరు పారామెడిక్స్‌ కృషితో గుండె స్పందనలు మళ్లీ మొదలయ్యాయి. తీరా చూస్తే ఆమె గుండె అలా ఆగడానికి కారణం... ఆమెకున్నో అరుదైన జన్యుపరమైన వ్యాధి. మల్టిపుల్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌గా పిలిచే విక్టోరియా వ్యాధి వివరాలివి. 

యూకేలోని గ్లౌసెస్టర్‌ నగరానికి చెందిన విక్టోరియా థామస్‌ అనే మహిళ ఓ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. ముప్పై ఐదేళ్ల ఆమె తన ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆరోజునా ఆమె జిమ్‌లో వ్యాయామాలు చేస్తోంది. తన ఇంటెన్సివ్‌ వర్కవుట్‌ సెషన్‌లో భాగంగా అప్పుడే ఆమె తన వెయిట్‌ లిఫ్టింగ్‌ సెట్స్‌ పూర్తి చేసుకుంది. 

ఇంతలో ఆమెలోని శక్తినంతా తలలోంచి బయటకు తోడిపోసిన అనుభూతి! విక్టోరియా తన చేతిలోని వెయిట్స్‌ రాడ్‌ను ఇలా పక్కకు పెట్టిందో లేదో... ఒక పక్కకు అలా ఒరిగిపోయింది. పక్కనున్నవాళ్లు హుటాహుటిన పారామెడిక్స్‌ను తీసుకొచ్చారు. వాళ్లు ఆమె ఛాతీని నొక్కుతూ సీపీఆర్‌ (కార్డియో పల్మునరీ రీససియేషన్‌) మొదలుపెట్టారు. కానీ గుండె స్పందనలు ఎంతకీ మొదలు కాలేదు.

మరణానుభవానుభూతితో ఓ నిశ్శబ్ద శూన్యత... 
సెకన్లు నిమిషాల్లోకి గడిచి΄ోతున్నాయి. నిమిషాలు పదీ, పదిహేను నిమిషాల వ్యవధి  దాటి పావుగంటల్లోకి దొర్లిపోతున్నాయి. కానీ సీపీఆర్‌తో ఎంతగా ప్రయత్నిస్తున్నా విక్టోరియా కోలుకోవడం లేదు. అలా 17 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె గుండె అకస్మాత్తుగా స్పందనలనందుకుంది. ఈలోపు ఆమెకు అంతటా శూన్యం. భయంకరమైన నిశ్శబ్దం. 

ఎటు చూసినా... చూడకున్నా అంతా చిమ్మచికటి. ఆమెలోని తన స్మృతి హేతు జ్ఞానాలన్నీ విస్మృతిలోకి వెళ్లాయి. ఇలా ఆమె ఆ 17 నిమిషాల పాటూ ‘నియర్‌ డెత్‌’ భయంకరానుభవాన్ని చవిచూసింది. ప్రాణాలు దక్కవనే అనుకున్నారు. కానీ 17 నిమిషాల తర్వాత ఆమె గుండె స్పందనలు మొదలయ్యాయి.

మూడు రోజుల పాటు కోమాలోనే...
ఎట్టకేలకు గుండె స్పందనలు మొదలైనా ఇంకా ఆమె కోమాలోనే ఉంది. దాంతో విక్టోరియాను ‘బ్రిస్టల్‌ రాయల్‌ ఇన్‌ఫర్మరీ’ అనే ఓ పెద్ద వైద్యశాలకు తరలించారు. అక్కడామె మూడు రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత మెల్లగా కోలుకుని కోమాలోంచి బయటకొచ్చింది.

గర్భం దాల్చడంతో మొదలైన సవాళ్లు... 
ఇదిలా ఉండగా 2021లో విక్టోరియా గర్భం దాల్చింది. అప్పుడు చేసిన పరీక్షల క్రమంలో తెలిసిందేమిటంటే... ఆమెకు మల్టిపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ అనే వ్యాధి ఉందని! ‘డేనన్‌ డిసీజ్‌’ అని పిలిచే ఆ అరుదైన జన్యుపరమైన ఆ వ్యాధి కారణంగా ఇతర కండరాలతో పాటు గుండె కండరాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అవి క్రమంగా బలహీనపడిపోవడంతో (కార్డియోమయోపతి కారణంగా) గుండె మాటిమాటికీ ఆగిపోతుంటుంది. 

ఆ గుండె ఆగకుండా స్పందించేందుకూ... ఒకవేళ ఆగినా మళ్లీ స్పందనలు మొదలయ్యేందుకు డీ–ఫిబ్రిలేటర్‌ అనే పరికరాన్ని అమర్చారు. అది చేసే పనేమిటంటే గుండె ఆగినప్పుడుల్లా ఓ ఎలక్ట్రిక్‌ షాక్‌ పంపి, గుండెను మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. చిత్రమేమిటంటే... జన్యుపరమైన వ్యాధి అయినప్పటికీ... వాళ్ల కుటుంబంలో అందుకుముందెవరికీ ఆ వ్యాధి లేదు. అది కనిపించిన మొట్టమొదటి బాధితురాలు విక్టోరియానే!!

అసలే గుండె వీక్‌... ఆ పైన ప్రెగ్నెన్సీ!!
మొదటే గుండె చాలా బలహీనం. కానీ ఆలోపు ప్రెగ్నెన్సీ రావడంతో గుండె పంపింగ్‌ సరిగా జరగక మాటిమాటికీ విక్టోరియా గుండె ఆగి΄ోవడాలు జరిగేవి. ఇలా తరచూ జరిగే  కార్డియాక్‌ అరెస్టుల నేపథ్యంలోనే నెలల నిండకముందే సిజేరియన్‌తో బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. బిడ్డ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పండంటి మగబిడ్డ! అదృష్టం... పరీక్షలు చేసి చూస్తే తల్లికి ఉన్న ఆ జన్యుపరమైన జబ్బు బిడ్డకు లేదు!! 

డాక్టర్లు 2022లో విక్టోరియాకు గుండె పరీక్షలు చేయించినప్పుడు తెలిసిందేమిటంటే... ఆమె గుండె పనితీరు కేవలం 11 శాతమేనని!!  అంటే హార్ట్‌ ఫెయిల్యూర్‌ తాలూకు చివరి దశ అది. ఇకపై ఆమె బతకబోయేది కొద్ది నెలల మాత్రమేనని తేలింది. అదృష్టాలు ఒక్కోసారి ‘ఫలించి’నప్పుడు గుండెకాయ కూడా చెట్టుకాయలా దొరుకుతుంది. 

అలా ఆమెకు గుండె మార్పిడి చికిత్స కోసం తగిన గుండె దొరకడంతో... ఏప్రిల్‌ 2023 లో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్స చేశారు. దాంతో విక్టోరియా మృత్యుముఖం నుంచి మరోసారి బయటపడింది. ‘కొత్త హార్ట్‌’తో తల్లి... తన ‘స్వీట్‌ హార్ట్‌’ అయిన ఆ బిడ్డ... ఇలా ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ  క్షేమం.
– యాసీన్‌ 

(చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement