‘గ్రూప్–1 పరీక్ష పత్రాల మూల్యాంకనం’ దర్యాప్తుపై హైకోర్టు ప్రశ్న
ఆరునెలలు కావాలా? ఇప్పటి వరకు ఏం చేశారు?
పూర్తి వివరాలతో అఫిడవిట్ వేయండి
సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌కు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రధాన పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించేందుకు 6 నెలల సమయం పడుతుందన్న సిట్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. దర్యాప్తు ఏ అంశాలపై చేయాలన్న దానిపై ఇప్పటికే తాము తమ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నామని, ఆ ఉత్తర్వులను సక్రమంగా అర్థం చేసుకోకుండా దర్యాప్తు నివేదిక సమర్పించేందుకు ఆరు నెలల సమయం కోరడమేమిటంటూ సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్‌ను నిలదీసింది.
సిట్ ఏర్పాటుతో పాటు దర్యాప్తునకు తాము ఆదేశాలు జారీ చేసి నెలరోజులు పూర్తయిందని గుర్తు చేసింది. అయినా కూడా ఇప్పటికీ దర్యాప్తు విషయంలో ఏమీ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ఏవేవో చెబుతున్నారంది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు 300 మంది అభ్యర్థుల జవాబు పత్రాలను పంపితే సరిపోతుందని పేర్కొంది. అయితే సిట్ మాత్రం లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నట్లు చెబుతోందని, ఇన్ని డాక్యుమెంట్లు ఎందుకు అవసరమో తమకు అర్థం కావడం లేదంది.
దర్యాప్తు విషయంలో తమ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియచేయాలని సిట్‌ను ఆదేశించింది. అలాగే దర్యాప్తు పూర్తి చేసి నివేదిక ఇచ్చేందుకు ఎంత కాలం పడుతుంది.. అందుకు గల కారణాలు ఏమిటో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలంది. అలాగే 1998 గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయలేదని తేల్చి చెప్పింది.
నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయకుండా వారిని ఊరికే కూర్చోబెట్టి ప్రజాధనాన్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్నారని ఆక్షేపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని కోర్టుకు పిలిపిస్తే తప్ప తమ ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదంది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కోర్టు ముందు హాజరైన రవిశంకర్ అయ్యన్నార్...
ఈ సందర్భంగా సిట్ తరఫు న్యాయవాది పాణిని సోమయాజీ స్పందిస్తూ, దర్యాప్తు నివేదిక సమరి్పంచేందుకు గడువు కావాలని కోరారు. ఎందుకు గడువు కావాలన్న దానిపై సోమయాజీ స్పష్టతనివ్వకపోవడంతో సిట్‌కు నేతృత్వం వహిస్తున్న రవిశంకర్ అయ్యన్నార్‌ను ఆన్‌లైన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో రవిశంకర్ అయ్యన్నార్ ధర్మాసనం ముందు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. దర్యాప్తు నివేదిక సమర్పణకు ఆరు నెలల సమయం కావాలని కోరారు. డిజిటల్ మూల్యాంకనం విధానంలో ఉన్న సమాధాన పత్రాలను భౌతిక రూపంలోకి తీసుకొచి్చ, వాటిని జిరాక్స్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాల్సి ఉందన్నారు.
దాదాపు లక్షన్నర డాక్యుమెంట్లను జిరాక్స్ తీస్తున్నామని తెలిపారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన తరువాత అక్కడి నిపుణులు ప్రతీ పేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఆ తరువాతనే నివేదిక ఇస్తారని, దాని ఆధారంగా తాము నివేదికను సిద్ధం చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు చెప్పారని వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం, అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎందుకు అంత సమయం కావాలో కారణాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన్ను ధర్మాసనం ఆదేశించింది.


