పోలీస్‌ బాస్‌...ఆన్‌ డ్యూటీ | Special Story On DSPs pass out from TG Police Academy | Sakshi
Sakshi News home page

పోలీస్‌ బాస్‌...ఆన్‌ డ్యూటీ

Oct 13 2026 4:16 AM | Updated on Oct 13 2026 4:16 AM

Special Story On DSPs pass out from TG Police Academy

కొందరికి బాగా సంపాదించాలని కల.. మరి కొందరికి రాజకీయంలో రాణించాలని లక్ష్యం... ఇంకొందరికి బాగా నటించాలని, పాడాలని, ఆడాలని ... ఇలా ప్రతీది కలే.. కాని ‘నా కలను నేను నిజం చేసుకున్నా’.. అని చెప్పేవారు కొందరే.. కలని సాకారం చేసుకున్నానని చెప్పినప్పుడు వారి కళ్లలో ఎవరూ చూడని ఓటములు, అవమానాలు, అసహనాలు... కాని ఆప్యాయత పంచే అయినవాళ్లుంటే అందలం కూడా అందుతుంది...అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది.

పోలీస్‌ ఆఫీసర్‌ కావాలంటే ఆషామాషీ కాదు.. అందులోనూ మహిళలకు ఇది మరింత కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా తీసుకుని కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో గ్రూప్‌ 1 లో ర్యాంకు కొట్టి సోమవారం కొలువులో చేరిన మహిళా డీఎస్పీలు సాక్షితో తమ స్వీయానుభవాలను పంచుకున్నారు.  

ఇష్టపడి ప్రయత్నిస్తే విజయమే
మా స్వస్థలం హన్మకొండ. నాన్న బిజినెస్‌ చేస్తారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను సివిల్స్‌ వైపు దృష్టి పెట్టాను. అలా మొదలైన నా ప్రిపరేషన్  ఏడేళ్లపాటు కొనసాగింది. పోలీస్‌ అకాడమీ శిక్షణకు వచ్చినప్పుడు కనీసం 500 మీటర్లు కూడా పరుగెత్త లేకపోయాను. కానీ ఇక్కడి వాతావరణం, ఇన్ స్ట్రక్టర్లు, అధికారుల ప్రోత్సాహం తో శిక్షణలో మెరుగయ్యాం. శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా ఉండేలా ప్రజాసేవకు మేం సిద్ధమయ్యామన్న స్థైర్యాన్ని ఈ శిక్షణ ఇచ్చింది. 
– నేహా అగర్వాల్‌

కిర ణ్‌ బేడీ నా స్ఫూర్తి
మా స్వస్థలం వరంగల్‌లోని ఎర్రగట్టుగుట్ట దత్తాత్రేయ కాలనీ. మా నాన్న రామగుండంలో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనను చూసి చిన్నప్పటి నుంచి పోలీస్‌ అవుతాను అనేదాన్ని. పోలీస్‌ యూనిఫాం అంటే నాకు ఎంతో ఇష్టం. ఐపీఎస్‌ కావాలన్న స్ఫూర్తికి కారణం కిరణ్‌ బేడీగారే. మూడు సార్లు సివిల్స్‌లో ఐపీఎస్‌ కోసం ప్రయత్నించినా ఓటమి తప్పలేదు. అప్పుడు కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు.  
– షగుఫ్తా యాస్మిన్‌

శిక్షణ ఎంతో నేర్పింది
మా స్వస్థలం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి. 2019లో గ్రాడ్యుయేషన్  పూర్తి అయిన తర్వాత సివిల్స్‌ ప్రిపరేషన్  మొదలు పెట్టాను. మా నాన్నకు ఒక్కతే కూతురిని. సివిల్స్‌ సాధించాలన్న నా కలను సాధించేందుకు నా తల్లిదండ్రులతోపాటు భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారు. సివిల్స్‌ కోసం ప్రయత్నించి మూడు సార్లు విఫలమైనా కుటుంబం అండగా నిలవడం వల్లే డీఎస్పీగా ఎంపికయ్యాను.
– వై. రుచిత చైతన్య.. కొండమల్లేపల్లి, నల్లగొండ జిల్లా

నాన్న వారసత్వం కొనసాగిస్తా...
పోలీస్‌గా నాన్న వారసత్వం కొనసాగించాలన్న లక్ష్యంతో నేను కూడా పోలీస్‌లోకి వచ్చాను. మా నాన్న సామ జయరాం అడిషనల్‌ ఎస్పీగా పనిచేసి ఈ ఏడాది ఆగస్టులో రిటైర్‌ అయ్యారు. నాకు చిన్నప్పటి నుంచి నాన్నను పోలీస్‌ యూనిఫాంలో చూసి పెరిగాను. నేను 2019లో లాన్  టెన్నిస్‌లో భారత్‌ తరఫున సౌత్‌ ఏషియన్  గేమ్స్‌లో పాల్గొని గెలుపొందాను. ఐపీఎస్‌గా పోలీస్‌ యూనిఫాంలో ఉండాలన్నది జీవిత లక్ష్యం. 
– సామ సాత్విక

నా భర్త ప్రోత్సాహంతోనే...
మా స్వస్థలం హైదరాబాద్‌లోని మోతీనగర్‌. బీఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తి చేశాను. 2011లో నాకు పెళ్లి అయ్యింది. నా భర్త కిరణ్‌కుమార్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తారు. ఆయన నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో ఐపీఎస్‌లకు కూడా ఫిట్నెస్‌ ట్రైనర్‌గా పనిచేశారు. అక్కడ మహిళా ఐపీఎస్‌లను చూసి..‘నువ్వు కూడా ఐపీఎస్‌ సాధించగలవు.. నేను అండగా ఉంటా ప్రయత్నించు..’ అని ప్రోత్సహించారు. 
– ఎస్‌ రాణి. హైదరాబాద్‌

అమ్మానాన్నల వల్లే...
నా పేరు సృజన. మాది పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం, పన్నూరు గ్రామం. అమ్మ రాణి. నాన్న రాజేశం సింగరేణిలో మస్టర్‌గా పనిచేస్తున్నారు. వాళ్లు అన్న, తమ్ముడితో సమానంగానే నన్ను చూసేవారు. సివిల్స్‌ సాధించాలన్న నా కలను నా తల్లిదండ్రులు ఎప్పుడూ కాదనలేదు. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో 55వ ర్యాంకు సాధించాను. విఫలమైనప్పుడు విమర్శలు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా ప్రయత్నించాను... అనుకున్నది సాధించాను.
– జి. సృజన, పెద్దపల్లి

– నాగోజు సత్యనారాయణ, సాక్షి క్రైం రిపోర్టర్, స్టేట్‌ బ్యూరో;  ఫొటోలు: ఎ.జాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement