
దధీచి మహర్షి సరస్వతీ నదీతీరంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకనాడు ఇంద్రుడు అతడి వద్దకు వచ్చాడు. ‘మునీశ్వరా! నీకు నేను మహోత్తమమైన శాస్త్రాలను ఉపదేశిస్తాను. వాటిని నువ్వు ఇతరులకు చెప్పరాదు. ఒకవేళ ఇతరులకు చెబితే, నీ తల ఖండిస్తాను’ అని చెప్పాడు. దధీచి సరేననడంతో, ఇంద్రుడు అతడికి మహోత్తమ రహస్య శాస్త్రాలను ఉపదేశించాడు. ఈ సంగతి అశ్వనీ దేవతలకు తెలిసింది. ఇంద్రుడు బోధించిన రహస్య శాస్త్రాలను దధీచి నుంచి పొందాలనుకున్నారు.
వెంటనే వారు దధీచి వద్దకు వెళ్లారు. ‘మహర్షీ! ఇంద్రుడు నీకు బోధించిన రహస్య శాస్త్రాలను మాకు ఉపదేశించు. అందుకు ప్రతిగా నీకు తగిన మేలు చేస్తాము’ అని అభ్యర్థించారు.‘ఇతరులకు బోధిస్తే, నా తల ఖండిస్తానన్నాడు ఇంద్రుడు. మీకు ఆ శాస్త్రాలు బోధిస్తే, నా ప్రాణమే మిగిలి ఉండదు. ఇక మీరు నాకు చేసే మేలు ఏముంటుంది?’ అన్నాడు దధీచి.‘మహర్షీ! భయపడకు. నీకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూసుకునే బాధ్యత మాది’ అని అశ్వనీ దేవతలు అభయం ఇచ్చారు.వారు దధీచి తలను తీసి, రహస్య ప్రదేశంలో భద్రపరచారు.
అతడి మొండేనికి గుర్రం తలను అతికించారు. ఇంద్రుడి ద్వారా పొందిన రహస్య శాస్త్రాలను అతడి ద్వారా తెలుసుకున్నారు. ఇదంతా ఇంద్రుడికి తెలిసింది. కోపోద్రిక్తుడైన ఇంద్రుడు వచ్చి, దధీచికి ఉన్న గుర్రం తలను నరికేసి వెళ్లిపోయాడు. అశ్వనీ దేవతలు తాము భద్రపరచిన దధీచి తలను తీసుకువచ్చి, అతడికి అతికించి, ప్రాణం పోశారు. అశ్వనీ దేవతల ద్వారా పునర్జీవం పొందిన దధీచి తన బాల్యమిత్రుడైన క్షువ మహారాజు వద్దకు వెళ్లాడు. క్షువుడు దధీచిని ఆప్యాయంగా పలకరించి, ఆదరించాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకోసాగారు. ఈలోగా వారి మధ్య దీర్ఘ తపస్సులో ఎవరు శక్తిమంతులు అనే విషయమై విభేదం ఏర్పడింది. ‘దీర్ఘ తపస్సులో ఇతరుల కంటే బ్రాహ్మణుడే శక్తిమంతుడు’ అన్నాడు శివభక్తుడైన దధీచి.
‘కానే కాదు. వర్ణాశ్రమ ధర్మాలను రక్షించే రాజే శక్తిమంతుడు’ అన్నాడు క్షువుడు. అంతటితో ఆగకుండా, ‘రాజు సర్వదేవతా స్వరూపుడు’ అని శ్రుతులు చెబుతున్నాయి. కనుక నేను దేవతా స్వరూపుడను. అందువల్ల నువ్వు నన్ను పూజించాలి’ అన్నాడు.క్షువుడి మాటలతో దధీచికి సహనం నశించింది. ఎడమచేతి పిడికిలి బిగించి, క్షువుడి నెత్తి మీద బలంగా మోదాడు. దధీచి చర్యకు క్షువుడు మండిపడ్డాడు. వెంటనే కత్తి దూసి, దధీచిని చీల్చేశాడు. ‘ఇప్పుడు తెలిసిందా ఎవరు శక్తిమంతుడో?’ అని గర్జించాడు. నెత్తరోడుతూ నేలకూలిన దధీచి భృగువంశ తిలకుడు, అసుర గురుడైన శుక్రాచార్యుడిని స్మరించాడు.
వెంటనే శుక్రాచార్యుడు అక్కడ ప్రత్యక్షమై, తన మృత సంజీవని విద్యతో చీలిన దధీచి శరీరాన్ని సంధించి, అతడిని బతికించాడు. దధీచి లేచి కూర్చున్నాక శుక్రాచార్యుడు అతడికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని జపిస్తూ శివుని గురించి తపస్సు చేయమని ఆదేశించాడు. దధీచి అక్కడి నుంచి బయలుదేరి, తన ఆశ్రమానికి చేరుకున్నాడు. శుక్రాచార్యుడి ఆదేశం మేరకు శివుడి గురించి తపస్సు ప్రారంభించాడు. దధీచి తపస్సుకు మెచ్చిన పరమశివుడు అతడికి ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏం కావాలి?’ అని అడిగాడు. ‘సాంబ సదాశివా! నాకు వజ్రతుల్య దేహాన్ని. దైన్యరహిత జీవనాన్ని, స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించు’ అని కోరాడు దధీచి. ‘తథాస్తు’ అని పరమశివుడు అంతర్ధానమయ్యాడు.
క్షువుడిపై కోపం చల్లారని దధీచి అతడి వద్దకు వెళ్లి, ఎడమకాలితో అతడి తలను తన్నాడు. కుపితుడైన క్షువుడు దధీచిపైకి కత్తి దూశాడు. కత్తి వేటు పడినా, దధీచికి ఏమీ కాలేదు. రకరకాల అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. దధీచి వాటన్నింటినీ తిప్పికొట్టి, ‘ఇప్పటికైనా తెలిసిందా ఎవరు అధికుడో?’ అన్నాడు.దధీచి చేతిలో ఈ పరాభవానికి క్షువుడు కలత చెంది, మహారణ్యానికి వెళ్లి విష్ణువు గురించి తపస్సు చేశాడు. విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. క్షువుడు తనకు దధీచి చేతిలో ఎదురైన పరాభవాన్ని చెప్పుకుని, అతడికి గుణపాఠం చెప్పాలని కోరాడు. క్షువుడిని వెంటబెట్టుకుని విష్ణువు దధీచి ఆశ్రమం వద్దకు వెళ్లాడు. విష్ణువు బ్రాహ్మణ వేషం ధరించి, దధీచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. దధీచి అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘మహర్షీ! నువ్వు క్షువ మహారాజు ఎదుట నిలబడి, ‘నేను భయపడుతున్నాను’ అనే మాట చెప్పు చాలు’ అన్నాడు.
వచ్చిన వాడు విష్ణువని దధీచి గ్రహించాడు. ‘శివ వరప్రసాదినైన నేను ముల్లోకాలలో దేనికీ భయపడను. అలాంటిది క్షువుడి ఎదుట నిలిచి, నేను భయపడుతున్నట్లు చెప్పాలా? కుదరదు’ అని ఖండితంగా చెప్పాడు. దధీచిని శిక్షించడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం అతడిని సమీపించలేక వెనుదిరిగింది. విష్ణువు అనేక అస్త్ర శస్త్రాలను ప్రయోగించాడు. అతడికి అండగా ఇంద్రాది దేవతలు ఆయుధాలతో వచ్చి, దధీచితో తలపడ్డారు. దధీచి గుప్పెడు దర్భలను మంత్రించి, వాటిని దేవతా బలగాలపైకి ప్రయోగించాడు.
ఒక్కొక్క దర్భపోచ ఒక్కొక్క త్రిశూలంలా మారి నిప్పులు కక్కుతూ వెళ్లి దేవతలను దహించడం ప్రారంభించాయి. దేవతలు పలాయనం చిత్తగించారు. దధీచిని భయభ్రాంతుడిని చేయడానికి విష్ణువు విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. పరమశివుని అనుగ్రహంతో దధీచి కూడా విశ్వరూపం ధరించి, విష్ణువు ఎదుట నిలిచాడు. ఈలోగా బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి, ఉభయులనూ శాంతింపజేశాడు. ‘సాక్షాత్తు పరమశివుని వరప్రసాది అయిన ఈ బ్రహ్మర్షిని భయపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు.
ఇదంతా ప్రత్యక్షంగా చూసినా క్షువ మహారాజు దీనంగా వెళ్లి, దధీచి మహర్షి పాదాల ముందు మోకరిల్లాడు. ‘మూర్ఖత్వం కొద్ది నీపై దుశ్చర్యలకు తెగబడ్డాను. దయచేసి, నన్ను క్షమించు’ అని అభ్యర్థించాడు. దధీచి ప్రసన్నుడయ్యాడు. బాల్యమిత్రుడైన క్షువుడిని లేవనెత్తి, అక్కున చేర్చుకున్నాడు.
∙సాంఖ్యాయన