ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర | IRCTC Tourism Tour Package 9 Days Divya Dakshin Yatra with Jyotirlinga | Sakshi
Sakshi News home page

ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర

May 5 2025 9:14 AM | Updated on May 5 2025 9:34 AM

IRCTC Tourism Tour Package 9 Days Divya Dakshin Yatra with Jyotirlinga

ఇది తొమ్మిది రోజుల యాత్ర... దక్షిణాదిలో దివ్యమైన యాత్ర. మూడు కడలి తీరాలను చూద్దాం... తొమ్మిది ప్రదేశాలను వీక్షిద్దాం. అరుణాచలం... శ్రీరంగం... మధురై... కన్యాకుమారి... రామేశ్వరం..
కోవళమ్‌... త్రివేండ్రమ్‌... తంజావూరులతో తీర్థయాత్ర పరిపూర్ణం.

దివ్య దక్షిణ యాత్ర విత్‌ జ్యోతిర్లింగ (ఎస్‌సీజెడ్‌బీజీ42). ఇది 9 రోజులు ప్యాకేజ్‌. సికింద్రాబాద్‌లో మొదలై సికింద్రాబాద్‌కి చేరడంతో పూర్తయ్యే ఈ ప్యాకేజ్‌లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రమ్, తంజావూరు కవర్‌ అవుతాయి. భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ట్రైన్‌లో మే నెల 22వ తేదీన టూర్‌ మొదలవుతుంది.

తొలిరోజు తిరు యాత్ర షురూ!
మధ్యాహ్నం పన్నెండు గంటలకు సికింద్రాబాద్‌లో మొదలైన ప్రయాణం రెండవ రోజు ఉదయం ఏడున్నరకు తిరువణ్ణామలైకి చేరుతుంది. ఈ మధ్యలో భోన్‌గిర్, జన్‌గాన్, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణం సాగుతుంది. 

ఈ ప్యాకేజ్‌లో బుక్‌ చేసుకున్న వాళ్లు సికింద్రాబాద్‌లోనే రైలెక్కాల్సిన తప్పనిసరి ఏమీ ఉండదు. ఈ రైలు ఆగే ఈ జాబితాలో ఎవరికి వారు తమకు సౌకర్యంగా ఉన్న స్టేషన్‌లో జాయిన్‌ కావచ్చు. అలాగే పర్యటన పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ తమకు అనువైన చోట దిగవచ్చు. అయితే మధ్యలో ఎక్కినా, దిగినా టికెట్‌ ధరలో కన్సెషన్‌ ఉండదు. సికింద్రాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కి బుక్‌ చేసుకోవాల్సిందే.

రెండోరోజు తొమ్మిది గోపురాల తిరువణ్ణామలై
తిరువణ్ణామలై స్టేషన్‌లో దిగిన తర్వాత హోటల్‌ రూమ్‌లో చెక్‌ ఇన్‌ కావడం. రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత అరుణాచలం ఆలయ దర్శనం. ఇతర దర్శనాలు పూర్తయిన భోజనం చేసుకుని స్టేషన్‌కి వచ్చి రైలెక్కాలి. రైలు రాత్రి పదింటికి బయలుదేరుతుంది. తిరువణ్ణామలై ఆలయంలోని దేవుడు అరుణాచలేశ్వరుడు కావడంతో దీనిని అరుణాచలం అని కూడా పిలుస్తారు. 

ఈ ఆలయాన్ని పాతిక ఎకరాల్లో నిర్మించారు. బయటి ప్రహరీ గోడకు నాలుగు ప్రాకారాలు, లోపల మరో ప్రహరీ కి నాలుగు ప్రాకారాలతోపాటు గర్భాలయగోపురం మొత్తం తొమ్మిది గోపురాల ఆలయం ఇది. గణపతి మందిరం దగ్గర నేల మీద వలయాకారంలో పెయింట్‌ చేసి ఉంటుంది. ఆ వలయంలో నిలబడి చూస్తే తొమ్మిది గోపురాలనూ చూడవచ్చు. ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేసే అరుణాచలం కొండ చుట్టూ ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాల అష్ట లింగాల ఆలయాలుంటాయి. 

ఇక్కడ రమణమహర్షి ఆశ్రమాన్ని కూడా తప్పకుండా చూడాలి. అరుణాచలం కొండ చుట్టూ 14 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షణ చేయాలనుకునే వారు చేయవచ్చు. కాలి నడకన చేయలేని వారి కోసం ఆటోలు ఉంటాయి. గిరి ప్రదక్షణలో భాగంగా అష్ట లింగాల ఆలయాల దగ్గర ఆపుతారు. వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగించాలి.

మూడో రోజు రాముడు కొలిచిన శివుడు (రామేశ్వరం)
ఉదయం ఆరున్నరకు రైలు కుదాల్‌నగర్‌ చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన రామేశ్వరానికి చేరి అక్కడ హోటల్‌లో చెక్‌ ఇన్‌. రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత స్థానికంగా ఉన్న ఆలయాలు, ఇతర పర్యాటక ప్రదేశాలను చూసుకోవాలి. రాత్రి బస రామేశ్వరంలోనే.

రామేశ్వరం మనదేశ భూభాగానికి దూరంగా బంగాళాఖాతం– హిందూమహాసముద్రం మధ్యలో ఉన్న దీవి. రామాయణం ప్రకారం రాముడు... రావణాసురుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని స్థాపించి పూజించాలనుకున్నాడు. హిమాలయాల నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడిని ఆదేశిస్తాడు. 

హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడం ఆలస్యం కావడంతో విశేషఘడియలు ముగిసేలోపు రాముడు సముద్రపు ఇసుకతో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ శివుడికి రామేశ్వరుడనే పేరు వచ్చింది. పన్నెండు జ్యోతిర్లింగాల్లో రామేశ్వరం ఒకటి. రామేశ్వరం అనే పేరుకు ముందు ఆ దీవి పేరు పంబన్‌. రామేశ్వరానికి – భారత్‌ ప్రధాన భూభాగానికి మధ్య నిర్మించిన వంతెనకు పంబన్‌ బ్రిడ్జి అని పేరు పెట్టారు. పంబన్‌ బ్రిడ్జి మీద రామేశ్వరానికి చేరతాం. ఇక్కడి నుంచి శ్రీలంక కేవలం 18 నాటికల్‌ మైళ్ల దూరంలోనే ఉంది.

నాలుగో రోజు కనువిందైన మధురై
మధ్యాహ్నం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్‌లో వెళ్లాలి. సాయంత్రానికి మధురై చేరడం, మీనాక్షి దర్శనం, షాపింగ్‌ చేసుకుని బస్‌లో కుదాల్‌నగర్‌ స్టేషన్‌కి చేరాలి. రాత్రి పదకొండున్నరకు రైలు కదులుతుంది. కన్యాకుమారి వైపు సాగిపోవాలి.

మధుర మీనాక్షి ఆలయాన్ని చూసిన తర్వాత ఎవరికైనా కలిగే ఫీలింగ్‌ ఒక్కటే. ఈ ఆలయాన్ని చూడక΄ోయి ఉంటే జీవితంలో గొప్ప సంతోషాన్ని మిస్‌ అయ్యేవాళ్లం... అనే గొప్ప అనుభూతి అది. మీనాక్షీ సుందరేశ్వర ఆలయం వైష్ణవం– శైవాల మధ్య మైత్రిబంధానికి ప్రతీక. వధువు మీనాక్షి అమ్మవారి చేతిని శివుడి చేతిలో పెడుతున్నది స్వయానా విష్ణుమూర్తి. 

మధురై ఆలయంలోకి కెమెరాలు, సెల్‌ఫోన్‌లను అనుమతించరు. కంటి నిండా చూసి మదినిండా గుర్తుంచుకోవాల్సిందే. మీనాక్షి– సుందరేశ్వరుల వివాహాన్ని విష్ణుమూర్తి తన చేతుల మీదుగా జరిపిస్తున్న శిల్పాన్ని చూడడం మరిచిపోవద్దు. వైష్ణవం– శైవ మతాల మధ్య సోదరబంధాన్ని తెలియచేసే శిల్పం అది. సున్నితమైన ఆభరణాలను సునిశితంగా చెక్కిన శిల్పి నైపుణ్యానికి సలామ్‌ అనాల్సిందే.

ఐదో రోజు మూడు సముద్రాల కలయిక
ఉదయం ఎనిమిది గంటలకు రైలు కన్యాకుమారికి చేరుతుంది. రూమ్‌కి వెళ్లి రిఫ్రెష్‌ అయిన తర్వాత బయలుదేరి వివేకానంద రాక్‌ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్‌ పాయింట్‌ చూసుకుని రాత్రికి గదికి చేరాలి. రాత్రి బస కన్యాకుమారిలో. మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమం అంటాం. మూడు సముద్రాలు కలుస్తున్న ప్రదేశాన్ని ఏమనాలి? మూడు కడలుల సంగమం అంటే ముక్కడలి తీరం అందామా! చిరు అలలతో సొగసుగా కదిలే అరబిక్‌

కడలి అందాన్ని మాత్రమే కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడే బంగాళాఖాతం దుడుకుతనాన్ని చూస్తూ, ధీరగంభీరంగా ఉండే హిందూ మహాసముద్రం నీటితో పాదాలను అభిషేకించుకుందాం. కన్యాకుమారి అంటే ప్రకృతి ప్రేమికులకు గుర్తొచ్చేది మూడు సముద్రాల మీద సూర్యోదయం, సూర్యాస్తమయం. వీటితోపాటు తమిళ కవి వళ్లువార్‌ విగ్రహం, వివేకానంద రాక్‌ మెమోరియల్‌ని కూడా చూడాలి. అలాగే 2004, డిసెంబర్‌ 26వ తేదీ చేదు జ్ఞాపకానికి స్మారక స్థూపం సునామీ మెమోరియల్‌ని చూడడం మర్చిపోకూడదు.

ఆరో రోజు సంపన్న దేవుడు పద్మనాభుడు
ఉదయం హోటల్‌ గది చెక్‌ అవుట్‌ చేసి కన్యాకుమారి రైల్వేస్టేషన్‌కు వెళ్లి రైలెక్కాలి. రైలు తొమ్మిది గంటలకు కొచ్చువెలి వైపు వెళ్తుంది. పన్నెండన్నరకు చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన త్రివేండ్రమ్‌కు వెళ్లాలి. పద్మనాభ స్వామి దర్శనం, కోవళం బీచ్‌ విహారం తర్వాత తిరిగి రైల్వే స్టేషన్‌కు చేరి అదే రైలెక్కాలి. రాత్రి తొమ్మిదిన్నరకు రైలు తిరుచ్చికి బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.

తిరువనంతపురం దేవుడు అనంత పద్మనాభుడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన దేవుడు. ట్రావెన్‌కోర్‌ రాజవంశం నిర్వహణలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయం బంగారుమయం. 108 దివ్యదేశాల్లో ఇదొకటి. ఇది కేరళ– తమిళ వాస్తుశైలి సమ్మేళనం. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే డ్రెస్‌కోడ్‌ను అనుసరించాలి. భారత సంప్రదాయ వస్త్రధారణలో ఉండాలి. 

ఏడో రోజు యునెస్కో రంగనాథుడు... బృహదీశ్వరుడు
తెల్లవారుజామున ఐదింటికి తిరుచ్చిలో రైలు దిగి హోటల్‌ గదిలో చెక్‌ ఇన్‌. రిఫ్రెష్‌మెంట్‌ తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనం. మధ్యాహ్న భోజనం తర్వాత తంజావూరు (60 కిమీలు). బృహదీశ్వరాలయ దర్శనంతో పర్యటన పూర్తవుతుంది. ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటలకు తిరుగుప్రయాణం మొదలవుతుంది.

శ్రీరంగం అంటే చాలా మంది కావేరీ తీరాన ఉన్న పట్టణం అనే అభి్ర΄ాయంలో ఉంటారు. కానీ ఇది కావేరీ నదికి దాని ఉప నది కొల్లిదమ్‌ నదికి మధ్యనున్న ద్వీపం. తిరుచిరా పల్లికి సమీపంలోని ఈ దీవిలో ఉన్న రంగనాథ ఆలయం పేరుతో ఈ దీవికి శ్రీరంగం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ వైష్ణవాలయం కూడా 108 దివ్యదేశాల్లో ఒకటి. ఇది యునెస్కో గుర్తించిన హెరిటేజ్‌ సైట్‌ కూడా. ఈ ఆలయంలో 21 ఎత్తైన గోపురాలున్నాయి. ప్రపంచంలో ఆంగ్‌కోర్‌వాట్‌ తర్వాత అత్యంత పెద్ద హిందూ ఆలయాల్లో ఇదొకటి.

ఎనిమిదో రోజు దక్షిణాది కృష్ణుడు
తంజావూరులో ఉన్న ఆలయాలన్నింటిలోకి పెద్ద ఆలయం బృహదీశ్వరాలయం. వెయ్యేళ్ల నాటి ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తి మొదటి రాజరాజ కట్టించాడు. రాజ్యంలో రాజకీయ సంక్షోభం, సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కళలకు ప్రీధాన్యం తగ్గి΄ోతుందనడానికి నిదర్శనం కూడా ఈ ఆలయాన్ని చెప్పవచ్చు. శిఖరం ఎత్తు 216 అడుగులు. శివలింగం 29అడుగులు. నంది కూడా పెద్దదే. ఈ నిర్మాణంలోని ప్రతి అంగుళమూ చోళుల కళాభిరుచికి అద్దం పడుతుంది. 

ఆలయనిర్మాణం పూర్తయ్యే సమయానికి యుద్ధం వచ్చింది. కొత్తగా నిధుల కేటాయింపు తగ్గి΄ోయింది. ఉన్న డబ్బుతో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. దాంతో ప్రవేశ గోపురం ఎత్తును ముందు అనుకున్నట్లు ఆలయగోపురానికి దీటుగా నిర్మించలేక΄ోయారు. ఈ గోపురం కింది భాగం విశాలంగా ఉంటుంది, గోపురం ఎత్తు తక్కువగా ఉంటుంది. ఖర్చు, సమయం దృష్ట్యా ఎత్తు తగ్గించి రాజీ పడ్డారు. 

కానీ చేసిన పనిలో శిల్పనైపుణ్యంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆలయంలోపల ఉన్న చిత్రకళ నాయకరాజుల అభిరుచికి నిదర్శనం. ఆలయం పై కప్పుకు రాగి ఆకులో కృష్ణుడి చిత్రం ఉంది. దానిని బాగా పరిశీలించి చూడండి. ఆ కృష్ణుడి ముఖంలో దక్షిణాది పోలికలు ముఖ్యంగా తమిళుల ముఖకవళికలు కనిపిస్తాయి. ఎత్తులో పై కప్పుకు ఉన్న చిత్రాన్ని పరిశీలించడానికి వీలుకాక΄ోతే ఫొటో తీసుకుని జూమ్‌ చేసి చూడవచ్చు. ‘గ్రేట్‌ లివింగ్‌ చోళా టెంపుల్స్‌’గా గుర్తింపు పొందిన ఆలయం ఇది. యునెస్కో ఈ ఆలయాన్ని వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ల జాబితాలో చేర్చింది.

తొమ్మిదో రోజు..ఇక ఇంటిదారి
ఉదయం తొమ్మిది గంటలకు రేణిగుంటకు చేరుతుంది. వెళ్లిన క్రమంలోని స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తూ తొమ్మిదవ రోజు మధ్యాహ్నం రెండున్నరకు సికింద్రాబాద్‌కు చేరుతుంది. ఎవరికి అనువైన స్టేషన్‌లో వాళ్లు దిగిపోవడమే. 

(చదవండి: అనారోగ్య మృతుల్లో... పురుషులే ఎక్కువ! అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement