
డబ్బుతో దేశాన్ని కొనలేం. కాని, డబ్బు పెట్టి మనకు ఇష్టమైన దేశంలో శాశ్వతంగా ఉండిపోగలం. చేతిలో ‘గోల్డెన్ వీసా’ ఉంటే చాలు, కుటుంబంతో సహా వెళ్లి ఏ దేశంలోనైనా స్థిరపడొచ్చు. ఆ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు. గోల్డెన్ వీసా ఇవ్వని దేశాలకు సైతం ఆ దేశాలు ఇచ్చే ‘గోల్డెన్ చాన్స్’తో బంగారు రెక్కలు కట్టుకుని ఎగిరిపోవచ్చు. ప్రస్తుతమైతే అందరి చూపూ, ముఖ్యంగా భారతీయుల మనసు అమెరికా మీద ఉంది. ట్రంప్ ఇస్తానంటున్న గోల్డ్ కార్డ్ మీద ఉంది.
బుకింగ్స్ ఓపన్ కాలేదు!
ట్రంప్ ప్రకటించిన 5 మిలియన్ డాలర్ల (43.5 కోట్ల రూపాయలు) ‘గోల్డ్ కార్డ్’ కోసం ఇప్పటి వరకు 80 వేల మందికి పైగా సంపన్న భారతీయులు క్యూలో నిలబడి ఉన్నారు. ఈ ఏడాది జూన్ నెలలోనే అమెరికాగోల్డ్ కార్డ్ అధికారిక వెబ్ సైట్ మొదలైంది. నిజానికి ఈ సైట్‌లో రిజిస్ట్రేషన్‌కు ఇంతవరకు (ఈ కథనం రాసే నాటికి) చట్టబద్ధమైన ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ ఎనభై వేల మంది ఎవరంటే, రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి రిజిస్టర్ చేసుకున్నవారు.
సైట్ తెరవగానే మొదట – ‘ది ట్రంప్ కార్డ్ ఈజ్ కమింగ్’ అని కనిపిస్తుంది. దాని కింద, ‘నోటిఫికేషన్ రాగానే మీకు తెలియబరుస్తాం. మీ పేరు, మీ దేశం, మీ ఈమెయిల్ పొందుపరచండి’ అని ఉంటుంది. ఇప్పటి వరకు అలా పొందుపరచినవారే ఈ ఎనభై వేల మంది. వీరి సంఖ్య ఇంతకింతా పెరగవచ్చని ఇమిగ్రేషన్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఫస్ట్ లుక్ అదిరిపోయింది
ప్రధానంగా టెక్నాలజీ, ఫైనాన్స్, హెల్త్ కేర్ రంగాలకు చెందిన 28–45 సంవత్సరాల వయస్సు గల భారతీయ నిపుణులు అమెరికన్ గోల్డ్ కార్డ్ వీసాపై ఆసక్తి చూపుతున్నారు. ఈబీ–5 ఇన్వెస్టర్ వీసాలకు ప్రత్యామ్నాయంగా ట్రంప్ ఈ గోల్డ్ కార్టును తెస్తున్నారు. ఈబీ–5లో మోసాలు జరుగుతుండటంతో ఈ కొత్త గోల్డ్ కార్డ్‌ను ప్రవేశపెడుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు కూడా.
గోల్డ్ కార్డ్ వెబ్ సైట్ పని ప్రారంభం అయితే పూర్తి వివరాలు, విధి విధానాలు వెల్లడవుతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ట్రంప్ గోల్డ్ కార్డ్ ‘ఫస్ట్ లుక్’ విడుదల చేసినప్పటికీ, ఇందుకొక చట్టం వచ్చేవరకు యూఎస్ గోల్డ్ కార్డ్ కేవలం ఒక ఆశా దీపం. ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది.
డబ్బున్నవాళ్లకే గోల్డెన్ వీసాలు
అత్యంత ధనికులు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు, వృత్తి నిపుణులు గోల్డెన్ వీసాలకు అర్హులు. అందుకు వారు భారీ మొత్తంలో రుసుము చెల్సించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా ఆ దేశ పౌరసత్వం, లేదా శాశ్వత నివాసానికి అనుమతి లభిస్తుంది.
గోల్డెన్ వీసాలు ఇస్తున్న దేశాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కనీసం పదిహేనుకు పైగా దేశాలు గోల్డెన్ వీసాలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని : సింగపూర్, హాంకాంగ్, కెనడా, స్పెయిన్, స్విట్జర్లండ్, ఇటలీ, న్యూజీలండ్, గ్రీస్, ఆస్ట్రియా, టర్కీ, యూఏఈ, కరీబియన్ తదితర దేశాలు. ఇక అగ్రరాజ్యాలైన రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ వంటివి గోల్డెన్ వీసాలు ఇవ్వటం లేదు!
కలకలం రేపిన యూఏఈ ‘గోల్డ్’
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 2019 నుండి ఇన్వెస్టర్‌లకు, పారిశ్రామిక వేత్తలకు, వృత్తి నిపుణులకు గోల్డెన్ వీసాను జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త రకం గోల్డెన్ వీసాలను యూఏఈ మంజూరు చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ సమాచారం మేరకు – ‘‘యూఏఈ మొదట ప్రయోగాత్మకంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులకు గోల్డెన్ వీసాలు ఇస్తుంది.
వీసా రుసుము లక్ష దిర్హామ్‌లు (దాదాపు రూ.23.30 లక్షలు) ఉంటుంది. క్రిమినల్ రికార్డులు, సోషల్ మీడియా తనిఖీల అనంతరమే అర్హులైన దరఖాస్తు దారులకు కార్డును మంజూరు చేస్తారు’’. అయితే యూఏఈ ‘ఫెడరల్ అధారిటీ’ ఈ గోల్డెన్ వీసా వార్తల్ని వట్టి వదంతులుగా కొట్టిపడేసింది.
థాయ్‌లండ్
ఎలీట్ లాంగ్–టెర్మ్ రెసిడెన్సీ వీసా (5 ఏళ్లకు రూ.5 లక్షలు, తాత్కాలిక నివాసం)
పోర్చుగల్ డి7 పాసివ్ ఇన్‌కం వీసా(రూ.9 లక్షలు, 5–6 ఏళ్ల పౌరసత్వం)
మాల్టా పర్మినెంట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్(రూ. 90 లక్షల నుంచి రూ. 1 కోటీ 35 లక్షలు. శాశ్వత నివాసం. పౌరసత్వం ఉండదు.)
లాట్వియా రెసిడెన్సీ బై ఇవ్వెస్ట్‌మెంట్ (రూ. 54 లక్షలు, 10 ఏళ్ల పౌరసత్వం)
నార్త్ మాసిడోనియా సిటిజెన్ షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్ (రూ. 1.8 కోట్లు, 120 దేశాలకు వీసా లేని ప్రయాణ సదుపాయం)
వానువాటు సిటిజెన్‌షిప్ బై డొనేషన్ (రూ. 1 కోటి 10 లక్షలు, పౌరసత్వం)
డొమినికా సిటిజెన్‌షిప్ బై డొనేషన్(రూ.83 లక్షలు, పౌరసత్వం)
సెయింట్ లూసియా సిటిజెన్‌షిప్ బై డొనేషన్ (రూ.83 లక్షలు, పౌరసత్వం)
(చదవండి: ఈ చేప భూకంపాలను అంచనా వేయగలదట..!)