
సాధారణంగా టమాటోలు మీదకు విసిరితే అదో అవమానం అన్నట్లుగా అనిపిస్తుంది. కాని, స్పెయిన్‌లో టమాటాలతో కొట్టుకోవడమే అహ్లాదకరమైన ఆట! వారికి అదో పండుగ! ‘లా టమాటినా’ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవం స్పెయిన్‌లోని బునోల్ పట్టణంలో ప్రతి ఏటా ఆగస్టు చివరి బుధవారం నిర్వహిస్తారు. ఆ ప్రకారం, ఈ ఏడాది అది ఆగస్టు 27న రానుంది. ఈ ఉత్సవంలో పాల్గొనేవారు టన్నుల కొద్దీ టమాటోలను ఒకరిపై ఒకరు విసురుకుంటూ ఆనందిస్తారు. అక్కడ ప్రతి సంవత్సరం సుమారుగా 120 నుంచి 150 టన్నుల వరకూ టమాటోలను ఉపయోగిస్తున్నారు.
ఈ టమాటో ఉత్సవం 1945లో అనుకోకుండా ప్రారంభమైందని అక్కడివారు చెబుతారు. ఆ ఏడాది జరిగిన ఒక పండుగ ఊరేగింపులో, కొందరు యువకులు ఒకరిపై ఒకరు టమాటోలు విసురుకున్నారట. ఈ ఘటన తరువాత ప్రతి సంవత్సరం టమాటోలతో సరదాగా ఈ పోరాటం చేసేవారట. క్రమంగా దీనిని అధికారిక ఉత్సవంగా ప్రకటించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ వేడుకను ప్రత్యేక ఆకర్షణగా మార్చింది స్పెయిన్ ప్రభుత్వం!
ఈ వేడుక ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు గంటపాటు జరిగే ఈ టమాటో పోరాటంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు. తర్వాత, పట్టణ వీధులను శుభ్రం చేస్తారు. ఈ పండుగలో సుమారు 20 వేల మందికి అనుమతి లభిస్తుంది. అందుకు ముందుగానే టికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ వేడుక.ఈ ఫెస్టివల్ స్ఫూర్తితో ప్రస్తుతం ప్రపంచవాప్తంగా పలు చోట్ల నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మార్చి 11న మన హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో పార్క్‌లో ఈ వేడుకను ‘టోమా టెర్రా’ అనే పేరుతో ఘనంగా నిర్వహించారు.
అయితే అమ్మకానికి పనికిరాని, మిగిలిపోయిన టమాటోలను నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసి ఈ వేడుక చేశారు. దీనితో రైతులకు ఆర్థికంగా లబ్ధి చేకూరడంతో పాటు ఈ ఫెస్టివల్‌లో ఉపయోగించిన టమాటో వ్యర్థాలను వృథా కాకుండా సేంద్రియ ఎరువుగా మార్చి, ఆ పార్క్ మొక్కలకే వాడారట. దీనితో ఈ గ్లోబల్ ట్రెండీ ఫెస్టివల్ ‘జీరో–వేస్ట్’ ఈవెంట్‌గా మారింది.
ద్వీపాల్లోనే రాజా!
పశ్చిమ న్యూ గినీకి తూర్పునున్న ఇండోనేషియాలోని పశ్చిమ పాపువా ప్రావిన్స్‌లో ఉన్న ఒక ద్వీపసమూహమే ఈ రాజా ఆంపత్. దీన్ని ‘ఫోర్ కింగ్స్’ అని కూడా పిలుస్తారు. ఈ పేరు అక్కడి నాలుగు ప్రధాన దీవులైన వాయ్‌గెయో, బాటంట, సాలావటి, మీసూల్ నుంచి వచ్చింది. ఈ రాజా ఆంపత్ ప్రపంచంలో అత్యంత గొప్ప సముద్ర జీవవైవిధ్యానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడ 1,500లకు పైగా చేపల జాతులు, 500లకు పైగా రకరకాల పగడపు కీటకాలతో పాటు అనేక ప్రత్యేకమైన జీవులున్నాయి.
రాజా ఆంపత్‌లో సుమారు 1,500 చిన్న దీవులు, ద్వీపకల్పాలున్నాయి. సున్నపురాయితో ఏర్పడిన ఈ దీవులు నీలి రంగు సముద్రంలో రమ్యమైన దృశ్యాలను కళ్లకు కడతాయి. పచ్చని అడవులు, ఎత్తైన కొండలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. పియానేమో అనే వ్యూ పాయింట్ నుంచి చూస్తే నీలి సముద్రంలో అక్కడక్కడా చిన్న దీవులు తేలుతున్నట్లు కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే తిరిగి రావాలనే అనిపించదట!