
ఒక వ్యక్తికి జీవితంలో కష్టాలు సర్వసాధారణమే. పోరాడి గెలుస్తుండగా..లాగిపెట్టి అమాంతం కిందపడేసే కష్టాలు హఠాత్తుగా ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంటే..గెలుపు అన్న మాట భయంగా మారిపోతుంది. మళ్లీ తిరిగి లేచి నిలబడటానికి ధైర్యం చాలదు కూడా. కానీ ఈ మహిళ గుక్కపెట్టి ఏడిపించిన కష్టానికి తన దైన శైలిలో సమాధానం ఇచ్చి నిలబడటమే గాక..ఆ కష్టమే తోకముడిచి పారిపోయేలా అచంచలంగా ఎదిగింది. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఆ మహిళే నీతు మేడమ్‌గా పేరుగాంచిన నీతుసింగ్. జార్ఖండ్‌లోని గిరిదిహ్‌లో జన్మించిన నీతు మూడేళ్ల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి కిషోర్ దేవ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబంలో తన అన్నయ్య, ఆరుగురు సోదరిమణులతో కలసి పెరిగింది. చిన్ననాటి నుంచే కష్టం విలువ తెలిసిన ఆమె చదువులో బాగా రాణించేది.
కార్మెల్ కాన్వెంట్, సెయింట్ జాన్స్ స్కూల్ (వారణాసి)లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. వినోబా భావే విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఢిల్లీలోని క్యాంపస్ లా సెంటర్‌లో ఎల్‌ఎల్బీ పూర్తి చేసింది. అప్పుడే కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించింది. ఆ సెంటర్‌ని ప్రారంభించిన ఒక ఏడాదికి రాజీవ్ సౌమిత్రను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పారామౌంట్ కోచింగ్ సెంటర్‌ని విజయవంతంగా నడిపారు.
దాదాపు రూ. 200 కోట్ల టర్నోవర్ సంస్థగా మలిచారు. పోటీ పరీక్షల కోసం నీతు ఇంగ్లీష్ వాల్యూమ్1 అనే పుస్తకాన్ని రచించింది. ఇది అత్యధికంగా అమ్ముడైన కాంపిటీషన్ బుక్‌గా నిలిచింది కూడా. ఇంతలో ఆమె వైవాహిక బంధంలో మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. అది రాను రాను మరింతగా క్షీణించే స్థాయికి వచ్చేసింది. ఆమె కూడా ఆ కోచింగ్ సెంటర్‌లో దాదాపు 50% వాటాదారు అయినా..ఆమెభర్త ఆగస్టు 5,2015న బౌన్సర్ల చేత బలవంతంగా బయటకు గెంటేశాడు. దాంతో మళ్లీ రోడ్డు మీదకు వచ్చేసింది నీతు జీవతం. వివాహం విచ్ఛిన్నమవ్వడమే గాక లాభాల బాట పట్టించిన వ్యాపారం కూడా పోయింది.
తగ్గేదేలే అంటూ లేచి నిలబడింది..
మళ్లీ పరిస్థితి చలికిలబడినట్లు అయినా..అచంచలమైన ఆత్మవిశ్వాసంతో లేచి నిలబడి ఆ దిశగా సాగింది. ఈసారి తన తండ్రి దివంగత కిషోర్ దేవ్ పేరుతో కేడీ కోచింగ్ సెంటర్‌ని ప్రారంభించింది. చూస్తుండగానే అచిరకాలంలోనే ఆ సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్‌లో ర్యాంకర్లుగా మార్చే సంస్థగా కేడీ సంస్థ పేరుతెచ్చుకుంది. ఇలా మంచి లాభాలతో దూసుకుపోతున్న కోచింగ్ సెంటర్‌కి మళ్లీ మహమ్మారి రూపంలో బ్రేక్ పడింది.
అయినా సరే టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా అడుగులేసి ఆన్‌లైన కోచింగ్‌లు ఇవ్వడం ప్రారంభించింది. అలా ఆమె యూట్యూబ్ ఛానెల్‌కి సుమారు రెండు మిలయన్ల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు కలిగి ఉండటమే గాక, వేలాదిమంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులకు తీర్చిదిద్దింది. అంతేగాదు తన కోచింగ్ సెంటర్‌తో పేద కుటుంబాలు, అనాథలు, వృద్ధులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది
నీతు. బాల్యంలో తండ్రిని కోల్పోవడం దగ్గర నంచి మొదలైన ఎదురుదెబ్బలు వెవాహిక జీవితం కోల్పోవటం, నమ్మక ద్రోహం వరకు భరింపరాని కష్టాలను కడగండ్లను ఎందుర్కొంది. అయినా ఎక్కడ నా వల్ల కాదు అని గివ్ అప్(చేతులెత్తేయ లేదు) ఇవ్వలేదు. జీరో నుంచి మళ్లీ మెదలు పెట్టినా.. చివరికి గెలుపు మాత్రం నాదే అని ప్రూవ్ చేసింది నీతు మేడమ్. చిన్న చిన్న కష్టాలకే భయపడే నేటి యువతరానికి నీతు సింగ్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
(చదవండి: ఒంటరితనం కోసం 'రిటైల్ థెరపీ'..! కరణ్ జోహార్ హెల్త్ టిప్స్)