
భారతదేశం ఆధ్యాత్మికతకు, అద్భుతాలకు నెలవు. ఈ పుణ్యభూమిపై ఉండే ప్రతి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలు సైన్సుకే అంతు పట్టని మిస్టరీలా వాటి నిర్మాణ శైలి ఉండగా. మరికొన్ని ఆలయాలు వైద్యులకే అందని వ్యాధులను, సమస్యలను నయం చేసి విస్తుపోయాలా చేస్తున్నాయి. అలాంటి ఆలయాల కోవకు చెందిందే..తమిళనాడులో కొలువై ఉన్న ఈ ఆలయం. ప్రస్తుతం చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అలాంటి దీర్ఘకాలిక వ్యాధి కేవలం ఈ ఆలయ దర్శనంతోనే మాయమై పోతుందట. అందుకోసం నిత్యం వేలాది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. శాస్త్రవేత్తలు సైతం ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారట. ఇంతకీ అది ఏ దేవుడు ఆలయం?. ఎక్కడ కొలువై ఉంది?..ఇదంతా నిజమేనా..? వంటి విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం..!.
తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని నీడమంగళం సమీపంలోని కోవిల్ వెన్ని అనే గ్రామంలో ఉంది. తమిళనాడులోని తంజావూరు నగరం నుంచి 26 కి.మీ. మీ. అమ్మపేట అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది. చారిత్రకంగా ఈ ఆలయాన్ని తిరువెన్ని అనిపిలుస్తారు.
ఈ ఆలయంలో లింగ రూపంలో ఉండే శివుడు వెన్ని కరుంబేశ్వరర్‌గా, పార్వతి దేవి సౌందర నాయగిగా పూజలందుకుంటున్నారు. ఇది స్వయంభూ దేవాలయం. ఈ శివుడు చూడటానికి చెరకు కట్టలతో కప్పబడి ఉన్నట్లు కనిపిస్తాడు. ఒకప్పుడూ ఈ ప్రదేశం చెరకు (కరుంబు), వెన్ని(నందివర్ధనం చెట్టు) చెట్లతో కప్పబడి ఉండేదని చెబుతారు. అందుకే ఈ స్వామిని వెన్ని కరుంభేశ్వరర్ అని పిలుస్తారు.
మధుమేహం ఎలా నయం అవుతుందంటే..
ఇక్కడ శివుడు మధుమేహాన్ని తగ్గిస్తాడని లేదా నయం చేస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకోసం భక్తులు ఈ స్వామికి గోధుమ రవ్వ, చక్కెరతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని చీమలు తినేలా కొద్దిగా పెడతారు. అక్కడ చీమలు గనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే తమ వ్యాధి తగ్గుముఖం పడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
భారతదేశంలో మధుమేహాన్ని నయం చేసే ఏకైక ఆలయం తమిళనాడులోని అమ్మపెట్టి లేదా అమ్మపేట గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొలువై ఉన్న శివలింగం దాదాపు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైన లింగం. దీనిని శ్రీకృష్ణుడే స్వయంగా ప్రతిష్టించాడని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలో అంతటి మహిమాన్వితమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు.
నిజమేనా అంటే..?
ఈ ఆలయానికి కేవలం భారతదేశం నుంచే గాక, విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడకి వచ్చి ఈ స్వామిని దర్శించుకుని మధుమేహం వ్యాధిని నయం చేసుకున్నారని కథలు కథలుగా చెబుతుంటారు. అది నిజమేనా కాదా అని పరీక్షించి మరీ తెలుసుకున్న శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే ఈ వ్యాధితో బాధపడుతున్న కొందరు భక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించగా అది నిజమని నిరూపితమవ్వడంతో ఇదేలా జరుగుతుందని విస్తుపోతున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆలయాన్ని దర్శించి..మధుమేహం వ్యాధి నుంచి బయటపడండి.
గమనిక: ఇది భక్తుల నమ్మకానికి సంబంధించిన విషయం. దానినే మేము ఇక్కడ వార్తగా ఇచ్చాము. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం
(చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)