లైఫ్‌స్టైల్
పెళ్లంటే ఒకప్పుడు బంధు మిత్రుల కోలాహలం మధ్య సొంత ఊరిలో ఇంటి ముందర పచ్చని పందిరిలో ఘనంగా జరుపుకునే వేడుక. కానీ నేడు వివాహ వేడుకల శైలి వేగంగా మారిపోతోంది. గతంలో కేవలం సంపన్నులకే పరిమితమైన డెస్టినేషన్ వెడ్డింగ్ సంస్కృతి.. ఇప్పుడు మధ్యతరగతి వర్గాల్లోనూ ఒక ముఖ్యమైన ట్రెండ్‌గా మారింది. ప్రస్తుతం దేశంలో జరిగే మొత్తం వివాహాల్లో దాదాపు 25 శాతం డెస్టినేషన్ వెడ్డింగ్స్ కావడం విశేషం.
వివాహ వేడుకలు క్రమక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయి. విలాసవంతమైన రిసార్టులు, అందమైన బీచ్‌లు, చారిత్రక కోటల వేదికగా జరిగే డెస్టినేషన్ వెడ్డింగ్స్ వైపు నేటి తరం యువత ఎక్కువ ఆసక్తి చూపిస్తోంది. ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్ వెడ్‌మీగుడ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు వివాహాలలో ఒకటి డెస్టినేషన్ వివాహం కావడం.. వివాహాల్లో మార్పులు జరుగుతున్న తీరును కళ్లకు కడుతోంది.
పర్యాటకానికే ప్రాధాన్యం
గతంలో వేలాది మంది అతిథులను పిలిచేవారు. కానీ ఈ డెస్టినేషన్ మ్యారెజ్‌లో అతిథుల సంఖ్య పరిమితం. వచ్చిన వారికి ఒక గొప్ప పర్యాటక అనుభూతిని అందించేలా వేడుకలను ప్లాన్ చేసేందుకే యువ జంటలు మొగ్గు చూపుతున్నారు. గతంలో సగటున ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే సాగే ఈ వేడుకలు, ఇప్పుడు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఘనంగా సాగుతున్నాయి.
తగ్గేదే లేదు!
అయితే ఈ తరహా వివాహాల కోసం ఖర్చు చేసేందుకు కూడా జంటలు ఏమాత్రం వెనుకాడటం లేదు. దేశంలో జరిగే డెస్టినేషన్ వివాహాలలో పెళ్లిళ్ల సగటు బడ్జెట్ సుమారుగా రూ. 58 లక్షలు ఉంటుంది. అదే విదేశాలలో జరిగే వివాహాల సగటు బడ్జెట్ రూ. 1.5 కోట్లు దాటుతోంది. అయినప్పటికీ యువత డెస్టినేషన్ వివాహాల వైపే మొగ్గుచూపుతోంది.
హాట్‌స్పాట్‌గా శ్రీలంక
విదేశీ గమ్యస్థానాలలో థాయిలాండ్ ముందంజలో ఉన్నప్పటికీ.. ప్రస్తుతం శ్రీలంక భారతీయ జంటలకు ఫేవరెట్ వెడ్డింగ్ డెస్టినేష¯Œ గా అవతరించింది. శ్రీలంక భారతదేశానికి చాలా దగ్గరగా ఉండటం ఒక కారణమైతే భారతీయులకు వీసా లేకుండా ప్రవేశం, అద్భుతమైన బీచ్‌లు, లగ్జరీ హోటళ్లు, తక్కువ ఖర్చుతో కూడిన ΄్యాకేజీలు అందుబాటులో ఉండటం మరొక అంశం. శ్రీలంకతో పాటు బాలీ, వియత్నాం, మలేషియా వంటి దేశాలు కూడా రేసులో దూసుకుపోతున్నాయి.
మన దగ్గర టాప్ డెస్టినేషన్స్ ఇవే..
డెస్టినేషన్ వెడ్డింగ్స్‌లో సుమారు 90 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయి. వీటిలో ఉత్తరాది హిల్ స్టేషన్లు, రాజస్థాన్ రాజభవనాలు ముందంజలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఉన్న డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, సిమ్లా, జిమ్ కార్బెట్ పర్వతప్రాంతాలు, అలాగే ఉదయ్‌పూర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, గోవా వంటిప్రాంతాల్లోని రాజభవనాలు, బీచ్‌లు డెస్టినేషన్ వెడ్డింగ్‌లకి వేదికలుగా మారుతున్నాయి. అంటే ప్రస్తుత తరం పెళ్లిని ఒక బాధ్యతగా కాకుండా, జీవితంలో గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ప్రయాణంగా
మలుచుకుంటోంది.
ప్రస్తుతం భారతదేశంలో దాదాపు రూ. 6.5 లక్షల కోట్ల మార్కెట్ ఉన్న వివాహ పరిశ్రమలో.. కేవలం డెస్టినేషన్ వెడ్డింగ్స్ విభాగమే సుమారు రూ. 2.5 లక్షల కోట్ల విలువైన మార్కెట్‌గా ఎదగడం డెస్టినేషన్ ట్రెండ్‌కు అద్దం పడుతోంది.
ప్రస్తుతం 25 శాతంగా ఉన్న డెస్టినేషన్ వెడ్డింగ్స్ వాటా, 2028 నాటికి 30 నుంచి 32 శాతానికి పెరగనుందని అంచనా.
కోటి రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించే ధనిక జంటలలో దాదాపు 60 శాతం మంది స్వదేశీ వేదికల కంటే విదేశీ గమ్యస్థానాలకే ఓటు వేస్తున్నారు.
2025లో భారతీయ జంటలు శ్రీలంకను ఎంచుకునే రేటు 25 శాతం పెరగగా, రాబోయే రోజుల్లో ఇది ఏటా 20–25 శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
ప్రస్తుతం 38 శాతం మంది జంటలు పెళ్లికి ముందే ప్రత్యేకంగా ప్రీ–వెడ్డింగ్ ట్రిప్స్‌కి వెళ్తున్నారు. అంతేకాకుండా, కేవలం హనీమూన్ కోసమే సగటున రూ. 3.41 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా.


