చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు.. | Thomas Passionate Creating Spaces For Children To Nurture Their Talents | Sakshi
Sakshi News home page

చిట్టి రచయితలు.. అందమైన కథలతో అలరిస్తున్నారు..

Dec 20 2024 11:59 AM | Updated on Dec 20 2024 12:11 PM

Thomas Passionate Creating Spaces For Children To Nurture Their Talents

పెద్దల కోసం పిల్లలు రచయితలుగా మారి కథలు రాస్తున్నారు. ‘ఆహా’ అనిపించేలా వినసొంపుగా వినిపిస్తున్నారు. పేదింట్లో పుట్టిన చెన్నై శివారులోని కన్నగినగర్‌ విద్యార్థులు రచయితలుగా, వెంట్రిలాక్విస్ట్‌లుగా మారి పెద్దలకు కథలు చెబుతున్నారు. వినోదాన్ని పంచుతున్నారు. యూట్యూబ్‌ నుంచి ఎఫ్‌ఎం రేడియో వరకు రకరకాల వేదికలపై తమ ప్రతిభను చాటుకుంటున్నారు...

‘ఈ ఘనతకు కారణం ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబు....చెన్నైకి చెందిన వెంట్రిలాక్విస్ట్‌ ఎల్‌ థామస్‌. ‘క్యారీ విత్‌ లవ్‌’ ట్రస్ట్‌ నిర్వాహకుడైన థామస్‌ వన్నత్తు పూచ్చిగల్‌ (సీతాకోక చిలుకలు) పేరుతో  పిల్లలలోని సృజనాత్మక ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాడు.  కన్నగిరినగర్‌లో ఉండే  శ్రీ అనే బాలుడు లాస్ట్‌ బెంచ్‌ స్టూడెంట్‌. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు.  ఇక చదవడం తన వల్ల కాదు అనుకుంటున్న సమయంలో 

‘వన్నత్తు పూచ్చిగల్‌’ వాట్సాప్‌ గ్రూప్‌ తన నిర్ణయాన్ని మార్చేలా చేయడమేకాదు రచయితగా మార్చింది. జంతువులు ప్రధాన పాత్రలుగా ‘బొమ్మలాటం’ అనే నాటకం రాశాడు. స్వీయ ఆలోచన అవసరం గురించి ఈ కథలో చెప్పాడు.

ఇదే ప్రాంతానికి చెందిన సంజన స్టోరీ క్రియేటర్‌గా ప్రశంసలు అందుకుంటుంది. పొట్టలం(గంజాయి) అనర్థాలను  కళ్లకు కడుతూ రాసిన కథ అందరినీ ఆకట్టుకుంది. జ్యోతిశ్రీ అనే అమ్మాయి రాస్తే... ఎన్నో అక్షర దోషాలు కనిపించేవి. ఇప్పుడు అలా కాదు. చక్కని భాషలో రాస్తుంది. కథలతో మెప్పిస్తోంది. జ్యోతిశ్రీ చిన్న అక్క దివ్యదర్శిని కూడా రచనలు చేస్తోంది. ఆటో డ్రైవర్‌గా తండ్రి పడుతున్న కష్టాలు, గృహిణిగా తల్లి వేదనకు కథా రూపం ఇచ్చింది. ఈ కథలకు జ్యోతిశ్రీ పెద్ద అక్క నర్మద బొమ్మలు వేసింది. వీరు మచ్చుకు కొద్దిమంది మాత్రమే. ఇంకా ఎంతోమంది ఉన్నారు.

కథలు రాయడమే కాదు తమ వాక్చాతుర్యంతో ‘వన్నత్తు పూచ్చిగల్‌’ పేరుతో డిజిటల్‌ వేదికలపై కూడా సందడి చేస్తున్పారు. తమ అనుభవాలు, స్నేహితుల అనుభవాలు, ఎక్కడెక్కడో విన్న కథలను వినసొంపుగా చెబుతున్నారు. వారి మాటల్లో వినోదమే కాదు విజ్ఞానం, సామాజిక స్పృహ కూడా ఉంటాయి.

కళల వెలుగులో..
కళ అనేది కేవలం వినోదం కాదని భవిష్యత్‌ తరాలకు దిక్సూచి అని నిరూపిస్తున్నాడు  ఎల్‌ థామస్‌. ‘వన్నత్తు పూచ్చిగల్‌’ ప్రభావంతో చదువులో వెనకబడిన పిల్లల్లో ‘బాగా చదువుకోవాలి’ అనే పట్టుదల పెరిగింది. తమకు ఇష్టమైన కళలో అక్షరాభ్యాసం చేసి ప్రతిభ చాటుకుంటున్నారు. 
– అస్మతీన్‌ మైదీన్, సాక్షి, చెన్నై

(చదవండి: మేకప్‌ వేసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చెయ్యకండి..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement