ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కార్తీకం ప్రారంభం
భారీగా తరలిరానున్న భక్తులు
కోర్కెలు తీర్చే కొంగుబంగారం గర్భగుడి గోలెం
పరమ పవిత్రం.. శ్రీముఖలింగ క్షేత్రం
జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. ఈ క్షేత్రంలో మాత్రం ముఖందాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడిని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మంగళవారం నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో కార్తీకమాసం పూజలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీముఖలింగేశ్వరున్ని దర్శించుకుంటారు.
కోర్కెలు తీర్చే గోలెం..
స్వామివారి గర్భాలయంలో మూలవిరాట్టు వెనుక కనిపించే పెద్ద మట్టి గోలెం ఎంతో శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం. ఇందులో పాలు, బియ్యం, ధాన్యం, మంచినీరు, అన్నం, పండ్లు, బెల్లం.. ఇలా భక్తులు గోలెం నిండుగా వేసి మొక్కులు తీర్చుకుంటారు. దీని ఫలితంగా సంతాన యోగం, గ్రహదోషాలు నివారణ, వివాహాలు, ఉద్యోగాలు, విదేశాలలో చదువులు, ఇతర న్యాయపరమైన కోర్కెలు సిద్ధిస్తాయని స్థలపురాణంతోపాటు అర్చకులు చెబుతున్నారు. గోలెం పట్టుకుని పరమేశ్వరుని నిండు మనుసుతో ప్రార్థిస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.
ఆ భక్తులకు ప్రత్యేకం..
మన రాష్ట్రంలో రాయలసీమతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల భక్తులు గురువారం నుంచే కార్తీకమాసం పాటిస్తారు. ఇదే నెలలో దైవ చింతన, తీర్ధయాత్రలు చేయడం వారి సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీముఖలింగం క్షేత్రానికి నెల రోజులపాటు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.
చదవండి: సర్పదోషాలను పరిహరించే పంచలింగాల క్షేత్రం గురించి తెలుసా?
ఇదీ చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!