భారతదేశంతో పాటు.. చాలా దేశాలలో బంగారానికి భారీ డిమాండ్ ఉంది. అయితే ప్రపంచంలో స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల సంఖ్య చాలా తక్కువే. ఈ కథనంలో ఆ దేశాల గురించి తెలుసుకుందాం.
చైనా
ప్రపంచంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన చైనా.. స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశాల జాబితాలో కూడా ఒకటి. ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా.. 99.9 శాతం ప్యూర్ గోల్డ్ తయారు చేస్తుంది. బంగారాన్ని బయటకు తీసిన దగ్గర నుంచి.. శుద్దీకరణ వరకు అనేక దశలలో ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ అనే పద్దతులను ఉపయోగిస్తుంది. తద్వారా శుద్ధమైన బంగారం తయారు చేస్తుంది.
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ కేవలం అందమైన దేశం మాత్రమే కాదు.. అత్యంత స్వచ్ఛమైన బంగారం తయారు చేసే దేశం కూడా. ఈ దేశంలో తవ్వకం ద్వారా లభించే గోల్డ్ చాలా తక్కువ. అయితే.. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి బంగారాన్ని.. ఇక్కడున్న శుద్ధి కర్మాగారాల సాయంతో 99.9 శాతం స్వచ్ఛమైనదిగా తయారు చేస్తారు. గోల్డ్ బార్‌లను ప్రాసెస్ చేసి తిరిగి ఎగుమతి చేస్తుంది.
ఆస్ట్రేలియా
స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల జాబితాలో.. ఆస్ట్రేలియా కూడా ఒకటి. ఇక్కడ తవ్వకాల ద్వారా అధిక బంగారం లభ్యమవుతుంది. గనుల నుంచి ముడి పదార్థంగా లభించిన బంగారాన్ని ప్రాసెస్ చేసి.. 99.9 శాతం స్వచ్ఛమైన గోల్డ్ రూపంలోకి మారుస్తారు. ప్యూర్ గోల్డ్ తయారు చేయడానికి కావలసిన టెక్నాలజీ ఈ దేశంలో అందుబాటులో ఉంది.
యునైటెడ్ స్టేట్స్
అమెరికాలోని నెవాడా, అలాస్కా, క్యాలిఫోర్నియా, కొలరాడో వంటి ప్రాంతాల్లో బంగారం విరివిగా లభిస్తుంది. ఇక్కడ ముడి పదార్థంగా లభించే బంగారాన్ని.. వివిధ దశల్లో రసాయన పద్దతులను ఉపయోగించి శుద్ధి చేస్తారు. తరువాత నాణేలు, కడ్డీల రూపంలోకి మార్చి ఎగుమతులు చేయడం జరుగుతుంది. యూఎస్ బంగారు ఉత్పత్తులు స్థిరమైన స్వచ్ఛత & కఠినమైన పరీక్షకు ప్రసిద్ధి చెందాయి.
కెనడా
కెనడా పశ్చిమ ప్రాంతాలలోని బంగారు గనుల నుంచి ముడి పదార్థాలను తవ్వి తీస్తారు. సయనైడ్ లీచింగ్ పద్దతి తరువాత బంగారం వెలుపలికి తీసి.. ఎలెక్ట్రోలిటిక్ రిఫైనింగ్ పద్దతుల ద్వారా శుద్ధి చేస్తారు. ఇక్కడ తయారైన బంగారానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో డిమాండ్ ఉంది.
ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఊహించని మార్పులు
రష్యా
స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి చేసే దేశాల్లో ఒకటైన రష్యా.. ప్రస్తుతం ఎక్కువ బంగారం ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో ఆరవ స్థానంలో ఉంది. రష్యాలో బంగారాన్ని వెలికితీసేందుకు ప్రధానంగా సయనైడ్ లీచింగ్, గ్రావిటీ సెపరేషన్ పద్ధతులను ఉపయోగిస్తారు. బంగారం ఉన్న రాయిని బాగా పొడిచేసి, సోడియం సయనైడ్ ద్రావణంతో కలిపి సయనైడ్ లీచింగ్ ద్వారా ద్రవ రూపంలో వెలికితీస్తారు. తరువాత కార్బన్ పుల్ లేదా జింక్ ప్రిసిపిటేషన్ పద్ధతులు ద్వారా బంగారం తిరిగి ఘనరూపంలో మారుస్తారు. ఇలా అనేక పద్దతుల ద్వారా 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం తయారు చేస్తారు.


