నిఖిల్ పుస్తకం తెరిచాడు. కాని, ఒక్క నిమిషం కూడా ఒక్క పేజీపై చూపు నిలవడం లేదు. పక్కనే ఉన్న ఫోన్‌లో నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. అదేమిటో చూడాలని ఫోన్ తీసుకున్నాడు. అంతే, అరగంట గడిచిపోయింది. తల్లిదండ్రులు ‘చదువు మీద ఫోకస్ పెట్టు’ అంటారు. కాని, ఒక్క స్క్రోల్ ఆ ఫోకస్‌ను దూరం చేసేస్తోంది. అలా స్మార్ట్‌ఫోన్లు మెల్లగా మన యువతలోని ప్రతిభను, శ్రద్ధను, స్వీయ నియంత్రణను కమ్మేస్తున్నాయి.
కనబడని ఉచ్చు...
ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లు రోజుకు సగటున ఏడుగంటలకు పైగా స్క్రీన్ ముందు గడుపుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అందులో చదువుకు సంబంధించిన సమయం కేవలం10 శాతం మాత్రమే! మిగతా సమయం రీల్స్, గేమ్స్, షార్ట్స్, చాట్స్ – ఇవే వారి కొత్త ‘రియాలిటీ’.ఫోన్ మొదట క్యూరియాసిటీగా మొదలవుతుంది. తర్వాత ‘డిస్ట్రాక్షన్’, చివరికి ‘డిపెండెన్సీ’. చివరకు మెదడు ఫోన్ లేకుండా ఉండలేని స్థితికి చేరుతుంది. అదే ‘డిజిటల్ డిపెండెన్సీ సిండ్రోమ్’.
మార్కులపై తీవ్ర ప్రభావం...
రోజుకు నాలుగు గంటలకు పైగా ఫోన్ వాడే విద్యార్థుల జీపీఏ సగటున 0.5 పాయింట్లు తక్కువగా ఉందని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్‌లో 2023లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువుకుంటూ మధ్యలో ఫోన్ చెక్ చేసే విద్యార్థుల మెమరీ రిటెన్షన్ (గుర్తుంచుకునే సామర్థ్యం) 40 శాతం వరకు తగ్గుతుందని మరొక పరిశోధన చెప్తోంది. ఎందుకంటే, ప్రతి ‘చెక్’ మెదడును రీసెట్ చేస్తుంది. ఫోకస్‌ను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి సగటున 23 నిమిషాలు పడుతుంది. అంటే ఫోన్ కేవలం సమయాన్ని తినేయడమే కాదు, మెదడు పనితీరునే మార్చేస్తుంది.
భావోద్వేగ అస్థిరత...
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం,ప్రతి 10 మంది యువతలో ఒకరికి ప్రాబ్లమాటిక్ ఫోన్ యూజ్ లక్షణాలు ఉన్నాయి. ఫోన్ లేకపోతే కలిగే ఆందోళనను ‘నోమోఫోబియా’ అంటారు. ఇది మద్యం వ్యసనానికి సమానంగా ప్రభావితం చేస్తుంది.ఈ వ్యసనం వల్ల కలిగే ప్రధాన లక్షణాలు: చిన్న విషయానికే కోపం, చదువుపై విసుగు, నిద్రలేమి, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం, స్నేహ సంబంధాలు కోల్పోవడం.
భావోద్వేగ గందరగోళం
స్మార్ట్‌ఫోన్ వ్యసనం వల్ల యువత తమ భావోద్వేగాలను నియంత్రించుకోలేని స్థితికి చేరుతున్నారు.ఎవరూ తన స్టోరీ చూడలేదంటే లోమూడ్. ఫ్రెండ్ రిప్లై ఇవ్వలేదంటే యాంగ్జయిటీ. రీల్‌కు తక్కువ లైక్స్ వస్తే సెల్ఫ్–డౌట్. ఇదే ‘డిజిట్ అప్రూవల్ అడిక్షన్’. దీంతో టీనేజర్లు ఆన్‌లైన్‌లో సంతోషంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కాని, ఆఫ్‌లైన్‌లో మనసు లోపల ఖాళీగా ఉంటారు.
మరచిపోయిన నిద్ర...
టీనేజ్ వయస్కుల్లో 60 శాతంమంది రాత్రి 12 తర్వాత కూడా స్క్రీన్ ముందు ఉంటున్నారని లాన్సెట్ మేగజైన్ 2024లో పేర్కొంది. రాత్రి స్క్రీన్ లైట్ మెదడులో మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వలన నిద్ర సైకిల్ దెబ్బ తింటుంది. తరువాత రోజు అలసట, ఆందోళన, శ్రద్ధలేమి పెరుగుతాయి.నిద్ర అంటే మెదడు డేటాను ‘సేవ్’ చేసుకునే సమయం. నిద్ర తగ్గితే, నేర్చుకున్నది కూడా తాత్కాలికంగానే మిగులుతుంది. రాత్రి రీల్ చూసి నవ్విన నిమిషం, రేపటి పరీక్షలో గుర్తు రాని సమాధానంగా మారిపోతుంది.
తల్లిదండ్రుల ప్రతిబింబం
చాలా తల్లిదండ్రులు పిల్లల ఫోన్ అలవాట్లపై ఆందోళన వ్యక్తం చేస్తారు కాని, తమ సొంత అలవాట్లను గమనించరు. పిల్లలు మన మాటల కంటే మన ప్రవర్తనను ఎక్కువగా కాపీ చేస్తారు. అందుకే, తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్‌లో ఉంటే, పిల్లల మెదడు అదే నేర్చుకుంటుంది. దాంతో వారి మధ్య ‘ఫోన్’ అడ్డుగోడగా నిలుస్తోంది. డిన్నర్ టేబుల్ సైలెన్స్ గా మారిపోయింది. పలకరింపులు మెసేజ్‌లకు పరిమితమవుతున్నాయి.
ఫోను కాదుఅలవాటును మార్చండి
ఇవన్నీ చూసిన పేరెంట్స్ పిల్లల నుంచి స్మార్ట్‌ఫోన్ లాగేసుకుంటారు. కాని, ఫోన్‌ను నిషేధించడం పరిష్కారం కాదు. ఫోన్‌ను నియంత్రించడం నేర్పడం ముఖ్యం.
1 వారంలో కనీసం ఒకరోజు ‘నో ఫోన్ ఈవెనింగ్.’ డిన్నర్ తర్వాత ఒక గంట, ఫోన్ దూరంగా ఉంచి కుటుంబ సంభాషణ చేయండి.
2 రాత్రి 9 తర్వాత ఫోన్ దూరంగా ఉంచే నియమం పెట్టండి. నిద్రకు ముందు పుస్తకం, సంగీతం లేదా నిశ్శబ్దం.
3 ఫోన్ వాడేటప్పుడు ‘ఇది నాకు అవసరమా లేదా అలవాటా?’ అని అడగాలి. ప్రతి స్క్రోల్‌కు ముందు ఒక క్షణం విరామం తీసుకోండి.
4 25 నిమిషాలు చదువు తర్వాత ఐదునిమిషాల బ్రేక్ తీసుకోండి. ఇది మెదడు ఫోకస్‌ను క్రమబద్ధం చేస్తుంది.
5 పిల్లలతో భావోద్వేగాల గురించి మాట్లాడండి. వారు ఫోన్‌తో ఎందుకు గడుపుతున్నారో అర్థం చేసుకునేలా చెప్పండి.
-సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్
www.psyvisesh.com


