
పురుషులతో పోలిస్తే మహిళల ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోంది. అనారోగ్యంతో మరణిస్తున్న వారిలో పురుషులే అధికంగా ఉంటున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అధిక రక్తపోటు, మధుమేహం, ఎయిడ్స్ వంటివాటితో అస్వస్థతకు గురై మరణిస్తున్న వారిలో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం తెలిపింది.
ఆధిపత్య ధోరణి, ఆరోగ్య సంరక్షణకు అంతగా సుముఖత చూపించకపోవడం, వైద్యానికి ఎక్కువగా ఖర్చు చేయకపోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా వెల్లడైంది. పురుషుల్లో అధిక ధూమపానం, మహిళల్లో ఊబకాయం, అరక్షిత శృంగారం ప్రధాన అనారోగ్య హేతువులని తెలిపింది. హెచ్‌ఐవీతో పాటు కరోనా సమయాల్లోనూ కూడా నివారణ చర్యలు మొదలుకుని రోగ నిర్ధారణ, చికిత్స వంటి అన్ని విషయాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులు బాగా వెనుకబడి ఉన్నారని అధ్యయనం వెల్లడించింది.
200 దేశాల్లో అధిక రక్తపోటుకు తీసుకునే చికిత్సలో కూడా పురుషులు, మహిళల్లో చాలా వ్యత్యాసముంది. 56 శాతం దేశాల్లో ఎయిడ్స్, 30 శాతం దేశాల్లో మధుమేహం, 4 శాతం దేశాల్లో హై బీపీ రేటు పురుషుల్లోనే ఎక్కువగా ఉంది. 14 శాతం దేశాల్లో ఎయిడ్స్, ఐదు శాతం దేశాల్లో మధుమేహం, భారత్‌లో హై బీపీ పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉన్నాయి.
131 దేశాల్లో ఎయిడ్స్, 107 దేశాల్లో హై బీపీ, 100 దేశాల్లో మధుమేహ మృతుల్లో మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ. ఎయిడ్స్‌తో 25 దేశాల్లో, డయాబెటిస్‌తో 9 దేశాల్లో, హై బీపీతో యూఏఈలో పురుషులతో పోలిస్తే మహిళలు ఎక్కువగా మరణిస్తున్నారని అధ్యయనం తేల్చింది.
వ్యాధి నివారణ, నిర్ధారణ, చికిత్స దిశగా పురుషులను ప్రోత్సహించడం, అందరికీ సమానంగా ఆరోగ్యం అందించే వ్యవస్థలను రూపొందించడం చాలా అవసరమని బ్రిటన్‌కు చెందిన గ్లోబల్ 50/50 సహవ్యవస్థాపకుడు కెంట్ బస్ తెలిపారు.
(చదవండి: First Women Rescuer: ఆపదలో ఆమె సైతం..!)