లోప్రొఫైల్‌... హై–ఎనర్జీ | Senior Advocate V Mohana Elevated To Supreme Court Judge | Sakshi
Sakshi News home page

లోప్రొఫైల్‌... హై–ఎనర్జీ

Jun 3 2026 7:05 AM | Updated on Jun 3 2026 7:05 AM

Senior Advocate V Mohana Elevated To Supreme Court Judge

విజయపథం

సీనియర్‌ న్యాయవాది వి.మోహనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. జస్టిస్‌ ఇందూ మల్హోత్రా తరువాత బార్‌ నుండి నేరుగా సుప్రీంకోర్టుకు పదోన్నతి కోసం కొలీజియం సిఫారసు చేసిన రెండవ మహిళగా వి.మోహన నిలిచారు. పట్టుదల, క్రమశిక్షణతో సాగిన అద్భుత న్యాయ ప్రస్థానానికి ఆమె బలమైన ప్రతీక. చెన్నైకి చెందిన మోహన ‘లోప్రొఫైల్‌ లాయర్‌’గా... ‘నిరాడంబర న్యాయవాది’గా పేరు తెచ్చుకున్నారు.

చేదు అనుభవాలు ఎన్నో...
న్యాయవాదిగా మోహన ప్రయాణం నల్లేరు మీద నడకేమీ కాదు. ఎన్నో సవాళ్లు, చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆమెకు కోర్టులో ఎదురైన చేదు అనుభవాలలో ఒకటి...

ఒక అత్యవసర కేసు విచారణ సందర్భంగా ఒక సీనియర్‌ న్యాయవాది... ‘మహిళలు కోర్టులో గొంతెత్తి అరవకూడదు’ అని విసుక్కోవడమే కాదు... ‘ఇలా అరిచేవాళ్లు ఇంట్లోనే ఉండాలి’ అని కూడా అన్నాడు. అయినప్పటికీ మోహన సంయమనం కోల్పోలేదు. అయితే ఈ సంఘటనను ‘చేదు జ్ఞాపకం’గా చూడరు మోహన. కోర్టులో హుందాగా ప్రవర్తించడం, సంయమనం పాటించడానికి సంబంధించి ఒక పాఠంగా గుర్తు పెట్టుకుంటారు.

ఆ నిర్ణయంతో...
న్యాయవ్యవస్థలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటైన అడ్వకేట్‌–ఆన్‌–రికార్డ్‌ (ఏసీఆర్‌) పరీక్షలో 1996లో ఉత్తీర్ణత సాధించారు మోహన. సుప్రీంకోర్టులో నేరుగా కేసులు దాఖలు చేయడానికి ‘ఏసీఆర్‌’ ముఖద్వారం లాంటిది. దిల్లీకి వెళ్లాలనే  నిర్ణయం మోహన వృత్తి జీవితాన్ని మార్చివేసింది. దిల్లీకి వచ్చిన తరువాత అప్పటి అడ్వకేట్‌–ఆన్‌–రికార్డ్‌ ఇందూ మల్హోత్రాతో కలిసి పనిచేశారు. మల్హోత్రాతో కలిసి పనిచేసిన రోజులు మోహన వృత్తిజీవితంలో కీలకమైన దశగా నిలిచింది. ఆ సమయంలోనే కపిల్‌ సిబల్, అరుణ్‌ జైట్లీ, పి.చిదంబరం వంటి దేశంలోని అత్యుత్తమ న్యాయ నిపుణులతో పరిచయం ఏర్పడింది. కోర్టు అధికారిక న్యాయపత్రిక సుప్రీం కోర్టు రిపోర్ట్స్‌(ఎస్‌సీఆర్‌) గౌరవ సంపాదకురాలిగా కూడా  పనిచేశారు మోహన.

అమ్మ చెప్పిన మాట
మా కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు లేరు. కోయంబత్తూర్‌ లా కాలేజీలో చదువుకున్నాను. నేను చదివిన కాలేజీలో మహిళల హాస్టల్‌ లేదు. కాలేజీలో కనీస మౌలిక సదుపాయాలూ ఉండేవి కావు. కాలేజీ అద్దె భవనంలో పనిచేసేది. ‘నువ్వు న్యాయశాస్త్రం చదవాలి. సమాజం నిన్ను అణచివేయాలని ప్రయత్నించినప్పుడు అది నీకు గొంతుకను ఇస్తుంది. ధైర్యాన్ని ఇస్తుంది’ అని అమ్మ నాతో అనేవారు. అమ్మ మాటలే నాకు దారి చూపి ధైర్యాన్ని ఇచ్చాయి. – వి.మోహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement