
సువార్త
అల్ప పదాలలో అనంతార్ధాన్ని చూపే ప్రసంగ కళా శాస్త్ర పండితుడిగా, ధర్మశాస్త్ర నిపుణుడిగా పేరొందిన అపోస్తలు డైనపాలు క్రీస్తు మరణాన్ని చూసే విధానం అద్భుతమనే చెప్పాలి.‘నా సువార్త ప్రకారంగా’ అంటూ పౌలు మహాశయుడు దేవుని సంకల్ప ప్రకారమైన క్రీస్తు సత్యసువార్తను కుదించి కేవలం మూడే మూడు పదాలతో సువార్తను నిర్వచించాడు. క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం అంటూ సువార్తను వివరించాడు. ఇదే క్రీస్తు సువార్తను మరల మరింతగా క్లుప్తంగా చేసేస్తూ విషయ సారం ఇదే అనేంత తేటగా అసలును తేల్చేస్తూ అది హుందాగా మన ముందు పెడతాడు. క్రీస్తు మరణమే సువార్త’అంటూ ఒకే ఒక్క మాటతో ఇలా సులభం చేసేశాడు. అయితే క్రీస్తు సువార్త ఎప్పుడూ దేవుని సంకల్పంతో ముడిపడి ఉంటుంది. సువార్తను దేవుని సంకల్పంతో ఎన్నడూ వేరుచేసి చూడలేము.
పౌలు క్రీస్తు మరణాన్నే సువార్తగా అదే తన జీవిత పరమావధిగా, గమ్యంగా చేసుకొని జీవితాంతం ఈ ఒక్క అతిశయంతోనే సువార్తను అంతటా ప్రకటించాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అంటాడు ఒకసారి. క్రీస్తు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచారం చేయండి అంటూ సంఘానికి పిలుపునిస్తూ అజ్ఞాపిస్తాడు ఇంకొకసారి. ఔను, నిజానికి క్రీస్తు మరణమే సువార్త.
అయితే సమాధి, పునరుత్థానాలు అను రెండు అంశాలు కూడా సువార్తను బలపరచేవే. ఎలాగంటే, మరణించిన క్రీస్తును సమాధి చేశారు. అలాకాకుండా ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏ వైద్యశాలకో ఆయన్ను తరలించేవారు. అలా జరుగలేదు. రోమా ప్రభుత్వం ఆయన మరణించాడు అన్నది నిర్ధారణ చేసుకొనే ఆయన పార్థివ దేహాన్ని సంబంధిత వ్యక్తులు, శిష్యులకు అప్పగించింది. ఇక పునరుజ్జీవం విషయానికి వస్తే, క్రీస్తు మరణం నుండి తిరిగి లేవక΄ోతే క్రైస్త్తవులకు మనుగడే అనగా నిరీక్షణే లేదని పౌలే బలంగా నొక్కి వక్కాణిస్తుంటాడు. అయినా సరే, పౌలు దృష్టి కోణంలో క్రీస్తు మరణమే సువార్త. సువార్త అంటే క్రీస్తు మరణం... క్రీస్తు మరణమే సువార్త అన్నంతగా ΄పౌలు జీవితంతో క్రీస్తు సువార్త ముడిపడి పెనవేసుకొంది.
మరో విధంగా చూస్తే, ఒక వ్యక్తి సమాధి చేయబడ్డాడు అంటే మరణించాడు అనేకదా అర్థం. మరణించిన వారే సమాధి చేయబడతారు. అదేవిధంగా మరణించాడు అనంటే ఒక వ్యక్తి ఎక్కడో ఒకచోట పుట్టాడు అనే కదా దీనర్థం. కాబట్టి ఈ కోణంలోనూ మరణమే సువార్త అయ్యింది.
మరణంతోనే వెలుగు
చేతల పరమైన సత్క్రియలు, వీరోచిత కార్యాలు, ధైర్య సాహసాలు మాట్లాడినంత గట్టిగా ఏవీ మాట్లాడలేవు. ఒక సైనికుడు తన వీర మరణంతోనే వెలుగులోకి వస్తాడు. కొత్తగా ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. ఇక అప్పటి నుండే అతని పుట్టుక, పేరు, ఊరు, తల్లిదండ్రులు, అతడు చదివిన ΄ాఠశాల, సంబంధిత ఇతర విద్యా సంస్థలు, అతనికి చదువు చెప్పిన గురువులు, అతని సన్నిహిత స్నేహితులు, బంధు మిత్రులు అంతా మీడియా కెక్కుతారు. దేశానికి అతని త్యాగపూరిత మరణం చేసిన గొప్ప మేలునే ఎప్పుడూ మరువక దేశ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలాంటిదే, ఇంతకు మించినదే క్రీస్తు మరణం.
– జేతమ్