అవసరమైతే ‘సింధూర్‌ 2.0’కు సిద్ధం | Army chief General Upendra Dwivedi says Indian army prepared for Operation Sindoor 2. 0 | Sakshi
Sakshi News home page

అవసరమైతే ‘సింధూర్‌ 2.0’కు సిద్ధం

May 31 2026 1:08 AM | Updated on May 31 2026 1:08 AM

Army chief General Upendra Dwivedi says Indian army prepared for Operation Sindoor 2. 0

ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టీకరణ 

పుణే: ఒకవేళ ‘ఆపరేషన్‌ సింధూర్‌ 2.0’ అవసరం తలెత్తితే అందుకు భారత సైనిక దళాలు సర్వసన్నద్ధం ఉన్నాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. భూతల, గగనతల, సముద్ర యుద్ధానికి అతీతంగా ఆధునిక బహుళ–రంగ యుద్ధం కోసం త్రివిధ దళాలు సమన్వయాన్ని పెంచుకుంటున్నాయని తెలిపారు. మహారాష్ట్రలోని పుణే నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(డీఎన్‌ఏ)లో శనివారం పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. 

భారత్, పాకిస్తాన్‌ మధ్య ఘర్షణలు తాత్కాలికంగా నిలిచి పోయినప్పటికీ.. మళ్లీ మొదలైతే అందుకోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గత ఏడాది పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన సింధూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌ భూభాగంలో ఉగ్రవాద వివరాలు, శిక్షణ కేంద్రాలను సైన్యం నేలమట్టం చేసింది. పలువురు ముష్కరులను హతమార్చింది. పాక్‌ యుద్ధ విమానాలను కూల్చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ ఇంకా కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2.0 ఎప్పుడు మొదలైనా సరే వెంటనే రంగంలోకి దిగేలా మన సైన్యం అన్ని రకాల సన్నాహాలతో సిద్ధంగా ఉందన్నారు. 

యుద్ధక్షేత్రాలు పారదర్శకం 
భవిష్యత్తులో యుద్ధం కేవలం భూమి, సముద్రం, గగనతలానికి పరిమితం కాదని జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. అంతరిక్ష యుద్ధాలు, సైబర్‌ సైబర్‌ యుద్ధాలు జరుగుతాయన్నారు. యుద్ధ రీతులు నానాటికీ మారిపోతున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుద్ధక్షేత్రాలు పారదర్శకంగా మారాయని వివరించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ప్రతి కదలిక అవతలివారికి వెంటనే తెలిసిపోతుందన్నారు. అందుకే సైనిక మోహరింపులు, బలగాల రక్షణ చర్యల విషయంలో సైనిక వ్యూహకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనలో భారతదేశ సంకల్పాన్ని, సాయుధ దళాల సామర్థ్యాన్ని ఆపరేషన్‌ సింధూర్‌ చాటిచెప్పిందని ఉద్ఘాటించారు. సమగ్ర ప్రణాళిక, రియల్‌ టైమ్‌ నిఘా, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన వాయు రక్షణ, సురక్షిత సమాచార మార్పిడి, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను ఈ ఆపరేషన్‌ నొక్కిచెప్పిందని వివరించారు. భారత సైన్యం ఆధునీకరణ మార్గంలో ముందుకు సాగుతోందన్నారు. ‘భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తి’గా మనం రూపాంతరం చెందుతున్నామని, ఇందులో యువతరం పాత్ర కీలకమని స్పష్టంచేశారు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement